జనాభా ప్రాతిపదికన నిర్వహిస్తే
దక్షిణాది భవిష్యత్‌కు పెనుముప్పు
కేంద్రం వివక్షతో ఇప్పటికే
నష్టపోతున్న సౌత్ బిఆర్‌ఎస్
వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్
మన తెలంగాణ / హైదరాబాద్ : డీలిమిటేషన్‌పై ప్రశ్నించకుంటే తమను చరిత్ర క్షమించదని బీఆర్‌ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ అన్నారు. లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజనలో దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరగనుందన్న విషయమై చర్చించేందుకు డీఎంకే ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అఖిలపక్ష సమావేశానికి కేటీఆర్ హాజరైన సందర్భంగా మాట్లాడుతూ దక్షిణాది రాష్ట్రాలపై బీజేపీ ప్రభుత్వం వివక్ష చూపిస్తోందని, డీలిమిటేషన్ వల్ల తెలంగాణలో లోక్‌సభ నియోజకవర్గాల సంఖ్య తగ్గిపోతుందని కేటీఆర్ ఆందోళన వ్యక్తం చేశారు.
కేంద్రం చూపించే వివక్షతో దక్షిణాది రాష్ట్రాలు పూర్తిగా నష్టపోతాయని అన్నారు. జనాభా ఆధారంగా సీట్లు పెంచడం సమాఖ్య స్ఫూర్తికి తీవ్ర విఘాతం కలిగించినట్లవుతుంది ఆయన పేర్కొన్నారు. జనాభా ప్రాతిపదికన కాకుండా జీడీపీ ప్రకారం చూసుకోవాలని, దేశంలో తెలంగాణ జనాభా 2.8 శాతం ఉంటే జీడీపీ పరంగా చూస్తే 5.1 శాతం అందిస్తోందని వెల్లడించారు. డీలిమిటేషన్‌తో దక్షిణాది భవిష్యత్తుకు పెను ప్రమాదం ఉందని అన్నారు. దశాబ్దాల నుంచి దక్షిణాదిపై వివక్ష కొనసాగుతున్నదని అన్నారు. ఈ విధానం కేవలం పార్లమెంటులో ప్రాతినిధ్యానికి సంబంధించిన అంశం మాత్రమే కాదని, నిధుల కేంద్రీకరణతో పాటు ఆర్థిక నియంతృత్వానికి దారితీస్తుందని, దక్షిణాది రాష్ట్రాల భవిష్యత్తును నాశనం చేస్తుందని ఆయన హెచ్చరించారు. భారతదేశం ప్రజాస్వామిక దేశమైనప్పటికీ, భిన్న అస్తిత్వాలు, సంస్కృతులతో కూడిన సమాఖ్య రాష్ట్రమన్న విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు.
దక్షిణాది రాష్ట్రాల భవిష్యత్తు ప్రశ్నార్థకం : ప్రస్తుత డీలిమిటేషన్ విధానంతో దక్షిణాది రాష్ట్రాల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారుతుందని కేటీఆర్ ఆందోళన వ్యక్తం చేశారు. దక్షిణాది రాష్ట్రాలు కేంద్ర ప్రభుత్వం నుంచి దశాబ్దాలుగా వివక్షను ఎదుర్కొంటున్నాయని, ప్రస్తుత డీలిమిటేషన్ ప్రతిపాదనలతో పార్లమెంట్ ప్రాతినిధ్యంతో పాటు అన్ని రంగాల్లో అన్యాయం జరుగుతుందన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రజల ప్రాతినిధ్యాన్ని, ప్రభుత్వాలతో సంబంధాలను పెంపొందించి మంచి పరిపాలన అందించాలనే ఉద్దేశంతో డీలిమిటేషన్ చేపడుతున్నట్లయితే, రాష్ట్రాల మధ్య విభేదాలు సృష్టించే ఈ విధానానికి ప్రత్యామ్నాయాలను ఆలోచించాలని కేటీఆర్ సూచించారు.
