Wednesday, January 22, 2025

వేయి రోజుల ఖైదీ ఉమర్ ఖాలిద్

- Advertisement -
- Advertisement -

‘ఇది న్యాయబద్ధం కాదు అని చెప్పడానికి మన నోళ్లు పూడుకుపోతున్నాయి. తప్పు వైపు వేలెత్తి చూపడానికి మన భుజాలు జారిపోతున్నాయి. నోట్లో నాలుక ఉండి కూడా మనం అన్యాయాన్ని ప్రశ్నించడం మానేశాం. గత వేయి రోజులుగా ఆ యువకుడు జైలులో గడుపుతున్నా ఎవరికేం పోయింది లేదు. ఆయనలో ఉన్న ప్రశ్నించే గుణమే ఈ కష్టాల్ని తెచ్చిపెట్టింది’ ఇవి శ్యామ్ మీరా సింగ్ అనే యువ జర్నలిస్ట్ మాటలు. ఢిల్లీ విద్యార్థి నేత డా. ఉమర్ ఖాలిద్ జైలు జీవితం వేయి రోజులు ముగిసిన సందర్భంగా జరిగిన బహిరంగ సభలో ఆయన అన్న మాటలివి. ‘ఈ వేయి రోజులు ముగిసిన విచారణ ఖైదు జీవితం ఒక్క ఉమర్‌కే సంబంధించినది కాదు భారత న్యాయ వ్యవస్థకే అవమానకరమైన సందర్భమని’ ప్రముఖ జర్నలిస్టు రవీష్ కుమార్ అదే సభలో అన్నారు. కేంద్రం ప్రవేశపెట్టిన పౌరసత్వ సవరణ బిల్లుకు వ్యతిరేకంగా ఈశాన్య ఢిల్లీలో ఫిబ్రవరి 2020లో జరిగిన అల్లర్లకు కుట్రదారుడనే ఆరోపణపై ఉమర్ ఖాలిద్‌ను ఢిల్లీ పోలీసులు 13 సెప్టెంబర్ 2020లో అరెస్టు చేశారు.

ఆనాటి అరెస్టుతో మొదలై, ప్రతిసారి బెయిల్ నిరాకరణతో ఆయన ఖైదు జీవితం 9 జూన్ నాటికి వేయి రోజులు పూర్తయ్యాయి. ఆ సందర్భంగా ఢిల్లీలో అదే రోజు జరిగిన బహిరంగ సభలో వివిధ సామాజిక వేత్తలు, పాత్రికేయులు, న్యాయవాదులు పాల్గొని ఖాలిద్‌ను సుదీర్ఘ కాలం విచారణ ఖైదీగా బంధించి ఉంచడాన్ని, ఆయనకు బెయిల్ నిరాకరణను నిరసిస్తూ మాట్లాడారు.
ఆనాడు ఢిల్లీలో జరిగిన ధ్వంస రచనలో ముస్లింలకు అధికంగా ప్రాణ, ఆస్తి జరిగిందని, ఢిల్లీ పోలీసులు ఈ అల్లర్లను నిరోధించే ప్రయత్నం చేయలేదని పత్రికలు రాశాయి. ఈ అల్లర్లకు సంబంధించి ఢిల్లీ పోలీసులు 1300 మందిని అరెస్టు చేసి 758 కేసులు పెట్టారు. ఈ క్రమంలో ఖాలిద్‌తో మరో 17 మందిపై ఢిల్లీ పోలీసులు రెండు ఎఫ్‌ఐఆర్‌లను సిద్ధం చేశారు. మొదటి దాంట్లో ఇండియన్ పీనల్ కోడ్‌లోని సెక్షన్లతో పాటు ఉపా చట్టంలోని మూడు సెక్షన్లను కూడా జోడించారు.

రెండో ఎఫ్‌ఐఆర్‌లో పోలీసులపై రాళ్లు రువ్వడం, వారి వాహనాలకు నిప్పు పెట్టడం లాంటి ఆరోపణలున్నాయి. రెండో ఎఫ్‌ఐఆర్‌లో ఖాలిద్‌కు ఫిబ్రవరి 2021లోనే బెయిల్ లభించింది. మొదటి ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొన్న ఐపిసి సెక్షన్లకు బలం చేకూరేలా పోలీసులు సాక్ష్యాల్ని పొందుపరచలేదు. ఆయన నేర ప్రాంతంలో ఉన్నట్లు సిసి కెమెరా ఫుటేజీ కాని, ప్రత్యక్ష సాక్షినిగాని, పోలీసు వాంగ్మూలం గాని పోలీసులు చూపలేకపోయారు. ఊహాజనిత సమాచారంతో వివిధ సెక్షన్లు మోపి ఆయన్ని బందీగా ఉంచడం సరికాదని ఢిల్లీ సెషన్స్ కోర్టు ఏప్రిల్ 2021లో అంత మట్టుకు బెయిల్ మంజూరు చేసింది. అయితే ఆనాటి ఢిల్లీ అల్లర్లకు కుట్రలో భాగస్వామి అనే ఆరోపణతో ఆయనపై మోపిన ఉపా చట్టంలోని సెక్షన్ల మూలంగా ఖాలిద్‌కు ఢిల్లీ కోర్టు బెయిల్‌ను నిరాకరిస్తూ వస్తోంది. నిరాధార ఆరోపణలతో తనను పోలీసులు అదుపులోకి తీసుకొన్నారని ఖాలిద్ పెట్టుకున్న అభ్యర్థనలన్నీ కోర్టు ల్లో నిలబడడం లేదు. దానికి కారణం ఆయన్ని ఉపా చట్టం కింద అరెస్టు చేయడమే. ఖాలిద్ పిటిషన్‌ను ఢిల్లీ కోర్టు కొట్టి వేయడాన్ని సీనియర్ న్యాయవాది ప్రశాంత్ భూషణ్ తప్పు పట్టారు.

