Saturday, December 21, 2024

ఈ నగరానికి ఏమైంది?

- Advertisement -
- Advertisement -

విధానపరమైన నిర్ణయాలు తీసుకోవడంలో ప్రభుత్వాలు అచేతనంగా వ్యవహరిస్తున్నప్పుడు న్యాయస్థానాలు జోక్యం చేసుకుని పరిస్థితిని గాడిలో పెట్టడం మన దేశంలో సర్వసాధారణంగా మారింది. దేశ రాజధాని ఢిల్లీలో పెచ్చుమీరుతున్న వాయు కాలుష్యం విషయంలోనూ ఇప్పుడు అదే జరుగుతోంది. నెపాన్ని కేంద్ర ప్రభుత్వంపైకి నెట్టివేసేందుకు ఢిల్లీలోని ఆప్ నాయకత్వంలోని రాష్ట్రప్రభుత్వం, కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవడంలో విఫలమైందంటూ రాష్ట్రప్రభుత్వాన్ని తెగనాడుతూ కేంద్ర ప్రభుత్వం కాలం వెళ్లబుచ్చుతున్నాయి. పాలక పక్షాల మధ్య సయోధ్య కొరవడటం సామాన్యుడి ప్రాణం మీదకు తెస్తోంది. గాలిలో ప్రాణాంతక కాలుష్య కారకాల స్థాయిని తూచే పిఎం 2.5 సూచీ అత్యధిక స్థాయికి చేరిందని పలు నివేదికలు గగ్గోలు పెడుతున్నాయి.

ఈ నేపథ్యంలో.. వాయు నాణ్యత సూచీ 300 దాటేవరకూ మనం ఎదురుచూడాలా? అంటూ సర్వోన్నత న్యాయస్థానం కన్నెర్ర చేసింది. గాలి నాణ్యతను పెంచేలా నిబంధనలు అమలులోకి తీసుకురావాలంటూ దాఖలైన ఓ పిటిషన్‌ను విచారణకు చేపట్టిన సుప్రీంకోర్టు తమకు చెప్పకుండా నిబంధనలను సడలిస్తే సహించబోమంటూ హెచ్చరించింది. దీంతో దిద్దుబాటు చర్యలకు ఉపక్రమించిన ఢిల్లీలోని ఆప్ ప్రభుత్వం, గ్రేడెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్‌ను అమలులోకి తీసుకువచ్చింది. ట్రక్కులను నగరంలోకి ప్రవేశించకుండా నిషేధం విధించడం, ఉద్యోగుల్లో సగం మంది మాత్రమే విధులకు హాజరయ్యేలా చూడటం, స్కూళ్లు, కాలేజీల్లో కొన్ని తరగతులకు ఆన్‌లైన్‌లో విద్యాబోధన చేయడం, భవన నిర్మాణాలను తాత్కాలికంగా నిలిపివేయడం వంటివి ఈ కార్యాచరణ ప్రణాళికలో భాగం. ఇవన్నీ ఉపశమనం కలిగించేవే తప్ప సమస్య శాశ్వత పరిష్కారానికి దోహదపడవన్న విషయం సుస్పష్టం.

తాజాగా వాయు నాణ్యత సూచీ 500కు పడిపోవడం ఆందోళన కలిగిస్తోంది. కాలుష్యం కాటుకు వృద్ధులు, చిన్నారులు శ్వాసకోశ వ్యాధులకు గురవుతున్నారు. అయితే యుక్తవయసులో ఉన్నవారి ఊపిరితిత్తులూ దెబ్బతింటున్నాయంటూ వస్తున్న వార్తలు కలవరం కలిగిస్తున్నాయి. ప్రజలు కాలుష్య రహితమైన స్వేచ్ఛా వాతావరణంలో జీవించే పరిస్థితులు కల్పించడం ప్రభుత్వాలకు రాజ్యాంగపరమైన బాధ్యత అని సుప్రీం కోర్టు పేర్కొనడం ముమ్మాటికీ నిజం. ఆప్ అధికారంలో ఉన్న పంజాబ్‌లో పంట వ్యర్థాల దహనం తగ్గుముఖం పట్టగా, బిజెపి పాలిత హర్యానా, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలలో మరింత పెరిగిందంటూ ఢిల్లీ ముఖ్యమంత్రి ఆతిశీ నెపాన్ని కేంద్రప్రభుత్వంపైకి నెట్టివేసే ప్రయత్నం చేస్తున్నారు. కేంద్రంలోని బిజెపి పెద్దల ధోరణి కూడా ఇందుకు ఏమాత్రం తీసిపోలేదు.