భారత రాష్ట్ర సమితి తరఫున కొన్ని ప్రత్యామ్నాయాలను ప్రతిపాదిస్తున్నట్లు ఆయన తెలిపారు. జనాభా ఆధారంగా అసెంబ్లీలో ఎమ్మెల్యే స్థానాలను పెంచితే పరిపాలన ఫలితాలు ప్రజలకు సమర్థవంతంగా అందుతాయని, అందుకే పార్లమెంట్ స్థానాలను యథాతథంగా ఉంచి ఎమ్మెల్యే స్థానాలను పెంచాలని ఆయన సూచించారు. లేదంటే అన్ని రాష్ట్రాలకు సమాన ప్రాతినిధ్యం కల్పించడం లేదా రాష్ట్రాలు సాధించిన అభివృద్ధి ఆధారంగా సీట్ల విభజన చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. దక్షిణాది రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వ వివక్ష కొత్తేమీ కాదని, అయితే మోడీ ప్రధానమంత్రి అయ్యాక ఈ అన్యాయం మరింత పెరిగిందని కేటీఆర్ అన్నారు.
ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధం : ఆదర్శవంతమైన సమైక్య రాష్ట్ర దేశంలో ఒక ప్రాంతం మరొక ప్రాంతంపై ఆధిపత్యం చెలాయించడం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమని కేటీఆర్ అన్నారు. ఈ సమస్య కేవలం ఉత్తర, దక్షిణాది రాష్ట్రాల వ్యవహారం కాదని, జనాభా ఆధారంగా సీట్ల పెరుగుదల దేశ సమాఖ్య స్ఫూర్తికి విఘాతం కలిగిస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రస్తుత బీజేపీ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు సందర్భంగా పునర్విభజన చట్టంలో ఇచ్చిన డీలిమిటేషన్ హామీలను నిర్లక్ష్యం చేసిందని కేటీఆర్ ఆరోపించారు. బీజేపీ ప్రయోజనాల కోసం తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రాల్లో డీలిమిటేషన్ చేయకపోగా, జమ్మూ కశ్మీర్లో మాత్రం అమలు చేసిందని విమర్శించారు. బీజేపీ వంటి పార్టీలు ఈ సమావేశాన్ని దేశ వ్యతిరేకంగా చూపే ప్రయత్నం చేసినా మేమంతా భారతీయులం, దేశ అభివృద్ధి కోసం పని చేస్తున్నామని కేటీఆర్ గుర్తు చేశారు. ఈ సమావేశం తర్వాత ఇలాంటి సమావేశాలు మరిన్ని జరుగుతాయని, దక్షిణాది రాష్ట్రాల పార్టీలు, నేతలు కలిసి ప్రస్తుత డీలిమిటేషన్ విధానంపై పోరాటం చేస్తామని కీలక ప్రకటన చేశారు.
ప్రశ్నించకుంటే మనల్ని చరిత్ర క్షమించదు : దక్షిణాది రాష్ట్రాలపై బీజేపీ ప్రభుత్వం వివక్ష చూపిస్తోంది. డీలిమిటేషన్ వల్ల తెలంగాణలో నియోజకవర్గాల సంఖ్య తగ్గిపోతుందని ఆవేదన వ్యక్తం చేశారు. జనాభా ఆధారంగా సీట్లు పెంచితే సమాఖ్య స్ఫూర్తికి తీవ్ర విఘాతం అని, దేశ అభివృద్ధి కోసం పనిచేస్తే దక్షిణాది రాష్ట్రాలకు నష్టం జరుగుతోందన్నారు. కేంద్రం వివక్షతో ఇప్పటికే దక్షిణాది నష్టపోతోందని, డీలిమిటేషన్ దేశాభివృద్ధిలో ముందున్న రాష్ట్రాలకు నష్టం కలిగిస్తుందన్నారు. అధికారం పూర్తిగా కేంద్రీకృతమై నియంతృత్వం వైపు దారితీసే అవకాశం ఉందన్నారు.
భవిష్యత్తు తరాలు మన మౌనాన్ని తప్పకుండా ప్రశ్నిస్తాయని, కుటుంబనియంత్రణ పాటించిన రాష్ట్రాలను శిక్షించడం సరికాదన్నారు. కేవలం జనాభా ప్రాతిపదికన కాకుండా జీడీపీ ప్రకారం చూసుకోవాలని, దేశంలో తెలంగాణ జనాభా 2.8 శాతం కానీ జీడీపీ పరంగా చూస్తే 5.1 శాతం అని కేటీఆర్ అన్నారు. ఈ విధానాన్ని అవలంబిస్తే అనేక నష్టాలు ఏర్పడతాయని, దేశాభివృద్ధిలో ముందున్న రాష్ట్రాలకు నష్టం చేకూర్చినట్లు అవుతుందని కేటీఆర్ తెలిపారు. డీలిమిటేషన్ విధానాన్ని అనుసరించడం ద్వారా అధికారం పూర్తిగా కేంద్రీకృతమై నియంతృత్వం వైపు దారితీసే అవకాశం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు.