జీనోమిక్స్ కన్సార్టియం
న్యూఢిల్లీ: దేశంలో గత రెండు నెలల్లో కొవిడ్19 ఉధృతికి డెల్టా వేరియంటే ప్రధాన కారణమని భారత్‌లో సార్స్‌కొవ్2పై ఏర్పాటైన జీనోమిక్స్ కన్సార్టియం(ఇన్సాకాగ్) తెలిపింది. ఏప్రిల్, మే నెలల్లో కేసులు అత్యధికంగా నమోదు కావడానికి ఈ వేరియంటే కారణమని పేర్కొన్నది. వ్యాప్తి రేట్ అధికం కావడంతో ఆస్పత్రుల పాలవుతున్నవారి సంఖ్య పెరిగిందని, దాంతో వసతులు కల్పించడంలో ఇబ్బందులు ఎదురయ్యాయని ఇన్సాకాగ్ గుర్తు చేసింది. కొవిడ్19 వేరియంట్ల సీక్వెన్సింగ్‌ను ఎప్పటికపుడు నిర్ధారించేందుకు దేశంలోని 10 జాతీయ లేబోరేటరీలతో ఇన్సాకాగ్‌ను కేంద్ర ఆరోగ్యశాఖ గతేడాది డిసెంబర్‌లో ఏర్పాటు చేసింది. బ్రిటన్‌లో వెలుగు చూసిన ఆల్ఫా వేరియంట్‌కన్నా డెల్టా వేరియంట్ వేగంగా వ్యాప్తి చెందిందని ఇన్సాకాగ్ పేర్కొన్నది.
బి.1.617 రకంగా రూపాంతరం చెందిన కొవిడ్19 వైరస్‌లో బి.1.617.1, బి.1.617.2, బి.1.617.3 అనే మూడు రకాల మ్యుటేషన్స్ ఆవిర్భవించాయి. వీటిలో బి.1.617.2కు డెల్టా వైరస్‌గా ప్రపంచ ఆరోగ్యసంస్థ(డబ్లూహెచ్‌ఒ) నామకరణం చేసింది. మిగతా రెండింటితో పోలిస్తే డెల్టాకు వ్యాప్తి సామర్థం అధికమని ఇన్సాకాగ్ తెలిపింది. బి.1.617 వైరస్‌ను మొదట మహారాష్ట్రలో గుర్తించారు. అది అక్కడి నుంచి బెంగాల్, ఢిల్లీ,గుజరాత్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణలకు వ్యాప్తి చెందింది. మొదట బి.1.617లో స్పైక్ ప్రోటీన్ రెండు రకాల మ్యుటేషన్స్‌ను గుర్తించారు. డబుల్ మ్యుటెంట్‌గా పిలిచారు. ఆ తర్వాత మూడో మ్యుటేషన్‌ను గుర్తించారు. ఈ మూడు మ్యుటేషన్స్ వ్యాధిబారిన పడినవారిలో యాంటీబాడీల సంఖ్య పెరగకుండా అడ్డుకుంటున్నాయని, వ్యాక్సిన్ల విషయంలోనూ సామర్థాన్ని తగ్గిస్తున్నాయని గుర్తించారు.