Monday, December 23, 2024

బిజెపి దురుత్సాహం!

- Advertisement -
- Advertisement -

సంపాదకీయం: ఢిల్లీలో ఆమ్‌ఆద్మీ పార్టీ ప్రభుత్వం నిరంతరం పడగ నీడలోనే గడుపుతుంటుంది. ఆ పాము, ఆ పడగ కేంద్రంలోని భారతీయ జనతా పార్టీ ప్రభుత్వమేనని ప్రత్యేకించి చెప్పనక్కరలేదు. లెఫ్టినెంట్ గవర్నర్ ద్వారా ఢిల్లీలో బిజెపి నడిపిస్తున్న కుట్ర రాజకీయం అసాధారణమైనది. అక్కడ పోలీసులు సైతం కేంద్రం చెప్పు చేతల్లోనే ఉంటారు. అయినా ఆప్ ఢిల్లీ వాసులకు వీలైనంత మెరుగైన పాలన ఇవ్వగలుగుతున్నది. ఉచితంగా ఉన్నతస్థాయి విద్య, కరెంటు ఇస్తున్నది. మొహల్లా క్లినిక్‌ల ద్వారా ఆరోగ్య సేవలను ప్రజల వద్దకు తీసుకువెళ్ళగలుగుతున్నది. ఇది గిట్టని కేంద్ర పాలకులు తమకు బాగా అలవాటైన కూల్చివేత కుట్రకు తెర తీశారు. అందుకు భారీ అవినీతి ఆరోపణను సంధించారు. కుడి ఎడమల కత్తుల్లాంటి ఇడి, సిబిఐలలో రెండోదాన్ని పకడ్బందీగా ప్రయోగించారు.

విద్యాశాఖను పర్యవేక్షిస్తున్న ఉపముఖ్యమంత్రి మనీష్ సిసోడియా ఇంటిపై సిబిఐ దాడులు జరిపించారు. ఢిల్లీ ప్రభుత్వం ఈ సంవత్సరారంభం లో ప్రవేశపెట్టి మానుకొన్న మద్యం విధానంలో అవకతవకలు చోటు చేసుకొన్నాయంటూ దాఖలు చేసిన ఎఫ్‌ఐఆర్‌లో సిసోడియా ను మొదటి ముద్దాయిని చేశారు. అయనతో బాటు మొత్తం 15 మందిని అందులో చేర్చారు. ప్రైవేటు మద్యం వ్యాపారులకు లాభాలు చేకూర్చడం ద్వారా ఆప్ ప్రభుత్వంలోని పెద్దలు ఆర్ధికంగా ప్రయోజనం పొందడానికే ఆ మద్యం విధానాన్ని ప్రవేశపెట్టారని లెఫ్టినెంట్ గవర్నర్ వినయ్ కుమార్ సక్సెనా చేసిన ఆరోపణ ఆధారంగా ఈ ఎఫ్‌ఐఆర్ దాఖలైంది. దీనికి ప్రతిగా సక్సెనా ఖాదీ, గ్రామీణ పరిశ్రమల కమిషన్ చైర్మన్‌గా ఉన్నప్పుడు రూ. 1400 కోట్ల కిమ్మత్తు కుంభకోణం జరిగిందని ఆప్ ఆరోపించింది. కేంద్ర పాలకులు రాష్ట్రాల్లోని బిజెపియేతర పక్షాల ప్రభుత్వాలకు సమస్యలు సృష్టించడమే ప్రధాన వ్యాపకంగా పెట్టుకున్నారనే విషయం స్పష్టంగా కనిపిస్తున్నది.

