న్యూఢిల్లీ : లోక్‌సభ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీకి భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఢిల్లీ పీసీసీ అధ్యక్షుడు అర్విందర్ సింగ్ లవ్లీ తన పదవికి రాజీనామా చేశారు. ఆమ్ ఆద్మీ పార్టీతో పొత్తు పెట్టుకున్నందుకు తాను పార్టీ పదవి నుంచి తప్పుకుంటున్నట్టు తెలిపారు. ఆప్‌తో పొత్తును ఢిల్లీ యూనిట్ అంగీకరించలేదని వెల్లడించారు. ఈ మేరకు కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేకు రాసిన లేఖలో పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీపై నిరాధార అవినీతి ఆరోపణలతోనే ఆ పార్టీ ఏర్పాటైందని, అలాంటి పార్టీతో పొత్తు వద్దని ఢిల్లీ శాఖ ఏకగ్రీవంగా తీర్మానం చేసిందన్నారు. అయినప్పటికీ అధిష్ఠానం నిర్ణయం మేరకు తాము సమర్ధించినట్టు తెలిపారు.
ఇదిలా ఉండగా పీసీసీ అధ్యక్ష హోదాలో పార్టీ పదవుల నియామకాలకు ఢిల్లీ ఇన్‌ఛార్జీ, పార్టీ ప్రధాన కార్యదర్శి దీపక్ బబరియా తనను అనుమతించడం లేదని ఆరోపించారు. ఏక పక్షంగా నిర్ణయాలు తీసుకుంటున్నారని , తనపై తీవ్ర మైన ఒత్తిడి తెస్తున్నారని, ఆరోపించారు. పొత్తులో భాగంగా పార్టీకి మూడు సీట్లే కేటాయించడాన్ని తప్పు పట్టారు. పార్టీ ప్రయోజనాల కోసం అంగీకరించామని, అయితే ఢిల్లీ కాంగ్రెస్‌తో సంబంధం లేనివారిని అభ్యర్థులుగా ప్రకటించారని చెప్పారు. ఈ నేపథ్యంలో పార్టీ కార్యకర్తలు, నాయకుల ప్రయోజనాలను రక్షించలేని తాను పదవిలో కొనసాగడం మంచిది కాదని పేర్కొన్నారు.