Friday, February 28, 2025

దక్షిణాదిపై ‘పునర్విభజన’ కత్తి

- Advertisement -
- Advertisement -

దక్షిణాది రాష్ట్రాలకు ‘నియోజకవర్గాల పునర్విభజన’ టెన్షన్ వెంటాడుతోంది. 2026 నాటికి రాజ్యాంగబద్ధంగా నిర్దేశించిన నియోజకవర్గ పునర్విభజన ప్రక్రియ వల్ల దక్షిణాది రాష్ట్రాలకు పార్లమెంట్‌లో ప్రాతినిధ్యం తగ్గిపోవడమే కాక, నిధుల కేటాయింపులో కూడా తేడాలు వస్తాయని దక్షిణాది రాష్ట్రాలు ఆందోళన చెందుతున్నాయి. పునర్విభజన పేరుతో దక్షిణాది రాష్ట్రాలపై కత్తి వేలాడుతోందని తీవ్రంగా విమర్శిస్తున్నాయి. గత మంగళవారం తమిళనాడు కేబినెట్ సమావేశం తరువాత తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకె స్టాలిన్ ఈ అంశంపై విస్తృతంగా చర్చించడానికి మార్చి 5న అఖిలపక్ష సమావేశానికి పిలుపునిచ్చారు. దేశ ప్రధాన లక్షమైన జనాభా నియంత్రణలో తమిళనాడు విజయం సాధించిందని, అయితే తక్కువ జనాభా ఉండడం వల్ల లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజనలో పార్లమెంట్‌లో తమిళనాడు సీట్లు తగ్గే అవకాశం ఉందన్నారు. ఒకవేళ సీట్లు తగ్గితే 39 కాకుండా 31 మంది ఎంపిలు మాత్రమే ఉంటారని అంచనాగా చెప్పారు.

అందుకని రాజకీయ పార్టీలను అన్నిటినీ అఖిల పక్ష సమావేశానికి ఆహ్వానిస్తున్నట్టు స్టాలిన్ వివరించారు. దీన్ని బట్టి పార్టీల సిద్ధాంతాలకు అతీతంగా అన్ని రాజకీయ పార్టీలను కలుపుకుని పునర్విభజనపై ఉద్యమించే పరిస్థితి కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో దక్షిణాది రాష్ట్రాల్లో పునర్విభజన ప్రక్రియ ద్వారా పార్లమెంట్ స్థానాలు ఏమాత్రం తగ్గవని కేంద్ర హోం మంత్రి అమిత్ షా భరోసా ఇవ్వడం చర్చనీయాంశం అవుతోంది. తమిళనాడులోని కోయంబత్తూరులోని ఈశా కేంద్రంలో జరిగే శివరాత్రి వేడుకల్లో పాల్గొనేందుకు వచ్చిన అమిత్ షా పునర్విభజన ప్రక్రియపై మాట్లాడడం విశేషం. ప్రధాని మోడీ ఇచ్చిన వాగ్దానం మేరకు దక్షిణ భారత రాష్ట్రాలకు ప్రోరేటా విధానంలో ఒక్క పార్లమెంట్ సీటు కూడా తగ్గదని పేర్కొన్నారు. దక్షిణాది రాష్ట్రాలకు తాము అన్యాయం జరగనివ్వబోమని హామీ ఇచ్చారు. దీనిపై వాస్తవాలను పరిశీలిస్తే జనాభా లెక్కల సేకరణ జరిగినప్పుడు చట్టసభల్లో రాష్ట్రాల స్థానాల సంఖ్యను కొత్తగా నిర్ధారించాలని టార్గెట్‌గా పెట్టుకోవడం రాష్ట్రాలకు తీరని ప్రతిబంధకమే.

