న్యూఢిల్లీ: గత కొద్ది రోజులుగా వరద నీటిలో అవస్థలు పడుతున్న ఢిల్లీ వాసులు కాస్త ఊపిరి పీల్చుకుంటున్నారు. నగరాన్ని ముంచెత్తిన యమునా నది శాంతిస్తుండడమే దీనికి కారణం. అయితే నగర వాసులు మాత్రం పూర్తిగా వరద దిగ్బంధంనుంచి కోలుకోలేదు. ఐటిఓ, శాంతివన్ ప్రాంతం,ఇన్‌కంట్యాక్స్ కార్యాలయం సమీపంలో, ఇంకా పలు కీలక ప్రాంతాల్లో రోడ్లపై మోకాటి లోతు నీళ్లు నిలిచి ఉన్నాయి. శనివారం ఉదయానికి యమునానది నీటిమట్టం 207 మీటర్ల సమీపంలో ఉంది. ఇప్పటికీ ప్రమాదస్థాయికన్నా రెండు మీటర్లు ఎక్కువగానే ఉన్నప్పటికీ నీటిప్రవాహం క్రమేపీ తగ్గుతుండడం ఊరట కలిగిస్తోంది.
అయితే ఇంకా వరదనుంచి పూర్తిగా కోలుకోని ఢిల్లీ వాసులకు వాతావరణ శాఖ హెచ్చరిక మళ్లీ ఆందోళనకు గురి చేస్తోంది. శనివారం నుంచి రానున్న మూడు, నాలుగు రోజుల్లో ఢిల్లీ వ్యాప్తంగా ఓ మోస్తరు వర్షాలు పడతాయని ఆ శాఖ హెచ్చరించింది. శనివారం కూడా నగరంలో ఓ మోస్తరు వర్షాలు కురిశాయి. కాగా నగరంలోని పలు కీలక ప్రాంతాలు మునగడానికి కారణమైన ఇంద్రప్రస్థ రెగ్యులేటర్‌కు పడిన గండిని పూడ్చివేశారు. దాన్ని సరిచేయడానికి శాయశక్తులా ప్రయత్నిస్తున్నారు. వరదనీరు తగ్గడంతో రింగ్‌రోడ్, శాంతివన్‌నుంచి గీతాకాలనీకి వెళ్లే మార్గాల్లో కార్లు, ఆటో రిక్షాలు, ఇతర తేలికపాటి వాహనాలను అనుమతించారు.