Thursday, January 23, 2025

ఢిల్లీలో ఎన్నికైన ప్రభుత్వానికే అధికారం: సుప్రీంకోర్టు

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: దేశరాజధాని ఢిల్లీలో ప్రభుత్వాధికారులపై నియంత్రణ ఎవరికి ఉండాలన్న విషయంపై గత కొన్నేళ్లుగా కేంద్రం, ఆమ్‌ఆద్మీ పార్టీ(ఆప్) ప్రభుత్వానికి మధ్య జరుగుతున్న న్యాయపోరాటంపై సుప్రీంకోర్టు గురువారం కీల తీర్పు వెలువరించింది. ఐఏఎస్‌లు సహా ప్రభుత్వాధికారుల బదిలీలు, నియామకాలపై ఢిల్లీ ప్రభుత్వానికే నియంత్రణ ఉంటుందని స్పష్టం చేసింది. జాబితా2లోని మూడు అంశాలకే(భూములు, పోలీసు వ్యవస్థ, శాంతిభద్రతలు) ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్(ఎల్‌జి) అధికారాలు పరిమితమని పేర్కొంది. ఈ మూడు మినహా జాబితా2, జాబితా3లోని శాసన, కార్యనిర్వాహక అధికారాలన్ని ఎన్నికైన ప్రభుత్వానికే ఉంటాయని స్పష్టం చేసింది.

ఈ తీర్పుతో కేంద్రం, ఢిల్లీ ప్రభుత్వానికి మధ్య ఎనిమిదేళ్లుగా కొనసాగుతున్న వివాదానికి ప్రధాన న్యాయమూర్తి డి.వై. చంద్రచూడ్, న్యాయమూర్తులు ఎం.ఆర్.షా, కృష్ణ మురారి, హిమా కోహ్లి, పి.ఎస్. నరసింహల రాజ్యాంగ ధర్మాసనం ముగింపు పలికింది. 105 పేజీల ఏకగ్రీవ తీర్పులో కీలక వ్యాఖ్యలు చేసింది. సుప్రీంకోర్టు తీర్పును ‘ప్రజాస్వామ్య విజయంగా’ ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ పేర్కొన్నారు. ప్రజలకు న్యాయం లభించిందన్నారు. ‘పరిపాలనపరంగా రానున్న రోజుల్లో భారీగా మార్పులుంటాయి. ఇప్పటి వరకు చేసిన పనుల ఆధారంగా చాలా మంది అధికారులను బదిలీ చేస్తాం. కొంత మంది ఏడాదిన్నరగా ప్రజాపనులకు ఆటంకం కల్పిస్తున్నారు. అలాంటి అధికారులు మూల్యం చెల్లించక తప్పదు. లంచం తీసుకుంటూ పట్టుబడినా ఎలాంటి చర్యలు తీసుకోలేని దుస్థితి నాది. ఇప్పుడిక చర్యలు తప్పవు’ అని కేజ్రీవాల్ తెలిపారు. అయితే బిజెపి అధ్యక్షుడు వీరేంద్ర సచ్‌దేవ్ ‘కేజ్రీవాల్ ఎప్పటి నుంచో తాను కోరుకుంటున్నది సాధించారు. భారీగా బదిలీలు ఉంటాయంటున్నారు. అంటే దేశ రాజధానికి పదవుల బదిలీ పరిశ్రమ కూడా రాబోతోంది’ అని వ్యంగ్యంగా విమర్శించారు.

ఇదిలావుండగా సుప్రీం కోర్టు తీర్పు వెలువడిన వెంటనే ‘ఆప్’ సర్కార్ కీలక అధికారిని బదిలీ చేసింది. ఢిల్లీ ప్రభుత్వంలోని సర్వీసెస్ విభాగం కార్యదర్శి ఆశిష్ మోరేను ఆ పదవి నుంచి తప్పించింది. ఆయన స్థానంలో ఢిల్లీ జల్ బోర్డ్ మాజీ సిఈవో ఎ.కె.సింగ్‌ను నియమించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News