Friday, November 8, 2024

యుకెలో కేసుల పెరుగుదలకు కారణంగా డెల్టా ఎవై 4.2 గుర్తింపు

- Advertisement -
- Advertisement -

Delta AY4.2 recognition due to an increase in cases in UK

తీవ్రతపై మదింపు జరుపుతున్నామన్న నిపుణులు

లండన్: కొవిడ్19 డెల్టా వైరస్ నుంచి ఆవిర్భవించిన నూతన మ్యుటేషన్ డెల్టా ఎవై 4.2ను పరిశోధన కింద ఉన్న వేరియంట్(వేరియంట్ అండర్ ఇన్వెస్టిగేషన్)గా భావించి మదింపు జరుపుతున్నామని యుకె ఆరోగ్య భద్రతా ఏజెన్సీ(ఉఖ్సా) పేర్కొన్నది. ఈ వేరియంట్‌కు ‘వియుఐ21ఒసిటి01’గా నామకరణం చేసింది. ప్రాథమిక సమాచారం మేరకు ఈ వేరియంట్ వల్ల కేసులు పెరుగుతున్నట్టు గుర్తించామని ఉఖ్సా తెలిపింది.

మొదట భారత్‌లో వెలుగు చూసిన డెల్టా వేరియంట్‌కన్నా దీని వల్ల కేసుల సంఖ్య పెరుగుతున్నప్పటికీ, రోగ తీవ్రతను పెంచుతుందనిగానీ, వినియోగంలో ఉన్న వ్యాక్సిన్లను ఇది తప్పించుకోగలదనిగానీ ఇంకా నిర్ధారించలేదని ఉఖ్సా తెలిపింది. ఎవై 4.2.. డెల్టా ప్లస్‌ను పోలి ఉన్నట్టు గుర్తించారు. ఇంగ్లాండ్‌లో దీనిని మొదట జులైలో గుర్తించారు. అక్టోబర్ 20 వరకు జీనోమ్ సీక్వెన్సింగ్‌కు పంపినవాటిలో 15,120 కేసులకు ఈ వేరియంట్ కారణమని గుర్తించారు. ఇంగ్లాండ్‌లోని మొత్తం 9 ప్రాంతాల్లో గతవారం నమోదైన డెల్టా కేసుల్లో ఆరు శాతం ఈ వేరియంట్‌వల్లేనని గుర్తించారు.

మహమ్మారి వైరస్‌ల్లో మ్యుటేషన్లు, కొత్త వేరియంట్లు అంచనాకు అతీతమేమీ కాదని, అలాంటివి జరుగుతూనే ఉంటాయని ఉఖ్సా చీఫ్ ఎగ్జిక్యూటివ్ డా॥జెన్నీ హారిస్ తెలిపారు. ఈ వేరియంట్ ద్వారా మహమ్మారి ఇంకా తొలగిపోలేదని అర్థమవుతోందని ఆమె అన్నారు. గుంపుల్లో తిరిగేటపుడు మాస్క్‌లు ధరించాలని, అంతర్గత సమావేశాల సమయంలో కిటికీలు, తలుపులు తెరిచి ఉంచాలని ఆమె సూచించారు. లక్షణాలు ఉన్నపుడు వెంటనే పిసిఆర్ పరీక్ష చేయించుకొని నెగెటివ్ వచ్చే వరకు ఇంట్లోనే ఉండాలన్నారు. యుకెలో శుక్రవారం ఒక్కరోజే 49,298 కేసులు, 180 మరణాలు నమోదయ్యాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News