న్యూఢిల్లీ : కరోనా మహమ్మారి బారిన పడిన గర్భిణులు నిర్జీవ శిశువులను ప్రసవించే ప్రమాదం రెండు రెట్టు ఎక్కువగా ఉండగా, డెల్టా వేరియంట్ వల్ల ఆ ముప్పు నాలుగు రెట్లు పెరిగినట్టు తాజాగా యూఎస్ అధ్యయనం వెల్లడించింది. సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ (సిడిసి) మార్చి 2020 నుంచి సెప్టెంబర్ 2021 మధ్యలో జరిగిన 1.2 మిలియన్ల ప్రసవాల వివరాలను సేకరించి విశ్లేషించింది. వాటిలో 8154 ప్రసవాల్లో శిశు మరణాలు సంభవించాయి. వాటిలో కూడా డెల్టా వేరియంట్ రాకముందు కొవిడ్ పాజిటివ్ వచ్చిన తల్లులకు పుట్టిన శిశువుల్లో మరణాలు తక్కువగా నమోదయ్యాయి. డెల్టా వేరియంట్‌తో బాధపడుతున్న గర్భిణుల్లో మాత్రం శిశుమరణాలు అధికంగా నమోదయ్యాయి.
డెల్టా వేరియంట్ వల్ల ఆ మరణాల రేటు నాలుగు రెట్లు పెరిగినట్టు ఆ అధ్యయనం వెల్లడించింది. డెల్టా వేరియంట్ సోకిన తల్లులు నిర్జీ శిశువులను ప్రసవించడానికి కరోనా వల్ల శిశువు శరీరంలో ఇన్లమేషన్ వచ్చి ఉండడమో లేక ప్లాసెంటాకు రక్తప్రసరణ సరిగ్గా జరగక పోవడమో కారణం అయి ఉండొచ్చని అధ్యయన కర్తలు వెల్లడించారు. అలాగే గర్భస్థ శిశువుల్లో అధిక రక్తపోటు, గుండె సమస్యలు, సెప్సిస్, రక్తప్రవాహం సరిగ్గా జరగక పోవడం, ఊపిరితిత్తుల సమస్యలు వంటివి బయటపడ్డాయి. ఆ బిడ్డలను పుట్టిన వెంటనే చాలా రోజుల పాటు వెంటిలేటర్‌పై ఉంచాల్సి రావడం, ఐసీయూలో చేర్పించి చికిత్స చేయించాల్సి రావడం వంటి పరిస్థితులు ఏర్పడ్డాయి. ఏదేమైనప్పటికీ దీనిపై మరింత అధ్యయనం జరగాలని వారు వెల్లడించారు.