ఉమర్ ఢిల్లీ అల్లర్ల కుట్రలో పాల్గొన్నట్లు, హింసను ప్రేరేపించినట్లు ఎలాంటి సాక్ష్యాలు లేవు. ఆయన ఆడియో ప్రసంగాలు కూడా హింసకు ప్రతిగా అహింసను బోధించినట్లుగానే ఉన్నాయి అని ఆయన ట్వీట్ చేశారు. పోలీసులు సాక్ష్యాలుగా చూయించిన 5 వాట్సాప్ గ్రూపుల్లో రెండిటిలో సభ్యుడిగా ఉండి ఒక దాన్లో మాత్రమే పోస్ట్ పెట్టాడు. ఢిల్లీ సంఘటన కన్నా ముందే ఖాలిద్ మాట్లాడిన మాటలను ఇందులో ఆధారాలుగా చొప్పించారని ఖాలిద్ తరఫున న్యాయవాది త్రిదీప్ అంటున్నారు. చివరకు మే 18న ఖాలిద్ బెయిల్ దరఖాస్తుపై స్పందించమని ఢిల్లీ పోలీసులకు సుప్రీంకోర్టు నోటిస్ జారీ చేసింది. కోర్టు వేసవి సెలవుల తర్వాత దీని విచారణ ఉంటుంది.
ఢిల్లీ పోలీసులు ఉమర్ ఖాలిద్‌పై ఉపా చట్టాన్ని ప్రయోగించడానికి వెనుక ఆయన జెఎన్‌యు విద్యార్ధి నాయకుడిగా ఉన్న రోజుల్లో కేంద్ర ప్రభుత్వ విధానాలను వ్యతిరేకిస్తూ, యూనివర్సిటీ నిబంధనల మార్పును ఒప్పుకునేది లేదంటూ చేసిన ఉద్యమాలు, ఆయన చేసిన ప్రసంగాలు ప్రధాన కారణాలని ఆయన మద్దతుదారులు అంటున్నారు. ఫిబ్రవరి 2016 లో జెఎన్‌యు క్యాంపస్‌లో జాతి వ్యతిరేక నినాదాలు చేశాడని ఆయనను పోలీసులు అరెస్టు చేశారు. పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా ఆయన పాల్గొన్న సమావేశాలు, ప్రసంగాలను జాతి వ్యతిరేక చర్యలుగా చూపిస్తూ ఆయన్ని ఉపా చట్టం కింద జైలులోనే ఉంచాలని పోలీసులు భావిస్తూ ఉండవచ్చు.

కాని పోలీసుల సాక్ష్యాలు దానికి కూడా సరిపోవు. ఛార్జ్ షీట్‌లో పేర్కొన్న సంఘటనల్లో చాలా వాటిలో ఆయన పాల్గొనలేదు. పౌరసత్వ చట్ట సవరణపై ఆయన అమరావతిలో చేసిన ప్రసంగాన్ని హింస ప్రేరేపించే సాక్ష్యంగా పేర్కొన్నారు. చట్టాన్ని నిరసిస్తూ ఎక్కడైనా ప్రసంగించవచ్చని అన్నాడు కాని మీరంతా ఢిల్లీకి రండని ఒక్క మాట అనలేదని న్యాయవాది త్రిదీప్ అంటున్నారు. ఖాలిద్ ఒంటరి కాడని, ఆయనపై వేసిన అభియోగాలు దురుద్దేశ పూరితమైనవని దేశంలోని ప్రజాస్వామ్యవాదులు పలు వేదికలుగా ఖండిస్తూ వస్తున్నారు. ఉమర్ ఖాలిద్‌కు తోడుగా ఉందాం అనే ట్విట్టర్ ద్వారా తమ నిరసనను సెప్టెంబర్ 2020 నుండి కొనసాగిస్తున్నారు. ఆ పోస్టుల్లో ఖాలిద్ ఉగ్రవాది కాదని, ఆయనలో మతమౌఢ్యం లేదని, దేశంలో సమానత్వాన్ని కోరేవాడని, భారతీయుల్లో మతపర విభేదాలను వ్యతిరేకిస్తున్నాడని అర్థమవుతుంది. ఇప్పటికే వేయి రోజులైన ఆయన విచారణ ఖైదు జీవితం జైలు గది దాటి వెలుగు చూడాలని ఎందరో కోరుతున్నారు. న్యాయం ఎటువైపు ఉన్నా గెలుపు ఆ వైపే ఉండాలి. పోలీసులు చూపిస్తున్న ఆధారాల్లో బలంలేనట్లయితే న్యాయం ఉమర్ ఖాలిద్ వైపే ఉన్నట్లు.

బి.నర్సన్
9440128169

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News