Tuesday, November 5, 2024

జలదిగ్బంధంలోనే ఢిల్లీ..

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: గత కొన్ని రోజులుగా దేశ రాజధాని ఢిల్లీ పౌరులను వణికిస్తున్న యమునా నది వరద శు్రక్రవారం కాస్త నెమ్మదించినప్పటికీ నగరంలో వరద ప్రభావం మాత్రం తగ్గలేదు. రాజధానిలోని అనేక ప్రాంతాలు ఇప్పటికీ జలదిగ్భంధంలోనే ఉన్నాయి. ఇప్పటికీ మురికి కాలువలు పొంగి ప్రవహిస్తూ ఉండడంతో ఢిల్లీ ట్రాఫిక్ పోలీసులు ట్విట్టర్ వేదికగా నగర ప్రజలకు సూచనలు చేశారు. బైరాన్ రోడ్డు, వికాస్ మార్గ్ మార్గంలో రాకపోకలను నిలిపివేసినట్లు తెలిపారు. అలాగే యమునా బ్యాంక్ మెట్రో స్టేషన్‌ను మూసివేశారు. మరో వైపు పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ అంతరాయాలు కొనసాగుతున్నాయి. నగరంలో పరిస్థితులపై ప్రస్తుతం ఫ్రాన్స్ పర్యటనలో ఉన్న ప్రధాని మోడీ హోమంత్రి అమిత్‌షాకు ఫోన్ చేసి వివరాలు తెలుసుకున్నారు.

కాగా గురువారం రాత్రినుంచి యమునానది కాస్త శాంతించింది. గురువారం సాయంత్రం 7 గంటలకు 208.66 మీటర్లకు చేరిన నీటిమట్టం శుక్రవారం మధ్యాహ్నం 3 గంటల సమయానికి 208.25 మీటర్లకు తగ్గింది. అయినప్పటికీ ప్రమాదస్థాయికన్నా మూడు మీటర్లు ఎగువనే ఉంది.ఢిల్లీలో వరద ప్రభావం కొనసాగుతుండడంతో ఈ నెల 16 వరకు విద్యాసంస్థలన్నిటినీ మూసివేశారు.అలాగే సుప్రీంకోర్టు, రాజ్‌ఘాట్ సమీపంలోకి వరద నీరు చేరింది.ఎర్రకోట సందర్శనను కూడా నిలిపి వేశారు. నిత్యావసర సరకులు మినహా నగరంలోకి భారీ వాహనాల రాకపై అధికారులు నిషేధం విధించారు. ఢిల్లీ ఇరిగేషన్, ఫ్లడ్ కంట్రోల్ డిపార్ట్‌మెంట్ రెగ్యులేటర్ పని చేయకపోవడంతో పరిస్థితి మరింత విషమించింది.

దీనివల్ల యమునా నది నీళ్లు తిరిగి నగరంలోకి ప్రవేశిస్తున్నాయి. దీంతో అప్రమత్తమైన ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఆర్మీ, ఎన్‌డిఆర్‌ఎఫ్ సాయాన్ని తీసుకోవలసిందిగా చీఫ్ సెక్రటరీని ఆదేశించారు. వరద ప్రవాహాన్ని ఆపడానికి ఒక మట్టి గోడను నిర్మించడానికి కార్మికులు, ఇంజనీర్లు నిన్న రాత్రంతా శ్రమించారని, సైన్యం, ఎన్‌డిఆర్‌ఎఫ్ కూడా ఇందులో పాలు పంచుకున్నాయని, మరి కొద్ది గంటల్లో వరద నీటిని ఆపగలమని ఆశిస్తున్నామని కేజ్రీవాల్ తెలిపారు.

స్మశానాలనూ ముంచెత్తిన వరదనీరు
వరద నీరు రోడ్లు, పార్కులు, చివరికి స్మశానాలను కూడా ముంచెత్తింది.కింగ్స్‌వే క్యాంప్‌లోని అంధుల పాఠశాలలోకి వరదనీరు చేరడంతో చిక్కుపడిన 60 మంది విద్యార్థులను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. మయూర్ విహార్‌లో ఓ పశువుల షెల్టర్‌లో చిక్కుపడిన 50 గోవులు, 60 కుక్కలనుఎన్‌డిఆర్‌ఎఫ్ బృందాలు బోట్ల సాయంతో కాపాడాయి. వరద నీరు చేరడంతో నిగమ్‌బోధ్ ఘాట్, గీతా కాలనీ, వజీరాబాద్, సరాయికాలేఖాన్ తదితర ప్రాంతాల్లోని స్మశానాలను సైతం మూసివేసినట్లు నగర మేయర్ షెల్లీ ఓబెరాయ్ శుక్రవారం చెప్పారు.మరో వైపు వరద సహాయక చర్యలపై ఆప్ ప్రభుత్వం, ఢిల్లీ లెఫ్టెనెంట్ గవర్నర్ కార్యాలయం మధ్య మాటల యుద్ధం కొనసాగుతూనే ఉంది.

ముగ్గురు చిన్నారులు మృతి
కాగా ఈశాన్యఢిల్లీలోని జహంగీర్ పురి ప్రాంతంలో వరద నీటిలో స్నానంకోసం దిగి ముగ్గురు చిన్నారులు మృతి చెందారు. చనిపోయిన ముగ్గురు పిల్లలు కూడా 10నుంచి 12 ఏళ్ల లోపు వారు. ఢిల్లీ వరదల్లో మరణాలు చోటు చేసుకోవడం ఇదే మొదటిసారి.

పంపుల సాయంతో వరదనీరు తోడివేత

మరోవైపు పంజాబ్, హనార్యనా రాష్ట్రాల్లో వరద ప్రభావిత పాతాల్లో నీటిని తోడేందుకు అధికారులు పంపులను రంగంలోకి దించారు. అధికారులు బాధిత ప్రజలకు నిత్యావసర సరకులతో పాటుగా తాగు నీటిని అందిస్తున్నారు. ఇప్పటివరకు పంజాబ్‌లోని వివిధ వరద పీడిత జిల్లాల్లో 19 వేల మందికి పైగా ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు, హర్యానాలో 3,674 మందిని తరలించినట్లు అధికారులు చెప్పారు. గత శనివారంనుంచి సోమవారం వరకు కురిసిన భారీ వర్షాల కారణంగా పంజాబ్‌లో 14 జిల్లాలు, హర్యానాలో పది జిల్లాలపై ప్రభావం పడింది. ఈ రెండు రాష్ట్రాల్లో కలిసి ఇప్పటివరకు 27 మంది చనిపోయారు. పంజాబ్ ముఖ్యమంత్రి జలంధర్‌జిల్లాలోని ఫిరోజ్‌పూర్‌లో పర్యటించి పరిస్థితిని సమీక్షించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News