Friday, November 22, 2024

మహిళా రెజ్లర్ల కంట రక్తకన్నీరు

- Advertisement -
- Advertisement -

పిడి గుద్దులతో ప్రత్యర్థులను మట్టి కరిపించిన మన ఛాంపియన్ రెజ్లర్లు చివరకు ఖాకీల నెట్టివేతకు గురై, జాతి సమక్షంలో జరిగిన అవమానాన్ని పంటి బిగువున భరించక తప్పలేదు. 28, మే ఆదివారం రోజున దేశ రాజధాని నగరంలో రంగరంగ వైభోగంగా నూతన పార్లమెంట్ భవనం ప్రారంభోత్సవం జరుగుతుండగా దాని ముందు మహా పంచాయత్ కార్యక్రమాన్ని నిర్వహించాలని రెజ్లర్లు అక్కడికి వెళ్లారు. ఢిల్లీ పోలీసులు మాత్రం వారిని మన దేశపు ఒలింపియన్ రెజ్లర్లుగా చూడకుండా, ఆడ మగ తేడాని లెక్క చేయకుండా తోపులాట, తొక్కిసలాటను సృష్టించి తమ వాహనాల్లోకి వారిని లాగి పడేసి అదుపులోకి తీసుకొన్నారు. ఆ దృశ్యాలు చూస్తుంటే సంయమనం కోల్పోయిన లాఠీలు వారిని మనుషులుగా కూడా పరిగణించలేదనిపిస్తుంది.

ముందస్తు ప్రణాళికలు, అంచనాలు వేసుకొని ఇలాంటి అమానవీయ దుర్ఘటన జరిగే అవకాశాలు లేకుండా శాంతి భద్రతలు కాపాడవలసిన బాధ్యత అక్కడి పోలీసులపై ఉంది. కేవలం ఉక్కుపాద ప్రయోగాన్నే నమ్ముకున్న పోలీసులు భారత జాతిని ప్రపంచం ముందు తల దించుకొనేలా చేశారు. ప్రపంచ స్థాయి క్రీడల్లో దేశ పతాకాన్ని సగర్వంగా ఎగరేసిన వారి హక్కులను కాలరాసి వారి విజయాలకు చిన్నబుచ్చారు. దాంతో ఆగకుండా జాతీయ ప్రతిష్ఠకు భంగం కలిగించారనే ఆరోపణలతో ఢిల్లీ పోలీసులు రెజ్లర్లపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేశా రు. ఢిల్లీలోని పోలీసు వ్యవస్థ కేంద్ర గృహ మంత్రిత్వ శాఖ ఆధీనంలో పని చేస్తుంది.
ప్రపంచ స్థాయిలో గెలుపు కైవసం చేసుకున్న వారికి ప్రపంచమే తోడొస్తుంది అన్నట్లుగా రెజ్లర్లపై ఖాకీల హద్దుమీరిన ప్రవర్తనను వివిధ క్రీడా సంఘాలు తప్పుపట్టడం మొదలైంది. భారత రెజ్లింగ్ సమాఖ్య అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ పై చర్యల కోసం నిరసన చేస్తున్న క్రీడా విజేతలతో పోలీసులు వ్యవహరించిన తీరును అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ తప్పిపట్టింది.

భారత రెజ్లర్లపై జరిగిన దుస్సంఘటన కలత చెందేలా ఉందని, వారు చేస్తున్న ఆరోపణలపై చట్టప్రకారం చర్యలు చేపట్టాలని ఐఒసి కోరింది. దీన్ని ఖండిస్తూ ప్రపంచ రెజ్లింగ్ సమాఖ్య సకాలంలో ఎన్నికలు నిర్వహించకపోతే భారత రెజ్లింగ్ సమాఖ్య గుర్తింపును రద్దు చేస్తామని ప్రకటించింది. దేశ వ్యాప్తంగా కూడా వివిధ క్రీడా, కార్మిక, ఉద్యోగ, హక్కుల సంఘాలు నిరసన కార్యక్రమాలు చేపట్టాయి. రెజ్లర్ల పోరాటానికి మద్దతుగా హైదరాబాద్‌లో టిఎస్ యుటిఎఫ్ ర్యాలీ నిర్వహించింది. రెజ్లర్లపై పోలీసులు ప్రవర్తించిన తీరును ఖండిస్తున్నానని తమిళనాడు సిఎం స్టాలిన్ ప్రకటించారు. బ్రిజ్ భూషణ్ లాంటి నిందితులను భాజపా రక్షిస్తున్నదని కాంగ్రె స్ ఆరోపించింది. రెజ్లర్లకు సమాజ్‌వాదీ పార్టీ, బిఎస్‌పి సంఘీభావం తెలిపాయి.

