Wednesday, January 22, 2025

ఢిల్లీ హత్యాచార కేసు: ఉరిశిక్ష పడిన ముగ్గురు నిర్దోషులుగా విడుదల

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: సామూహిక అత్యాచార కేసులో ఉరిశిక్ష పడిన ముగ్గురు వ్యక్తులను నిర్దోషులుగా తేల్చుతూ సుప్రీం కోర్టు తీర్పునివ్వడం విమర్శలకు దారి తీసింది. 2012లో ఢిల్లీలోని చావ్లా ప్రాంతంలో ఓ 19 ఏళ్ల యువతి సామూహిక అత్యాచారం, హత్యకు గురైంది. ఈ కేసులో ముగ్గురు వ్యక్తులను దోషులుగా తేల్చుతూ ఢిల్లీ హైకోర్టు మరణ శిక్ష విధించగా, సుప్రీం కోర్టు సోమవారం వారిని నిర్దోషులుగా ప్రకటించింది. అయితే ఈ కేసు విచారణ సమయంలో అనేక లోపాలు చోటు చేసుకున్నాయని సర్వోన్నత న్యాయస్థానం తెలిపింది. అందుకే బెనిఫిట్ ఆఫ్ డౌట్ కింద నిందితులకు కేసు నుంచి విముక్తి కల్పించినట్టు స్పష్టం చేసింది.“ఈ కేసులో నిందితులపై ఉన్న అభియోగాలు నిరూపించడంలో ప్రాసిక్యూషన్ విఫలమైంది. కేవలం సహేతుకమైన సందేహాలు మినహా ఎలాంటి ఆధారాలు సమర్పించలేక పోయింది. అందుకే అత్యంత క్రూరమైన నేరంలో నిందితులుగా ఉన్నప్పటికీ వారిని నిర్దోషులుగా ప్రకటించడం తప్ప కోర్టుకు మరో అవకాశం లేకుండా పోయింది. నైతిక నేరారోపణ ఆధారంగా లేదా అనుమానంతో మాత్రమే నిందితులను శిక్షించడానికి చట్టం అంగీకరించదు. ఏ కేసులో నైనా సరే న్యాయస్థానాలు చట్టానికి లోబడే తీర్పులు ఇవ్వాలి. అంతే కానీ నైతిక పరమైన బయటి ఒత్తిళ్లు, ఇతరత్రా అంశాలు తీర్పును ప్రభావితం చేయకూడదు” అని కోర్టు వివరించింది.

ఈ కేసు విచారణ సమయంలో లోపాలు జరిగినట్టు సుప్రీం కోర్టు ఈ సందర్భంగా గుర్తించింది. ఈ కేసులో 49 మంది సాక్షులను ప్రాసిక్యూషన్ విచారించగా, ఇందులో 10 మందిని డిఫెన్స్ కౌన్సిల్ క్రాస్ ఎగ్జామినేషన్ చేయలేదని కోర్టు పేర్కొంది. అంతేగాక, దర్యాప్తు సమయంలో ఒక్క సాక్షి కూడా నిందితులను గుర్తించలేదని తెలిపింది. ఇక మృతదేహం వద్ద లభించిన సాక్షాలు కూడా అనుమానాస్పదంగా ఉన్నాయని న్యాయస్థానం తెలిపింది.

అత్యాచారం, హత్య జరిగిన మూడు రోజుల తరువాత ఓ పొలంలో మృతదేహాన్ని గుర్తించామని పోలీసులు చెబుతున్నారని, అప్పటివరకు ఎవరూ మృతదేహాన్ని చూడకపోవడం ఎలా సాధ్యమని ప్రశ్నించింది. ఈ కేసులో ట్రయల్ కోర్టు కొన్ని కీలక అంశాలను విస్మరించి తీర్పు వెలువరించిందని, దాన్ని హైకోర్టు కూడా సమర్ధించిందని సుప్రీం కోర్టు తెలిపింది. అందుకే బెనిఫిట్ ఆఫ్ డౌట్ కింద నిందితులకు కేసు నుంచి విముక్తి కల్పించినట్టు స్పష్టం చేసింది. ఉత్తరాఖండ్‌కు చెందిన 19 ఏళ్ల యువతి గురుగ్రామ్ లోని సైబర్‌సిటీలో పనిచేస్తూ ఢిల్లీలో నివాసం ఉండేది. 2012 ఫిబ్రవరిలో కార్యాలయం నుంచి వస్తుండగా ఇంటికి సమీపం లోనే అపహరణకు గురైంది. తల్లిదండ్రుల ఫిర్యాదుపై పోలీసులు విచారణ జరిపారు. ముగ్గురు వ్యక్తులు ఆమెను కారులో తీసుకుపోయి సామూహిక అత్యాచారానికి పాల్పడి, అత్యంత పాశవికంగా గాజు సీసాలతో, లోహపు వస్తువులతో చిత్రహింసలు పెట్టి హత్య చేసినట్టు దానిలో వెల్లడైంది. ఈ కేసులో దిగువ న్యాయస్థానం ఆ ముగ్గురినీ దోషులుగా తేల్చి, మరణ శిక్ష విధించింది. అప్పీలుకు వెళ్లినప్పుడు ఈ హత్యాచార ఘటనను అత్యంత దారుణమైనదిగా అభివర్ణించిన హైకోర్టు.. నిందితులకు ఈ శిక్ష ఖరారు చేస్తూ 2014 లో తీర్పు వెలువరించింది. దాంతో వారు సుప్రీం కోర్టును ఆశ్రయించారు.

Delhi Rape Case: SC Acquits 3 accused

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News