పాలకుల చేతగానితనాన్ని గ్రహించిన ప్రజలు తప్పనిసరి పరిస్థితుల్లో స్వీయరక్షణ చర్యలు చేపడుతున్నారు. ఫలితంగా దేశ రాజధానిలో ఎయిర్ ప్యూరిఫయర్లు, మాస్కుల అమ్మకాలు జోరందుకున్నాయి. వీటిని కొనలేని, రోడ్డు పక్కన గుడిసెల్లో, మురికివాడల్లో నివసించే పేదప్రజానీకం పరిస్థితి ఏమిటన్నది ప్రశ్న. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ ఎంపి శశిథరూర్ పాలకులను ఉద్దేశించి ‘ఈ నగరం ఇంకా దేశ రాజధానిగా కొనసాగాలా?’ అంటూ ప్రశ్నించడం సహేతుకమైనదే.ఒక విధంగా శశిథరూర్ వ్యాఖ్యలు సామాన్యుడి మనోభావాన్ని ప్రతిఫలిస్తున్నాయంటే అతిశయోక్తి కాదు. వాహన కాలుష్యాన్ని నియంత్రించే చర్యలలో భాగంగా ఢిల్లీలో ఎన్నో ఏళ్లుగా సిఎన్‌జి వాహనాల వాడకాన్ని ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది. ఇదే క్రమంలో విద్యుత్ వాహనాల వాడకాన్ని పెంచేందుకు వీలుగా రోడ్డు, రిజిస్ట్రేషన్ పన్నుల్లో మరిన్ని రాయితీలు ఇవ్వడం అవసరం. సౌర విద్యుత్ వినియోగాన్ని సామాన్యుడికి అందుబాటులోకి తెచ్చే దిశగా ప్రణాళికలు రూపొందించాలి. ఒకప్పుడు చైనాలోని షాంఘై, బీజింగ్ నగరాల ప్రజలు కాలుష్యం కోరలకు చిక్కి విలవిల్లాడేవారు.

తదనంతర పరిణామాల్లో ప్రభుత్వం తీసుకున్న చర్యలతో ఆ నగరాల్లో కాలుష్యం స్థాయులు చెప్పుకోదగిన రీతిలో దిగివచ్చాయి. కాలుష్యం కాటుకు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో చెక్ చెప్పే దిశగా కార్యాచరణ రూపొందించాలి. పల్స్ రేడియో వేవ్ టెక్నాలజీ సహాయంతో గాలి నాణ్యతను పెంచేందుకు బెంగళూరుకు చెందిన ఒక స్టార్టప్ కంపెనీ రూపొందించిన పరిజ్ఞానం అక్కరకొస్తుందేమో పాలకులు పరిశీలించాలి. అలాగే ఢిల్లీ ఐఐటి నేతృత్వంలో పుణెకు చెందిన ఓ సంస్థ గాలిలోని కాలుష్య కణాలను తగ్గించే పరిజ్ఞానాన్ని రూపొందించినట్లుగా ఆ మధ్య వార్తలు వచ్చిన నేపథ్యంలో ఆ పరిశోధనపైనా దృష్టి సారించాలి. ఒకవైపు ఉపశమన చర్యలు చేపడుతూనే, వాయు కాలుష్యాన్ని శాశ్వతంగా తుడిచిపెట్టేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇకనైనా ఉమ్మడి పోరుకు ఉపక్రమించాలి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News