Saturday, January 11, 2025

అత్యంత కాలుష్య నగరం ఢిల్లీ.. తగ్గుతున్న 11.9 ఏళ్ల జీవితకాలం

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : ప్రపంచం లోనే అత్యంత కాలుష్య నగరంగా దేశ రాజధాని ఢిల్లీ కొనసాగుతున్నట్టు తాజా అధ్యయనం పేర్కొంది. ప్రపంచ ఆరోగ్యసంస్థ (డబ్లుహెచ్‌ఒ) నిర్దేశించిన కాలుష్య స్థాయిల కంటే ఎక్కువ స్థాయిలో కాలుష్యం ఇలాగే కొనసాగితే ఢిల్లీ ప్రజలు 11.9 ఏళ్ల జీవిత కాలాన్ని కోల్పోయే ప్రమాదం ఉందని అధ్యయనం వివరించింది. యూనివర్శిటీ ఆఫ్ షికాగో ఎనర్జీ పాలసీ ఇన్‌స్టిట్యూట్ విడుదల చేసిన “ది ఎయిర్ క్వాలిటీ లైఫ్ ఇండెక్స్ (ఎక్యుల్‌ఐ)లో ఈ వివరాలు వెల్లడయ్యాయి. దేశంలో 67.4 శాతం మంది కాలుష్య స్థాయిలు అధికంగా ఉన్న ప్రాంతాల్లోనే జీవిస్తున్నారని , ముఖ్యంగా పిఎం 2.5 కారణంగా దేశ ప్రజల సరాసరి ఆయుర్దాయం 5.3 ఏళ్లు తగ్గిపోతోందని తెలిపింది. ఢిల్లీని ప్రపంచం లోనే అత్యంత కాలుష్య నగరంగా పేర్కొన్న ఏక్యూఎల్‌ఐ, డబ్లుహెచ్‌వొ ప్రమాణాలతో పోలిస్తే ఇక్కడున్న 1.8 కోట్ల మంది ప్రజలు తమ జీవిత కాలంలో 11.9 ఏళ్లను కాలుష్యం కారణంగానే కోల్పోనున్నారని వివరించింది.

అత్యంత కాలుష్యమున్న పంజాబ్ లోని పఠాన్‌కోట్ జిల్లా లోనూ ప్రమాదకర కాలుష్య స్థాయిలు(పీఎం2.5 ) డబ్లుహెచ్‌వొ ప్రమాణాల కంటే ఏడు రెట్లు ఎక్కువగా ఉన్నట్టు తెలిపింది. ఇదే పరిస్థితి కొనసాగితే ఇక్కడి ప్రజల ఆయుష్సు కూడా 3.1 ఏళ్లు తగ్గిపోతుందని అంచనా వేసింది. ఉత్తరాదిన కాలుష్యానికి భౌగోళిక వాతావరణ అంశాలు కారణమైనప్పటికీ, మానవ ప్రమేయం తోనూ భారీ స్థాయిలో కాలుష్యం పేరుకుపోతోందని తెలియజేసింది. దేశంలో మిగతా ప్రదేశాలతో పోలిస్తే ఇక్కడి జనాభా సాంద్రత మూడు రెట్లు ఎక్కువగా ఉండటం, తద్వారా వాహనాలు, నివాస ప్రాంతాలు , వ్యవసాయ సంబంధిత పనులతో కాలుష్యం మరింతగా పెరిగిపోతోందని పేర్కొంది. బంగ్లాదేశ్, భారత్, పాకిస్థాన్, చైనా, నైజీరియా, ఇండోనేసియా, దేశాల్లోని ప్రజలు కాలుష్యం వల్లనే ఒకటి నుంచి ఆరేళ్లకు పైగా తమ జీవిత కాలాన్ని కోల్పోతున్నారని నివేదిక వివరించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News