Monday, January 20, 2025

అంతర్జాతీయ మాదక ద్రవ్యాల రాకెట్ గుట్టు రట్టు..

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : దేశ వ్యాప్తంగా భారీ ఎత్తున సాగుతున్న మాదక ద్రవ్యాల అంతర్జాతీయ రాకెట్ నెట్‌వర్క్‌ను నార్కొటిక్స్ కంట్రోల్ బ్యూరో ( ఎన్‌సిబి ) ఒకే ఒక ఆపరేషన్‌తో ఛేదించగలిగింది. దాదాపు 15,000 లైసెర్జిక్ యాసిడ్ డైతైలమైడ్ (ఎల్‌ఎస్‌డి) ప్యాకెట్లను స్వాధీనం చేసుకుంది. డార్క్ నెట్ లేదా డార్క్ వెబ్‌లో ఈ రాకెట్‌ను నడుపుతున్న ఆరుగురిని అరెస్ట్ చేశారు. పట్టుబడిన ఈ ఎల్‌ఎస్‌డి విలువ అంతర్జాతీయ మార్కెట్‌లో దాదాపు రూ. 10 కోట్లు ( ఒక్కో ప్యాకెట్ రూ.5 వేలు నుంచి రూ. 7 వేలు వరకు విలువ చేస్తాయి) ఉంటుందని అధికారులు అంచనా వేశారు. అరెస్టయిన వారు 2528 ఏళ్ల లోపు యువకులు , విద్యార్థులు. వీరంతా ఎంతో విద్యావంతులు. వీరిలో ఒక విద్యార్థి గోవాకు చెందిన వాడు.

నొయిడా ప్రైవేట్ యూనివర్శిటీలో నమోదు చేయించుకున్నాడు. మరొకరు ఢిల్లీ కుర్రాడు ఈ ప్యాకెట్లలో కొన్నిటిని కశ్మీర్‌కు పంపే ప్రయత్నం చేస్తున్నాడు. వీరిలో ఒక బాలిక కూడా ఉంది. ఎన్‌సిఆర్ నుంచి అరెస్టయింది. జైపూర్‌కు చెందిన సరఫరా దారుడు, కేరళకు చెందిన మరోవ్యక్తి అరెస్టయిన వారిలో ఉన్నారు. ఈజీమనీ కోసం సీక్రెట్ ఇంటెర్నెట్ ఆధారంగా ‘వికెర్’ వంటి అమెరికా సాఫ్ట్‌వేర్ మెసేజ్ యాప్‌ను ఉపయోగించి ఈ వ్యవహారాన్ని గుట్టుచప్పుడు కాకుండా నిర్వహిస్తున్నారని అధికారులు తెలిపారు. ఎల్‌ఎస్‌డి అన్నది సింథటిక్ రసాయనాల ఆధారిత మాదక ద్రవ్యం. ఇది మత్తుతోపాటు భ్రాంతి కలిగించే పదార్ధం స్టాంప్ పేపర్‌లో సగం సైజు ఉండే ప్యాకెట్లపై రంగు పూసి రవాణా చేస్తున్నారు.

దేశం మొత్తం మీద ఇంత భారీ స్థాయిలో సింగిల్ ఆపరేషన్‌లో ఎల్‌ఎస్‌డిని స్వాధీనం చేసుకోవడం ఇదే మొదటిసారి అని , ఇంతవరకు ఆరుగురు అరెస్ట్ అయ్యారని, మరో ట్రయల్ కోసం ప్రయత్నిస్తున్నామని ఎన్‌సిబి డిప్యూటీ డైరెక్టర్ జనరల్ ( నార్త్ రీజియన్) జ్ఞానేశ్వర్ సింగ్ విలేఖరులకు వెల్లడించారు. రెండు వారాల పాటు సాగిన ఈ ఆపరేషన్‌లో మొత్తం 14,961 ప్యాకెట్లు స్వాధీనం అయ్యాయి. ఈ ప్యాకెట్లపై “గామా గోబ్లిన్ ,అసురుని పవిత్ర ఆత్మ” బ్రాండ్ ముద్రించి ఉందని సింగ్ చెప్పారు. ఇప్పటివరకు కర్ణాటక పోలీస్‌లు 2021 లో 5000 ఎల్‌ఎస్‌డి ప్యాకెట్లను, అదే సంఖ్యలో2022 లో కోల్‌కతా లోను పట్టుకోగలిగారని ఉదహరించారు.

యువకుల్లో ఎల్‌ఎస్‌డి విపరీతంగా వ్యాపిస్తోందని, దీనివల్ల తీవ్ర అనారోగ్య సమస్యలు వస్తాయని సింగ్ చెప్పారు. ఇప్పుడు పట్టుబడిన నెట్‌వర్క్ అమెరికా, పోలండ్, నెదర్లాండ్, భారత్‌ల్లో విస్తరించిందని ఎన్‌సిబి వెల్లడించింది. ఈ ఆపరేషన్‌లో 2.5 కిలోల గంజాయిని, రూ. 24.65 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు . నిందితులు డార్క్ నెట్ ద్వారా క్రిప్టో వాలెట్స్, క్రిప్టో కరెన్సీ ఉపయోగించి లావాదేవీలు జరుపుతున్నారని అధికారులు తెలిపారు. కొరియర్ల ద్వారా, పోస్టల్ నెట్‌వర్క్ ద్వారా నౌకల ద్వారా రవాణా చేస్తుంటారని చెప్పారు. వీరి క్రిప్టో నిధులను స్తంభింప చేయడానికి ఎన్‌సిబి ప్రయత్నిస్తోందన్నారు.

తాము నిరోధించగలిగిన సరఫరా దారులు కానీ వినియోగదారులు కానీ ప్రత్యక్షంగా దొరకరని, ప్రతీవ్యవహారం డార్క్ నెట్ లోనే జరుగుతోందని సింగ్ తెలిపారు. ఫెడరల్ యాంటీ నార్కొటిక్స్ ఏజెన్సీ ఢిల్లీ జోనల్ యూనిట్ స్పెషల్ టీమ్ ఈ ఆపరేషన్ నిర్వహించిందని తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News