Saturday, November 23, 2024

దేశంలో డెల్టా ప్లస్ కేసులు 22

- Advertisement -
- Advertisement -

Delta Plus cases in India 22

మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, కేరళల్లో..
ఆసక్తికర వేరియంట్‌గా వర్ణించిన కేంద్రం
అమెరికా, బ్రిటన్‌సహా 9 దేశాలకు పాకిన వైరస్
బ్రిటన్‌లో థర్డ్ వేవ్‌కు కారకంగా గుర్తింపు

న్యూఢిల్లీ: దేశంలో థర్డ్ వేవ్ అంచనాలకు ప్రధాన కారకంగా భావిస్తున్న డెల్టా ప్లస్‌కు సంబంధించిన 22 కేసుల్ని గుర్తించారు. వీటిలో అధికంగా మహారాష్ట్రలో 16 నమోదయ్యాయి. మిగతావి మధ్యప్రదేశ్, కేరళలో నమోదయ్యాయి. దీనిని ఆసక్తికర వేరియంట్‌గా కేంద్రం గుర్తించిందని, ఇప్పటి వరకూ దీనిని ఆందోళనకరమైందిగా వర్గీకరించలేదని కేంద్ర ఆరోగ్యశాఖ కార్యదర్శి రాజేశ్‌భూషణ్ తెలిపారు. దీనిపై మంగళవారం మీడియాకు పలు వివరాల్ని ఆయన వెల్లడించారు. ఈ వేరియంట్‌ను అమెరికా, బ్రిటన్, పోర్చుగల్, స్విట్జర్లాండ్, జపాన్, పోలెండ్, నేపాల్, చైనా, రష్యాలో గుర్తించారు. ఇప్పటికే డెల్టా ప్లస్‌ను థర్డ్‌వేవ్‌కు కారకంగా బ్రిటన్ గుర్తించింది. వ్యాక్సినేషన్ ద్వారా అడ్డుకట్ట వేయొచ్చునని తమ పౌరులకు సూచించింది.

దీనికి మాతృకయైన డెల్టా వేరియంట్ 80 దేశాలకు వ్యాప్తి చెందిందన్నది గమనార్హం. దేశంలో రెండో ఉధృతికి ప్రధాన కారకంగా డెల్టా వేరియంట్ (బి.1.6.17.2)ను గుర్తించారు. ఇది ఉత్పరివర్తనం(మ్యుటేషన్) ద్వారా డెల్టా ప్లస్ లేదా ‘ఎవై 1’గా రూపాంతరం చెందింది. డెల్టా ప్లస్ కేసుల్ని మహారాష్ట్రలోని రత్నగిరి, జలగాంతోపాటు కేరళ, మధ్రప్రదేశ్‌ల్లో గుర్తించారు. వేరియంట్ వ్యాప్తి రేట్‌ను బట్టి దానిని ఆందోళన కలిగించేది లేదా ఆసక్తికరమైనదిగా వర్గీకరిస్తారని భూషణ్ తెలిపారు. ఈ వేరియంట్‌ను గుర్తించిన ప్రాంతాల నుంచి ఇతర ప్రాంతాలకు విస్తరించకుండా ఆయా రాష్ట్రాలకు ఇప్పటికే సూచనలు చేశామని ఆయన తెలిపారు. కేంద్రం ఏర్పాటు చేసిన జీనోమిక్స్ కన్సార్టియా(ఇన్సాకాగ్)కు దేశంలో ఉన్న 28 ల్యాబ్‌ల్లో 45,000 శాంపిళ్లకు సీక్వెన్సింగ్ చేయగా 22 కేసుల్లో డెల్టా ప్లస్ వేరియంట్‌ను గుర్తించామని ఆయన పేర్కొన్నారు.

రెండోవేవ్‌లో కీలకంగా గుర్తించిన డెల్టా వేరియంట్‌కు అడ్డుకట్ట వేయడంలో కొవిషీల్డ్, కొవాగ్జిన్ సమర్థతను చూపాయని, డెల్టా ప్లస్ విషయంలో ఎంత వరకు ఈ వ్యాక్సిన్లు పని చేస్తాయన్నది తేల్చాల్సి ఉన్నదని ఆయన గుర్తు చేశారు. ఆ సమాచారాన్ని త్వరలోనే వెల్లడిస్తామన్నారు. ఈ ఏడాది మే 7న అత్యధిక కేసులు నమోదైన దానితో పోలిస్తే 90 శాతంమేర తగ్గాయని భూషణ్ తెలిపారు. మహమ్మారికి అడ్డుకట్ట వేయడంలో స్థిరమైన మెరుగుదల సాధించామని నీతి ఆయోగ్ సభ్యుడు వికె పాల్ అన్నారు. మే 20న రోజువారీ కేసులు 100కు పైగా 531 జిల్లాల్లో నమోదు కాగా, ఇప్పుడా జిల్లాల సంఖ్య 135కి తగ్గిందని పాల్ తెలిపారు. కేసులు తగ్గిన నేపథ్యంలో ఆయా రాష్ట్రాలు నిబంధనలు సడలిస్తున్నాయని, అయితే ఈ సమయంలో స్థానికంగా ఎవరికి వారే బాధ్యతగా వ్యవహరిస్తూ మహమ్మారి మరోసారి ప్రబలకుండా చూడాలని ఆయన సూచించారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News