Monday, December 23, 2024

ఢిల్లీలో పొగమంచు.. కన్పించని దరిదాపులు

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీలో శనివారం దట్టమైన పొగమంచుతో దృశ్యమాన్యత క్షీణించింది. దీనితో స్థానిక ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి రావల్సిన 18కు పైగా విమానాలను దారి మళ్లించారు. నగరంలో తీవ్ర వాయుకాలుష్యం, ఇప్పుడు శీతాకాలం పొగమంచు కారణంగా దరిదాపుల్లో కూడా ఏదీ కన్పించని పరిస్థితి ఏర్పడటం పౌరులకు తీవ్ర అసౌకర్యం కల్గించింది. వివిధ ప్రాంతాల నుంచి ఢిల్లీ మజిలీగా చేరాల్సిన విమానాలను వాతావరణ ప్రతికూలతలతో లక్నో, అహ్మదాబాద్, అమృత్‌సర్ ఇతర నగరాలకు దారిమళ్లించాల్సి వచ్చింది. పలు ప్రాంతాలలో కేవలం దట్టమైన మబ్బుల పొరలు తప్పితే వేరే ఏమీ కన్పించని స్థితి ఏర్పడింది. ఉదయం 7.30 నుంచి 10.30 వరకూ విమానాలను మళ్లించారు. స్పైస్‌జెట్ ఎయిర్‌లైన్స్ వర్గాలు విమానాల దారిమళ్లింపు గురించి అధికారిక ప్రకటన వెలువరించారు. వాతావరణ పరిస్థితి క్షీణించినందున పలు విమానాల రాకపోకలను నిలిపివేసినట్లు, దీనితో ఆ తరువాతి విమానాల రాకపోకలపై కూడా ప్రభావం పడుతుందని వివరించారు.

ప్రస్తుత పరిస్థితితో దూర ప్రాంతాల నుంచి తరలివచ్చే ప్రయాణికులు ఇక్కట్లకు గురికాగా, వీరి గురించి వారీ బంధువుల ఆందోళన ఎక్కువైంది. ప్రయాణికులు తమ విమాన సర్వీసుల వివరాలను ఎప్పటికప్పుడు ఆన్‌లైన్ ద్వారా చెక్ చేసుకుని స్పందించాల్సి ఉందని అధికారులు తెలిపారు. శీతాకాల కష్టాలు దేశ రాజధాని పౌరులకు ఇటీవలి కాలంలో తీవ్రతరం అవుతున్నాయి. విస్తారా ఎయిర్‌లైన్స్ విమానాలు రెండింటిని నిలిపివేశారు. అహ్మదాబాద్ నుంచి ఢిల్లీకి బయలుదేరిన విమానం యుకె 906ను దృశ్యలోపతతో తిరిగి అహ్మదాబాద్‌కు మళ్లించారు. ముంబై నుంచి ఢిల్లీకి బయలుదేరిన ఫ్లెయిట్ యుకె 954 విమానాన్ని జైపూర్‌కు తరలించారు. ఢిల్లీలో వాయునాణ్యత శనివారం అంతకు ముందటి దయనీయ స్థితి నుంచి కొంచెం మెరుగుపడింది. ఢిల్లీ కాలుష్య నియంత్రణ మండలి అయిన సిపిసిబి లెక్కల ప్రకారం శనివారం లోధీ రోడ్‌లో వాయు నాణ్యత 366గా నిలిచింది. ఆనంద్ విహార్‌లో ఇది 388గా ఉంది. శనివారం ఉదయం కనిష్ట ఉష్ణోగ్రతలు 12 డిగ్రీల సెల్సియస్‌గా ఉంది. గరిష్ట ఉష్ణోగ్రతలు 25 డిగ్రీల సెల్సియస్‌గా నిలిచింది. వర్షసూచన ఏమీ లేదని వాతావరణ పరిశోధన విభాగం తెలిపింది. గాలిలోని కాలుష్య కణాలను లెక్కలోకి తీసుకుని సగటున వాయునాణ్యత సూచీలను ఖరారు చేయడం జరుగుతుంది. దీనిని ఎక్యూగా వ్యవహరిస్తారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News