న్యూఢిల్లీ : పిల్లల్లో కూడా డెల్టా వేరియంట్ ప్రధానంగా కనిపిస్తోంది. రెండో వేవ్ వేళ కర్ణాటకలో నిర్వహించిన జీనోమ్ సీక్వెన్సింగ్ ఆధారంగా నిపుణులు ఈ విషయాన్ని వెల్లడించారు. కరోనా సోకిన పిల్లల్లో విలక్షణమైన వేరియంట్ ఏదీ లేదు. డెల్టానే ప్రధానంగా కనిపిస్తోందని ప్రొఫెసర్ రవి మీడియాకు వెల్లడించారు. కర్ణాటకలో చిన్నారుల నుంచి సేకరించిన నమూనాల్లోని వైరస్ జీనోమ్ సీక్వెన్స్‌పై ఆయన అధ్యయనం చేస్తున్నారు. రెండో వేవ్‌లో పిల్లలకు సోకిన వైరస్ జన్యుక్రమాన్ని అధ్యయనం చేయడం మూడోవేవ్‌కు సిద్ధమయ్యే ప్రయత్నాల్లో భాగమని నిపుణులు అంటున్నారు. వైరస్ కొత్త వేరియంట్లు పిల్లల్ని ప్రభావితం చేస్తున్నాయేమో అర్ధం చేసుకోడానికి ఈ విశ్లేషణ సహకరిస్తుందని చెప్పారు.
ఈ క్రమంలో అందిన సమాచారం ప్రకారం కర్ణాటకలో 77శాతం ఇన్ఫెక్షన్లకు డెల్టా వేరియంటే కారణమని తేలింది. మొత్తం 1413 కేసులకు గాను, 1089 కేసుల్లో డెల్టా వేరియంట్‌ను గుర్తించినట్టు వెల్లడైంది. అలాగే 159 కప్పా, 155 అల్ఫా, 7 బీటా, 3 డెల్టా ప్లస్ వేరియంట్ కేసులు బయటపడ్డాయి. ఆ రాష్ట్రంలో ఇప్పటివరకు 29.08 లక్షల మందికి కరోనా సోకగా, దాదాపు 10 శాతం (019 సంవత్సరాల వయస్సు) నుంచి 20 ఏళ్ల లోపు వారున్నారు. అలాగే వారిలో మరణాల రేటు 0.1 శాతంగా ఉంది.