ఎందుకంటే దేశంలో జనాభాను పరిమితం చేయడానికి జనాభా నియంత్రణ చట్టాన్ని ఎప్పుడో అమలులోకి తెచ్చారు. ఈ లక్ష సాధనకు పాటుపడిన రాష్ట్రాల్లో జనాభా నియంత్రణలో సత్ఫలితాలు వచ్చాయి. ఇప్పుడు దక్షిణాది రాష్ట్రాలు మూడు ప్రధాన కారణాలపై ఆందోళన చెందుతున్నాయి. కేంద్ర అధికార విభజనలో కానీ, నిధుల కేటాయింపులో కానీ ఉత్తరాది రాష్ట్రాలకు వాటి జనాభా ప్రకారం ఎక్కువ సింహభాగం దక్కడం మొదటి కారణం. జనాభా గణన తరువాత నియోజకవర్గాల పునర్విభజన జరిగితే పార్లమెంట్‌లో దక్షిణాది రాష్ట్రాలకు తక్కువ సీట్లు లభించే అవకాశం ఏర్పడడం రెండో కారణం. వయోవృద్ధుల జనాభా విషయంలో ఉత్తరాది రాష్ట్రాల్లో అసమతుల్యత కనిపించడం మూడో కారణం. అనుకొన్న ప్రకారం నియోజకవర్గాల పునర్విభజన 2026 లో చేపట్టాలనుకుంటే ఆలోపుగానే జనాభా లెక్కల సేకరణ పూర్తి కావాలి. అయితే లోక్‌సభలో ప్రస్తుతం ఉన్న స్థానాల సంఖ్య 1971 జనాభా లెక్కల ప్రాతిపదికన నిర్ధారణ అయింది. నియోజకవర్గాల పునర్య్వవస్థీకరణను 2001 జనాభా లెక్కల సేకరణ జరిగే వరకు స్తంభింపచేస్తూ 1976లో ఎమెర్జెన్సీ కాలంలో అప్పటి ప్రధాని ఇందిరా గాంధీ నిర్ణయం తీసుకున్నారు. దాని పరిధులను 2026 తర్వాత జరగబోయే మొదటి జనాభా లెక్కల వరకు వాయిదా వేస్తూ 2001లో 84 వ రాజ్యాంగ సవరణ తీసుకువచ్చారు.

ప్రధాని మోడీ ప్రభుత్వం లోక్‌సభలోనూ, రాష్ట్రాల శాసనసభల్లోనూ మహిళలకు 33% రిజర్వేషన్లు కల్పిస్తూ చట్టం తీసుకువచ్చిన నేపథ్యంలో నియోజకవర్గాల పునర్వవస్థీకరణకు ప్రాధాన్యం ఏర్పడింది. ఈ రిజర్వేషన్లు ప్రస్తుత లోక్‌సభ స్థానాల బట్టి కాకుండా కొత్తగా సేకరించే జనాభా లెక్కల ప్రకారం జరిగే పునర్వవస్థీకరణ వల్ల పెరగనున్న లోక్‌సభ స్థానాల ఆధారంగా ఇవ్వాలని నిర్ణయించడమే ఇందుకు కారణమైంది. 2021లో జరగవలసిన జనాభా లెక్కల సేకరణ ఆ ఏడాది కొవిడ్ మహమ్మారి కారణంగా వాయిదా పడింది. అయితే 2026లో పునర్వవస్థీకరణ చేపట్టాలని కేంద్రం సంకల్పించే సూచనలు కనిపిస్తున్నందున అప్పటికుండే జనాభా ప్రకారం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల లోక్‌సభ స్థానాలు ఇప్పుడున్న 42 నుంచి 34కి తగ్గిపోతాయని వాషింగ్టన్‌లోని కార్నెగీ ఎండోమెంట్ సంస్థ గతంలో ప్రకటించింది.

అలాగే తమిళనాడులో 39 నుంచి 31కి తగ్గిపోతాయని అంచనా. 2026 నాటికి దేశ జనాభా 1.41 బిలియన్‌కు చేరుకోవచ్చని తెలుస్తోంది. అందుచేత నియోజకవర్గాల పునర్విభజన తప్పనిసరి కావచ్చు. మహిళా రిజర్వేషన్ చట్టం కోసం జనాభా లెక్కల సేకరణ తప్పనిసరి. 1951, 1961, 1971 వరకు జనాభా లెక్కల సేకరణ జరిగింది. ఇదే పంథాలో జనాభా లెక్కల సేకరణ జరిగితే లోక్‌సభ స్థానాలు 543 నుంచి 753కు పెరిగే అవకాశం కనిపిస్తోంది. ప్రస్తుతం మొత్తం 543 లోక్‌సభ స్థానాల్లో దక్షిణాది రాష్ట్రాల స్థానాలు 129 వరకు ఉంటున్నాయి. జనాభా ఆధారంగా నియోజకవర్గాల పునర్విభజన జరిగితే లోక్‌సభలో దక్షిణాది స్థానాల వాటా 17% వరకు తగ్గడమే కాక, హిందీ మాట్లాడే రాష్ట్రాల వాటా 60% వరకు పెరిగే అవకాశం కనిపిస్తోంది. పార్లమెంట్‌లో దక్షిణాది ప్రాతినిధ్యం తగ్గితే రాజకీయ ప్రాబల్యం కూడా తగ్గినట్టే. బిజెపి ఆధిపత్యం ఉన్న హిందీ భాషా రాష్ట్రాల ప్రాతినిధ్యం పెరుగుతుంది. ఇది జాతీయ విధాన నిర్ణయాలపై ప్రభావం చూపిస్తుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News