Friday, December 27, 2024

పలువురు జర్నలిస్టుల ఇళ్లపై ఢిల్లీ పోలీసుల దాడులు

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: పలువురు జర్నలిస్టులు, రాజకీయ విశ్లేషకుల నివాసాలు, కార్యాలయాలపై మంగళవారం ఉదయం దాడి చేసిన ఢిల్లీ పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు.

స్టాండ్ అప్ కామిక్, రాజకీయ వ్యంగ్య విమర్శకుడు జంజయ్ రజౌర, జర్నలిస్టులు భాషా సింగ్, ప్రబిర్ పర్కాయస్త, అభిసర్ శర్మ, చరిత్రకారుడు, హక్కుల కార్యకర్త సహేల్ హష్మి, రచయిత గీతా హరిహరన్, సీనియర్ జర్నలిస్టులు పంంజోయ్ గుహ టకుర్త, ఊర్మిలేష్, ఓనింద్యో చక్రవర్తి నివాసాలపై పోలీసులు దాడులు చేశారు. పోలీసులు తన లాప్‌టాప్‌ను, ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారని అభిసర్ శర్మ తెలిపారు. అందుతున్న వార్తల ప్రకారం వీరిలో పలువురి ఫోన్లు, లాప్ టాప్‌లు స్వాధీనం చేసుకున్న పోలీసులు వారిలో కొందరిని పోలీసు స్టేషన్‌కు తీసుకువెళ్లారు. వీరంతా న్యూస్ క్లిక్ వెబ్‌సైట్‌తో అనుబంధం ఉన్నవారే. చట్టవ్యతిరేక కార్యకలాపాల(నిరోధక) చట్టం(యుఎపిఎ) కింద న్యూస్‌క్లిక్‌పై నమోదైన కేసుకు సంబంధించే వీరి నివాసాలపై దాడులు జరిగినట్లు ఇండియా టుడే తెలిపింది.

ఉగ్రవాదులతో సంబంధాలకు సంబంధించిన వ్యవహారాలలో ప్రశ్నించేందుకు ఈ జర్నలిస్టులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారని ది వైర్ తెలిపింది. వారిఫోన్లను, లాప్‌టాప్‌లను అందుకే పోలీసులు స్వాధీనం చేసుకున్నారని తెలిపింది. వీరిలో జర్నలిస్టు పరంజయ్ గుహ టకుర్త గతంలో అనేక పరిశోధనాత్మక కథనాలను రాశారు. గౌతమ్ అదానీతోసహా అనేక మంది పలుకుబడి గల వ్యక్తులపై కథనాలు రాశారు. దేశవ్యాప్తంగా ఆయనపై అనేక పరువునష్టం కేసులు దాఖలయ్యాయి.

వీరితోపాటు ఢిల్లీ సైన్స్ ఫోరమ్‌కు చెందిన శాస్త్రవేత్త, రచయిత డి రఘనందన్‌ను కూడా పోలీసులు తీసుకెళ్లారని ది వైర్ తెలిపింది.
న్యూస్‌క్లిక్‌పై ఇప్పటికే ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ మనీలాండరింగ్ ఆరోపణలపై కేసు నమోదు చేసింది. 2021లో న్యూస్‌క్లిక్ కార్యాలయాలపైన, దాని వ్యవస్థాపకుడు ప్రబీర్ పుర్కాయస్త నివాసంఐన ఇడి దాడులు చేసింది. సంస్థలోకి అక్రమంగా విదేశీ నిధులు పెట్టుబడులు పెట్టారని ఇడి ఆరోపిస్తోంది. పెయిడ్ న్యూస్‌కోసం నేరపూరిత కుట్ర జరిగిందని, అందుకోసమే విదేశీ నిధులు అక్రమంగా పొందారన్నది ఇడి చేస్తున్న ఆరోపణ.

ప్రబీర్ పుర్కాయస్త ఎడిటర్ ఇన్ చీఫ్‌గా 2009లో న్యూస్‌క్లిక్ ఏర్పడింది. విదేశీ దాతల ప్రోద్బలంతో జాతి వ్యతిరేక వార్తలు ప్రచురించడానికి దీన్ని ఏర్పాటు చేశారంటూ ఇడి ఆరోపించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News