Monday, December 23, 2024

హైదరాబాద్‌కు హ్యాట్రిక్ ఓటమి

- Advertisement -
- Advertisement -

ముంబై: ఐపిఎల్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ వరుసగా మూడో ఓటమిని చవిచూసింది. గురువారం జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ 21 పరుగుల తేడాతో హైదరాబాద్‌ను ఓడించింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 207 పరుగులు చేసింది. తర్వాత బ్యాటింగ్‌కు దిగిన సన్‌రైజర్స్ నిర్ణీత ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 186 పరుగులు మాత్రమే చేసి ఓటమి పాలైంది. మార్‌క్రామ్ (42), నికోలస్ పూరన్ (62) రాణించినా ఫలితం లేకుండా పోయింది.
వార్నర్ దూకుడు..
అంతకుముందు తొలుత బ్యాటింగ్ చేపట్టిన ఢిల్లీ క్యాపిటల్స్‌కు తొలి ఓవర్‌లోనే షాక్ తగిలింది. ఓపెనర్ మన్‌దీప్ సింగ్ (0)ను భువనేశ్వర్ కుమార్ ఔట్ చేశాడు. అప్పటికీ ఢిల్లీ ఖాతానే తెరవలేదు. ఇక తర్వాత వచ్చిన మిఛెల్ మార్ష్ కూడా ఎక్కువ సేపు క్రీజులో నిలువలేక పోయాడు. రెండు ఫోర్లతో 10 పరుగులు మాత్రమే చేసి ఔటయ్యాడు. అయితే మరో ఓపెనర్ డేవిడ్ వార్నర్ జోరును కొనసాగించాడు. అతనికి కెప్టెన్ రిషబ్ పంత్ అండగా నిలిచాడు. పంత్ ఆరంభంలో సమన్వయంతో ఆడగా వార్నర్ దూకుడును ప్రదర్శించాడు. ఒకవైపు వికెట్‌ను కాపాడుకుంటూనే చెత్త బంతుల్ని బౌండరీలుగా మలుస్తూ ముందుకు సాగారు. ఈ జోడీని విడగొట్టేందుకు సన్‌రైజర్స్ బౌలర్లు చేసిన ప్రయత్నాలు చాలా సేపటి వరకు ఫలించలేదు. ఇక శ్రేయస్ గోపాల్ వేసిన ఒక ఓవర్‌లో కెప్టెన్ రిషబ్ పంత్ వరుసగా మూడు సిక్సర్లు కొట్టాడు. అయితే అదే ఓవర్ చివరి బంతికి పంత్ ఔటయ్యాడు. కెప్టెన్సీ ఇన్నింగ్స్ ఆడిన పంత్ 16 బంతుల్లో మూడు సిక్సర్లు, ఒక ఫోర్‌తో 26 పరుగులు చేసి వెనుదిరిగాడు.
పొవెల్ విధ్వంసం..
ఆ తర్వాత వచ్చిన రోమన్ పొవెల్ విధ్వంసక ఇన్నింగ్స్‌తో ఆకట్టుకున్నాడు. ఆరంభంలో కాస్త నెమ్మదిగా ఆడిన పొవెల్ కుదురుకున్న తర్వాత జోరును పెంచాడు. ఇటు వార్నర్, అటు పొవెల్ సన్‌రైజర్స్ బౌలర్లపై ఎదురుదాడి చేస్తూ స్కోరును పరిగెత్తించారు. వీరిని కట్టడి చేయడంలో పూర్తిగా విఫలమయ్యారు. వార్నర్ కంటే పొవెల్ మరింత దూకుడును ప్రదర్శించాడు. వరుస సిక్సర్లతో పెను ప్రకంపనలు సృష్టించాడు. అతన్ని ఎలా ఔట్ చేయాలో సన్‌రైజర్స్ బౌలర్లకు అంతుబట్టకుండా పోయింది. వార్నర్ కూడా ఫోర్లు, సిక్సర్లతో సెంచరీ దిశగా దూసుకెళ్లాడు. ఈ జోడీని విడగొట్టేందుకు ప్రత్యర్థి బౌలర్లు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. కీలక ఇన్నింగ్స్ ఆడిన వార్నర్ 58 బంతుల్లోనే 12 ఫోర్లు, మూడు సిక్సర్లతో 92 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. ఇక విధ్వంసక బ్యాటింగ్‌ను కనబరిచిన పొవెల్ 35 బంతుల్లోనే ఆరు భారీ సిక్సర్లు, మరో మూడు ఫోర్లతో 67 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. ఈ క్రమంలో వీరు నాలుగో వికెట్‌కు అజేయంగా 122 పరుగులు జోడించారు. దీంతో ఢిల్లీ స్కోరు 207 పరుగులకు చేరింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News