ఢిల్లీలో కేజ్రీవాల్ ప్రభుత్వాన్ని ఇబ్బందుల్లోకి నెట్టివేసిన సమయంలోనే జార్ఖండ్‌లోని జెఎమ్‌ఎమ్ – కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చేకుట్ర నడుస్తున్నది. వాస్తవానికి జార్ఖండ్‌లో గాని, ఢిల్లీలో గాని బిజెపికి అక్కడి ప్రభుత్వాలను దింపివేయగల స్థాయి సభాబలం లేదు. ఢిల్లీ లోనైతే బొత్తిగా లేదు. ఢిల్లీ అసెంబ్లీ బలం 70. ఇందులో ఆప్ సంఖ్యా బలం 62 కాగా, బిజెపికి ఉన్న స్థానాలు కేవలం 8. మహారాష్ట్రలో ఉద్ధవ్ థాకరే ప్రభుత్వాన్ని కూలగొట్టిన దురుత్సాహంతో బీహార్‌లో జెడి (యు)లో చీలిక తెచ్చి నితీష్ కుమార్‌ను సిఎం పదవి నుంచి తొలగించాలని బిజెపి పన్నిన కుట్రను ఆయన ఏ విధంగా భగ్నం చేయగలిగారో ఇటీవలే చూశాము. మహారాష్ట్ర సీనును ఢిల్లీలో కూడా జరిపించాలని బిజెపి పావులు కడుపుతున్న విషయాన్ని గ్రహించిన కేజ్రీవాల్ శాసన సభను ప్రత్యేకంగా సమావేశపరచి తన ప్రభుత్వంపై విశ్వాస ప్రకటనను కోరారు. కేజ్రీవాల్ ప్రభుత్వాన్ని కూల్చివేయడానికి సహకరిస్తే తనను సిఎంగా చేయగలమని, తనపై గల కేసులన్నిటినీ రద్దు చేస్తామని బిజెపి ఆశ చూపినట్టు సిసోడియా ఆరోపించారు. ఒక్కో ఎమ్‌ఎల్‌ఎకి రూ. 20 కోట్లు ఇవ్వజూపారని కేజ్రీవాల్ చెప్పారు. మధ్యప్రదేశ్‌లో స్వల్ప మెజారిటీతో ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పాలకపక్షంలో సులభంగా చీలికతెచ్చి కూల్చివేసిన బిజెపి, మహారాష్ట్రలో శివసేనను చీల్చి అదే పని చేసింది, గోవాలో కూడా ప్రతిపక్ష కాంగ్రెస్ ఎమ్‌ఎల్‌ఎల కొనుగోలు కుట్రకు పాల్పడి వెనక్కు తగ్గింది.

రాష్ట్రాల్లోని ప్రతిపక్ష ప్రభుత్వాల్లో మాత్రమే అవినీతి చోటు చేసుకొంటున్నట్టు, తాము అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో నీతినిప్పులా నిగనిగలాడు తున్నట్టు చూపించడానికి బిజెపి పడుతున్న తాపత్రయం ఇంతా అంతా కాదు. కర్నాటకలో తన బిల్లు చెల్లించడానికి మంత్రి లంచం అడిగాడని ఆరోపిస్తూ ఒక కాంట్రాక్టర్ ఆత్మహత్య చేసుకొన్న ఉదంతం తెలిసిందే. 40 శాతం కమీషన్ అడుగుతున్నారని కర్నాటక కాంట్రాక్టర్ల సంఘమే ఆరోపించింది. పాఠశా ల గుర్తింపు కోసం లంచాలు వసూలు చేస్తున్నారని ప్రైవేటు స్కూళ్ల యాజమాన్యాలు ముఖ్యమంత్రి బొమ్మై ప్రభుత్వంపై ప్రధాని మోడీకి లేఖ రాశాయి. బిజెపి పాలిత రాష్ట్రాల్లోని అవినీతి మాత్రం ఇడి, సిబిఐల దృష్టిని తాకదు. బిజెపికి దమ్ముంటే జార్ఖండ్‌లో రాష్ట్రపతి పాలన విధించాలని, లేకపోతే రాష్ట్రంలో పాలనను స్తంభింప చేసి ప్రజలను అశాంతికి, అలజడికి గురిచేసే కార్యక్రమానికి స్వస్తి చెప్పాలని ఆ రాష్ట్ర మంత్రి ఒకరు కేంద్ర పాలకులకు సవాలు విసిరారు. తగిన బలం లేకపోయినా కేంద్రంలో గల అధికారంతో, అపారమయిన ధనరాసులతో ప్రతిపక్ష ప్రభుత్వాలను కూలదోయాలన్న బిజెపి ఆరాటం ఆ రాష్ట్రాల్లో చెప్పనలవికాని అనిశ్చితిని కలిగిస్తున్నది. ఇందుకు జార్ఖండ్, ఢిల్లీ తాజా ఉదాహరణలు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News