న్యూఢిల్లీ: ముందస్తు అనుమతి లేకుండా లౌడ్ స్పీకర్లు, డిజి సెట్లు వాడితే శబ్ద కాలుష్య నిబంధనలను ఉల్లంఘించిన నేరానికి ఢిల్లీవాసులు ఇక మీదట రూ. 10 వేల నుంచి లక్ష రూపాయల వరకు జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. సవరించిన నిబంధనలను కచ్ఛితంగా అధికారులు అమలు చేయాలని ఆదేశిస్తూ ఢిల్లీ కాలుష్య నియంత్రణ కమిటీ(డిపిసిసి) శనివారం ఆదేశాలు జారీచేసింది. కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి(సిపిసిబి) సవరించిన జరిమానాల ప్రకారం అనుమతి లేకుండా బహిరంగ ప్రదేశాలలో లౌడ్‌స్పీకర్లు లేదా పబ్లిక్ అడ్రస్ సిస్టమ్ ద్వారా ధ్వని కాలుష్యాన్ని సృష్టిస్తే సంబంధిత వ్యక్తులు రూ. 10,000 చెల్లించాల్సి ఉంటుంది.
దీంతోపాటు వాడిన పరికరాలను కూడా అధికారులు స్వాధీనం చేసుకుంటారు. 1,000 కెవిఎకు మించిన డీజిల్ జెనరేటర్(డిజి) సెట్లు ఉపయోగిస్తే రూ. 1 లక్ష జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. 62.5 కెవిఎ నుంచి 1,000 కెవిఎ లోపు డిజి సెట్లు వాడితే రూ. 25,000, 62.5 కెవిఎ లోపు డిజి సెట్లు వాడితే రూ 10,000 జరిమానా చెల్లించాల్సి ఉంటుందని డిపిసిసి ఉత్తర్వులో పేర్కొంది. నివాస ప్రాంతాలలో పగటి వేళల్లో 55 డెసిబెల్, రాత్రి వేళల్లో 45 డెసిబెల్ వరకు ధ్వని స్థాయికి అనుమతి ఉంటుంది. అదే వాణిజ్య ప్రాంతాలలో పగటి వేళల్లో 65 డెసిబెల్, రాత్రి వేళల్లో 55 డెసిబెల్, సున్నిత ప్రాంతాలలో పగటి పూట 50 డెసిబెల్, రాత్రి పూట 40 డెసిబెల్ ధ్వని స్థాయికి అనుమతి ఉంటుంది.
Delhi revises penalty for Noise pollution