Monday, January 20, 2025

ప్రొఫెసర్ సాయిబాబా కన్నుమూత

- Advertisement -
- Advertisement -

నిమ్స్‌లో చికిత్స పొందుతూ
శనివారం రాత్రి తుది శ్వాస విడిచిన
పౌర హక్కుల ఉద్యమ నేత
మావోలతో సంబంధాలున్నాయన్న
ఆరోపణలతో అరెస్టయి దాదాపు తొమ్మిదేళ్లపాటు
జైలు జీవితం గడిపిన సాయిబాబా
జైలు నుంచి విడుదలైన తర్వాత
అనారోగ్యంతో బాధపడుతూ నిమ్స్‌లో చికిత్స
శనివారం ఒక్కసారిగా విషమించిన
సాయిబాబా ఆరోగ్య పరిస్థితి..
అదేరోజు రాత్రి కన్నూమూత

సాయిబాబా భౌతిక కాయాన్ని
గాంధీ ఆసుపత్రికి అప్పగిస్తాం
కుటుంబ సభ్యుల ప్రకటన

మనతెలంగాణ/హైదరాబాద్ : పౌర హక్కుల ఉద్యమకారుడు, రచయిత, విద్యావేత్త, ఢిల్లీ యూనివర్సిటీ మాజీ ప్రొఫెసర్ జిఎన్ సాయిబాబా కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన చికిత్స కోసం కొద్ది రోజుల క్రితం నిమ్స్ ఆసుపత్రిలో చేరారు. నిమ్స్‌లో చికిత్స పొందుతూ శనివారం రాత్రి 8.45 గంటలకు తుది శ్వాస విడిచారు. గత కొంత కాలంగా ఉదరకోశ వ్యాధులతో బాధపడుతున్న సాయిబాబాను సెప్టెంబర్ 28న కుటుంబ సభ్యులు నిమ్స్ ఆస్పత్రిలో చేర్పించారు. ఆయనకు వైద్య పరీక్షలు చేసిన వైద్యులు కాలేయం, గాల్ బ్లాడర్, చిన్న పేగు సమస్యలు ఉన్నట్లు గుర్తించారు. మూడు రోజుల క్రితం తీవ్రమైన కడుపునొప్పితో బాధపడ్డ సాయిబాబాను మరో సారి పరీక్షించగా, ఇంటర్నల్ బ్లీడింగ్ అయినట్లు గుర్తించారు. దాంతో పాటు తీవ్రమైన జ్వరం, హైబీపీతో బాధపడ్డారు.

ప్రొఫెసర్ సాయిబాబాకు ఇటీవల గాల్‌బ్లాడర్ ఆపరేషన్ జరుగగా.. ఈ ఆపరేషర్‌లో ఆయన గాల్‌బ్లాడర్ తొలగించి స్టంట్ వేసిన చోట చీము పట్టింది. దీంతో తీవ్రమైన పొత్తికడుపు నొప్పి, హైఫీవర్‌తో బాధపడ్డారు. డాక్టర్లు చీము తొలగించినప్పటికీ ఆయన తీవ్ర నొప్పితో బాధపడుతున్నారని వైద్యులు తెలిపారు. ఇక శనివారం ఆయన పరిస్థితి మరింత క్షీణించిందని, అంతర్గత రక్తస్రావంతోపాటు పొత్తికడుపులో వాపుతో ఆయన బాధపడ్డారు. శనివారం ఒక్కసారిగా పరిస్థితి విషమించడంతో పాటు గుండెపోటు రావడంతో డాక్టర్లు ఎంత ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయింది. శనివారం రాత్రి 8.45 గంటలకు తుది శ్వాస విడిచారు. మృతుడికి భార్య వనంత కుమారి, కుమార్తె మంజీర ఉన్నారు. కాగా ఆదివారం పలువురు ప్రముఖులు నిమ్స్ మార్చురీలోని ఆయన మృతదేహాన్ని సందర్శించి నివాళులు అర్పించారు.

మావోయిస్టులతో సంబంధాలు ఉన్నాయనే ఆరోపణలతో 2014లో ప్రొఫెసర్ సాయిబాబాను పోలీసులు అరెస్ట్ చేశారు. 2017లో ఆయనకు గడ్చిరోలి సెషన్ కోర్టు జీవితఖైతు విధించింది. దీంతో 2017 నుంచి 2024 మార్చి 6 వరకు దాదాపు తొమ్మిదేళ్లపాటు ఆయన జైలు జీవితం గడిపారు. ఈ ఏడాది మార్చి 5వ తేదీన బాంబే హైకోర్టు సాయిబాబాను నిర్థోషిగా ప్రకటించడంతో నాగ్‌పూర్ నుంచి విడుదలయ్యారు. జైలు నుంచి విడుదలైన ఆయన గత కొంతకాలంగా అనారోగ్యం బాధపడుతూ చికిత్స తీసుకుంటున్నారు. కాగా, శనివారం రాత్రి తుదిశ్వాస విడిచారు. మానవ హక్కుల ఉద్యమకారుడు, రచయిత, విద్యావేత్తగా ప్రొఫెసర్ సాయిబాబా గుర్తింపు పొందారు.

