లండన్: టీకాలు వేయించుకున్న వ్యక్తుల నుంచి కూడా కరోనా డెల్టా వేరియంట్ వారి కుటుంబసభ్యులకు వ్యాప్తి చెందుతున్నదని తాజా అధ్యయనంలో వెల్లడైంది. లండన్‌లోని ఇంపీరియల్ కాలేజీ పరిశోధకుల అధ్యయన ఫలితాలను ప్రముఖ వైద్య పత్రిక లాన్సెట్ ప్రచురించింది. అయితే, డెల్టా వేరియంట్ సోకినప్పటికీ వ్యాక్సిన్ వేయించుకున్నవారు త్వరగా కోలుకుంటున్నారని తెలిపింది. 2020 సెప్టెంబర్ నుంచి 2021 సెప్టెంబర్ వరకు నిర్వహించిన ఈ అధ్యయనంలో 621మంది భాగస్వాములయ్యారు. వీరిలో 205 మంది నుంచి డెల్టా వేరియంట్ వారి కుటుంబసభ్యులకు సోకినట్టు గుర్తించారు. 133 మందికి రోజువారీగా పరీక్షలు నిర్వహించగా, వ్యాక్సిన్ తీసుకోని 49మందికి పూర్వఆల్ఫా వేరియంట్, వ్యాక్సిన్ తీసుకోని 39 మందికి ఆల్ఫా, పూర్తి వ్యాక్సిన్ తీసుకున్న 29 మందికి డెల్టా, వ్యాక్సిన్ తీసుకోని 16మందికి డెల్టా సోకినట్టు గుర్తించారు. వ్యాక్సిన్ తీసుకోని వారితో పోలిస్తే తీసుకున్నవారిలో డెల్టా వేరియంట్ వైరస్ లోడ్ త్వరగా తగ్గినట్టు గుర్తించారు.