ఢిల్లీ ప్రభుత్వ నిర్ణయం
న్యూఢిల్లీ: దేశ రాజధానిలోని వీధులు, కాలనీలలో ”హరిజన్” అనే పదం ఉన్న చోట ”డాక్టర్ అంబేద్కర్” అని మారుస్తూ త్వరలో ఢిల్లీ ప్రభుత్వం నోటిఫికేషన్ జారీచేయనున్నట్లు రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి రాజేంద్ర పాల్ గౌతమ్ గురువారం తెలిపారు. హరిజన్ అనే పదాన్ని అవమానకరంగా, కించపరిచేవిధంగా పరిగణిస్తారని, ఈ పదాన్ని సమూలంగా నిర్మూలించనున్న దేశంలోని మొదటి రాష్ట్రం ఢిల్లీ కానున్నదని ఆయన తెలిపారు. ఈ పదాన్ని ఉపయోగించవద్దని ఆదేశిస్తూ అన్ని శాఖలకు, రాష్ట్ర ప్రభుత్వాలకు తాజా మార్గదర్శకాలు జారీచేయాలని కేంద్ర సామాజిక న్యాయం, సాధికారత మంత్రిత్వశాఖకు పార్లమెంటరీ కమిటీ సిఫార్సు చేసిందని ఆయన చెప్పారు. ఎస్‌సి కులాలకు చెందిన ప్రజలను ప్రస్తావించేటప్పుడు దళిత్, హరిజన్ అనే పదాలను వాడకూడదని అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు 2018 ఏప్రిల్‌లో మంత్రిత్వశాఖ లేఖ రాసింది. ఈ పదాలకు బదులుగా ఎస్‌సి అనే పదం వాడాలని కూడా సూచించింది. కాగా..ఢిల్లీలో వికాస్‌పురి, పాలం, కొడిలితోసహా అనేక ప్రాంతాలలో హరిజన్ బస్తీలు ఉన్నాయి. దక్షిణ ఢిల్లీలోని కల్కాజీ ప్రాంతంలో ఒక వీధికి హరిజన్ కాలనీ అనే పేరు కూడా ఉంది.