న్యూఢిల్లీ : ప్రముఖ హీరోయిన్ రష్మికకు సంబంధించిన ఓ ఫేక్ వీడియో ఇటీవల సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొట్టిన విషయం తెలిసిందే. ఈ వ్యవహారాన్ని కేంద్ర ఐటీశాఖ సహాయ మంత్రి సహా పలువురు తీవ్రంగా ఖండించారు. ఈ నేపథ్యంలో ఢిల్లీ పోలీస్‌లు ఈ డీప్ ఫేక్ వీడియో పై చర్యలకు ఉపక్రమించారు. ఇప్పటికే ఈ వ్యవహారంపై కేసు నమోదు చేశారు. తాజాగా ఆ వీడియో ఏ అకౌంట్ నుంచి తొలుత అప్‌లోడ్ అయ్యిందో దానికి సంబంధించిన యూఆర్‌ఎల్ వివరాలు (యూఆర్‌ఎల్ ఐడీ) అందజేయాలంటూ ఫేస్‌బుక్ మాతృసంస్థ ‘మెటా’ కు లేఖ రాసినట్టు, దీంతోపాటు ఆ నకిలీ వీడియో ఏ అకౌంట్ నుంచి ఉత్పన్నమయ్యిందో , అలాగే సోషల్ మీడియాలో షేర్ చేసిన వివరాలు కూడా కోరినట్టు
ఇంటెలిజెన్స్ ఫ్యూజన్ అండ్ స్ట్రేటెజిక్ ఆపరేషన్స్(ఐఎఫ్‌ఎస్‌ఒ) యూనిట్ డిప్యూటీ కమిషనర్ ఆఫ్‌పోలీస్ హేమంత్ తివారీ వెల్లడించారు. సెక్షన్లు 465,469 (ఫోర్జరీ) కింద కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించామని తెలిపారు. ప్రత్యేక అధికారుల బృందం ఈ కేసును దర్యాప్తు చేస్తోందని, త్వరలోనే దీన్ని ఛేదిస్తామని తెలిపారు. ఈ వీడియోకు సంబంధించి ఢిల్లీ మహిళా కమిషన్ కూడా పోలీస్‌లకు నోటీస్ పంపింది. రష్మిక మందన్నా కు సంబంధించిన ఓ డీప్ ఫేక్ వీడియో వైరల్ అయిన సంగతి తెలిసిందే. జారా పటేల్ అనే ఓ సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్‌కి సంబంధించిన వీడియోకి రష్మిక ముఖాన్ని మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది కాస్తా వైరల్‌గా మారి కలకలం రేపింది.