ఈ సంఘటన తర్వాత పోలీసులు జంతర్ మంతర్ వద్ద రెజ్లర్ల దీక్ష శిబిరాలను తొలగించారు. గత 38 రోజులుగా అక్కడ సాగుతున్న వారి ఆందోళన కార్యక్రమాన్ని ఇక జంతర్ మంతర్ వద్ద కొనసాగనివ్వమని, మరో చోటైతే అనుమతిస్తామని సూచించారు. ప్రభుత్వ చర్యకు తీవ్ర ఆవేదనకు గురైన రెజ్లర్లు తమ నిరసన కార్యక్రమాన్ని ఉధృతం చేసే క్రమంలో తాము సాధించిన పతకాలను గంగా నదిలో నిమజ్జనం చేస్తామని ప్రకటించారు. మే 30న రెజ్లర్లు తమ కుటుంబాలు, మద్దతుదారులతో హరిద్వార్ చేరుకొని ఒలింపిక్, ప్రపంచ ఛాంపియన్ షిప్ పతకాలను గంగలో కలిపేందుకు సిద్ధమై ముందుగా కొంతసేపు మౌనదీక్ష చేశారు. తమ దుస్థితిపై కన్నీరు పెట్టుకున్నారు.

నేతలపై విమర్శలు గుప్పించారు. అయితే చివరి నిమిషంలో ఖాప్, రైతు సంఘాల నేతలు వారిని నిలువరించి పతకాలను త్యాగం చేయడం జాతి యావత్తును చెందిన విషయమని, కేంద్ర ప్రభుత్వానికి మరి కొంత గడువుద్దామని సూచించారు. 5 రోజుల్లో ప్రభుత్వం చర్యలు తీసుకోకపోతే ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తామని రెజ్లర్లు స్పష్టం చేశారు. ‘పతకాలు పోయాక వాటితో పాటు మా ప్రాణాలు కూడా వదులుకున్నట్లే. ఇక ఇండియా గేట్ వద్ద ఆమరణ దీక్షయే మాకు శరణ్యమని’ వారు అంటున్నారు. ఇండియా గేట్ ఆందోళనకు వేదిక కాదని, అక్కడ రెజ్లర్ల దీక్షకు అనుమతించేది లేదని ఢిల్లీ పోలీసులు తెలిపారు.
మహిళల పట్ల లింగ వివక్షాపూరిత లేదా లైంగిక వేధింపులు, దాడులు లేని చోటు ఎక్కడా కానరాదేమో! సిగ్గుతో, భయంతో బయటికి చెప్పుకోలేని సంఘటనలే కోకొల్లలు.

