న్యూఢిల్లీ : ఈ శీతాకాలంలో అతి చల్లని వాతావరణం ఆదివారం ఢిల్లీలో నమోదైంది. కనీస ఉష్ణోగ్రత 3.5 సెల్షియస్ డిగ్రీలకు పడిపోయింది. ఇక లోఢీ రోడ్ ప్రాంతంలోనైతే 3.4 సెల్షియస్ డిగ్రీలకు ఉష్ణోగ్రత పడిపోయింది. ఢిల్లీ, ఎన్‌సిఆర్‌లోని చాలా ప్రాంతాలను దట్టమైన పొగమంచు కమ్మివేసింది. రోడ్డుపై పారదర్శకత సున్నా స్థాయికి తగ్గిపోయింది. దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి ఢిల్లీకి రావలసిన సుమారు 22 రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయి.
ఢిల్లీ ఇందిరా గాంధీ అంతర్జాతీయ (ఐజిఐ) విమానాశ్రయంలో పలు విమాన సర్వీసులకూ దట్టమైన పొగమంచు కారణంగా అంతరాయం కలిగింది. ‘ఉత్తరాదిలోని వాతావరణపరమైన సవాళ్ల కారణంగా మా విమాన సర్వీసులకు అంతరాయం వాటిల్లవచ్చు’ అని ఇండిగో విమాన సంస్థ ‘ఎక్స్’లో సూచించింది. ఉత్తరాదిలోని పలు ప్రాంతాలలో రానున్న మూడు నాలుగు రోజులలో దట్టమైన పొగమంచు, శీతగాలుల పరిస్థితులు తగ్గకపోవచ్చునని వాతావరణ శాఖ సూచించింది.