నేడు సాయిబాబా అంతిమయాత్ర

ఢిల్లీ యూనివర్సిటీ మాజీ ప్రొఫెసర్, పౌర హక్కుల ఉద్యమకారుడు జీఎన్ సాయిబాబా(56) భౌతికకాయాన్ని ఆసుపత్రికి అప్పగించనున్నట్లు కుటుంబ సభ్యులు ప్రకటించారు. ఆయన కళ్లను ఎల్.వి.ప్రసాద్ కంటి ఆస్పత్రికి దానం చేస్తున్నట్లు చెప్పారు. ఆత్మీయుల నివాళి అనంతరం భౌతికకాయన్ని గాంధీ ఆస్పత్రికి అందజేస్తామని కుటుంబ సభ్యులు ఓ ప్రకటనలో తెలిపారు. శనివారం రాత్రి తుది శ్వాస విడిచిన సాయిబాబా పార్థివదేహాన్ని సోమవారం ఉదయం 8 గంటలకు నిమ్స్ మార్చురీ నుంచి ఆయన కుటుంబ సభ్యులు తీసుకుంటారు. అక్కడి నుంచి 9 గంటల సమయంలో గన్‌పార్క్ చేరి, అక్కడ పావుగంట పాటు పార్ధివదేహన్ని ఉంచనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. మౌలాలి కమాన్ దగ్గర శ్రీనివాసా హైట్స్ చేరి, మధ్యాహ్నం 2 గంటలకు అక్కడ ఉంచుతారు. మధ్యాహ్నం 2.30 గంటలకు చివరి ఊరేగింపుగా బయలుదేరి 4 గంటలకు గాంధీ మెడికల్ కాలేజీకి చేరుతుంది. అంతిమయాత్ర అనంతరం సాయిబాబా కోరిక మేరకు ఆయనకుటుంబ సభ్యులు మృతదేహం గాంధీ ఆసుపత్రికి ఇవ్వనున్నారు. ఇప్పటికే సాయిబాబా కళ్లను ఎల్.వి ప్రసాద్ ఆసుపత్రికి కుటుంబ సభ్యులు డొనేట్ చేశారు. సాయిబాబాకు చివరి శ్రద్ధాంజలి ఘటించదలచుకున్న వారు ఈ స్థలాల్లో ఎక్కడికైనా రావొచ్చని కుటుంబ సభ్యులు, ఉద్యమ సహచరులు ప్రకటించారు.

సుధీర్ఘంగా సాగిన కేసు విచారణ

దేశంపై యుద్ధం చేస్తున్నారని, మావోయిస్టులతో సంబంధాలు కలిగివున్నారని ఆరోపిస్తూ 90 శాతం వైకల్యంతో వీల్‌చైర్‌కు పరిమితమైన సాయిబాబాను, మరో ఐదుగురిని 2014లో మహారాష్ట్ర పోలీసులు అరెస్టు చేశారు. అనంతరం ఈ కేసును నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (ఎన్‌ఐఎ) దర్యాప్తు చేసింది. ఈ కేసు విచారణ జరిపిన గడ్చిరోలి సెషన్స్ కోర్టు 2017లో నిందితులకు జీవితఖైదు విధించింది. అప్పటి నుంచి సాయిబాబా నాగ్‌పూర్ జైలులో శిక్ష అనుభవించారు. అయితే సెషన్స్ కోర్టు తీర్పును సవాల్ చేస్తూ నిందితులు హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై 2022 అక్టోబర్‌లో విచారణ జరిపిన ఉన్నత న్యాయస్థానం వారిని నిర్దోషులుగా ప్రకటించింది. వెంటనే వారిని జైలు నుంచి విడుదల చేయాలని ఆదేశించింది.

తీర్పు వెలువడిన రోజే మహారాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. విచారణ జరిపిన సర్వోన్నత న్యాయస్థానం నిందితుల విడుదలపై స్టే విధించింది. అనంతరం 2023 ఏప్రిల్‌లో మరోసారి విచారణ జరిపిన అత్యున్నత న్యాయస్థానం.. నిందితులను నిర్దోషులుగా ప్రకటిస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పును పక్కనబెట్టింది. వారి అప్పీల్‌పై మళ్లీ మొదటి నుంచి విచారణ జరపాలని మహారాష్ట్ర ఉన్నత న్యాయస్థానాన్ని ఆదేశించింది. ఈ క్రమంలోనే విచారణ చేపట్టిన బాంబే హైకోర్టు సాయిబాబా సహా మిగతా నిందితులను నిర్దోషులుగా ప్రకటిస్తూ తీర్పు వెలువరించింది. కాగా, అరెస్టు నేపథ్యంలో 2014లో ప్రొఫెసర్ సాయిబాబాను ఢిల్లీ యూనివర్సిటీ సస్పెండ్ చేసింది. 2021లో పూర్తిగా విధుల నుంచి తీసేసింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News