మన దేశంలో ఒక మహిళ తాను లైంగిక ఇబ్బందులకు గురవున్నానని బహిరంగంగా చెబితే దాంట్లో అబద్ధం ఉండే అవకాశాలు అతి తక్కువ. ఈ ఏడాది జనవరిలో జాతీయ రెజ్లర్లు అయిన సాక్షి మాలిక్, భజరంగ్ పునియా నేతృత్వంలో శిక్షణ పొందుతున్న మహిళా రెజ్లర్లు భారత రెజ్లింగ్ ఫెడరేషన్ అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ తమను లైంగిక వేధింపులకు గురి చేస్తున్నాడని ఢిల్లీలో ఆందోళన చేపట్టారు.బ్రిజ్ భూషణ్ బిజెపికు చెందిన పార్లమెంట్ సభ్యుడు. 2011 నుండి ఆయన ఫెడరేషన్ పదవిలో ఉన్నారు. కోచ్‌లు, ఫెడరేషన్ ప్రెసిడెంట్ మహిళా అథ్లెట్‌లను లైంగికంగా వేధిస్తున్నారని వినీష్ ఫోగట్ అన్నారు. జాతీయ శిక్షణ శిబిరాల్లో కోచ్‌లు, ఫెడ్ అధ్యక్షుడు మహిళలను వేధిస్తున్నారని, నాకు తెలిసి సుమారు 20 మంది తనతో ఈ విషయం చెప్పుకున్నారని మరొక అథ్లెట్ బయటపెట్టారు. ఎలాంటి సాక్ష్యాధారాలు లేకుండా తనపై ఆరోపణలు చేయడం ఖండిస్తున్నానని బ్రిజ్ భూషణ్ పదే పదే ఒకే మాట అంటున్నారు.
క్రీడల మంత్రిత్వ అధికారులు మాత్రం ఇది తీవ్రమైన విషయం, దీని గురించి 72 గంటల్లో ఫెడరేషన్ నుండి జవాబును కోరుతామని చెప్పారు. ఈ మధ్య కాలంలో జాతీయ సైక్లింగ్ కోచ్ ఒకరిని లైంగిక వేధింపుల ఫిర్యాదుగా సస్పెండ్ చేశారు. మిగితా కాలం జవాబు లేకుండానే గడిచిపోయింది. వేధింపుకు పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిపై చర్యలు తీసుకొనే దాకా తాము ఎలాంటి పోటీలోనూ పాల్గొనేది లేదని ఆడ, మగ రెజ్లర్లు ప్రకటించారు.ఫెడ్ ప్రెసిడెంట్‌ను తొలగించే దాకా అంతర్జాతీయ టోర్నమెంట్స్‌కి సైతం వెళ్ళేది లేదన్నారు. నెల రోజుల్లో విచారణ జరిపి నివేదిక ఇస్తామని కేంద్రం హామీ ఇచ్చింది. అయితే విచారణ పూర్తయినా ఆ నివేదిక బయటికి రాకపోవడంతో ఏప్రిల్ చివరి వారంలో వారి ఆందోళన తిరిగి ప్రారంభించారు. ఏప్రిల్ 21న ఢిల్లీలోని కన్నాట్ ప్లేస్ పోలీస్ స్టేషన్‌లో ఇద్దరు మహిళా రెజ్లర్లు రాతపూర్వకంగా బ్రిజ్ భూషణ్ పై ఫిర్యాదు చేశారు.

తమ పొట్టను, పై భాగాన్ని తన చేతులతో ఎలా తాకేవారో అందులో రాశారని పత్రికల్లో వచ్చింది. ఈ ఆరోపణలపై బ్రిజ్ భూషణ్ పై కేసును ఎందుకు రిజిస్టర్ చేయలేదని సుప్రీంకోర్టు ఢిల్లీ పోలీసులను సంజాయిషీ కోరింది. ఆయనపై కేసువేస్తామని పోలీసులు మే చివర్లో సమాధానమిచ్చారు. కేంద్ర ప్రభుత్వ ప్రమేయంతోనే పోలీసులు బ్రిజ్ భూషణ్ పై ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదనేది స్పష్టమవుతోంది. ఈ వరుస క్రమంలోనే నూతన పార్లమెంట్ భవన ప్రారంభం, న్యాయం కోసం రెజ్లర్ల పోరాటం పోటీగా వచ్చాయి. పీఠాధిపతులు వెంట రాగా సింగోల్ పట్టుకొని కొత్త పార్లమెంట్‌లోకి అడుగుపెట్టిన ప్రధాని మోడీకి ఈ మహిళల ఆర్తనాదాలు చెవిన పడలేదేమో! ప్రజలకు మాత్రం భవన ప్రారంభ మంత్రోచ్చారణ కన్నా మహిళల దుఃఖ శాపనార్థాలే వినిపించాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News