అల్ఫా వేరియంట్ కన్నా 60% ఎక్కువ వేగంగా వ్యాపిస్తుంది
వ్యాక్సిన్ సామర్థాన్ని కూడా తగ్గిస్తుంది
పబ్లిక్ హెల్త్ ఇంగ్లండ్ సంస్థ తాజా నివేదిక వెల్లడి
లండన్: భారత్‌లో వెలుగు చూసిన బి1.617.2 లేదా డెల్టా వేరియంట్ బ్రిటన్‌లో వెలుగు చూసిన అల్ఫావేరియంట్‌కన్నా 60 శాతం ఎక్కువ మందికి వ్యాపించడంతో పాటుగా వ్యాక్సిన్ల సామర్థాన్ని సైతం కొంత మేరకు తగ్గిస్తుందని బ్రిటన్ వైద్య నిపుణులు శుక్రవారం తెలియజేశారు. బ్రిటన్‌కు చెందిన పబ్లిక్ హెల్త్ ఇంగ్లండ్ (పిహెచ్‌ఇ)సంస్థ ప్రతివారం డెల్టా వేరియంట్ తీరుతెన్నులను గమనిస్తూ వస్తోంది. డెల్టా వేరియంట్ కేసులు బ్రిటన్‌లో ఇంతకు ముందుకున్నా దాదాపు 29,892 పెరిగి 42,323కు చేరుకున్నాయని, అంటే దాదాపు 70 శాతం పెరిగాయని ఆ సంస్థ తన తాజా నివేదికలో తెలియజేసింది. ఇప్పుడు బ్రిటన్‌లో ఉన్న కేసుల్లో 90 శాతానికి పైగా కేసులు డెల్టా వేరియంట్‌కు సంబంధించినవేనని, ఇంగ్లాండ్‌లోని కెంట్ ప్రాంతంలో తొలుత గుర్తించిన అల్ఫా వేరియంట్‌కన్నా గణనీయమైన వృద్ధి రేటును కలిగి ఉందని ఆ నివేదిక పేర్కొంది. అల్ఫా వేరియంట్‌తో పోలిస్తే డెల్టా వేరియంట్ దాదాపు 60 ఎక్కువగా కుటుంబ సభ్యులకు సోకే ప్రమాదం కలిగి ఉందని, ప్రాంతాలను బట్టి 4.5 రోజులనుంచి 11.5 రోజులదాకా డబ్లింగ్ రేటు ఉన్నట్లు పిహెచ్‌ఇ తన తాజా నివేదికలో పేర్కొంది.
అంతేకాకుండా అల్ఫా వేరియంట్‌తో పోలిస్తే డెల్టా వేరియంట్ విషయంలో వ్యాక్సిన్ సమర్థత కూడా తక్కువగా ఉన్నట్లు, ఒక డోసు తర్వాత వ్యాక్సిన్ సమర్థత 15 శాతంనుంచి 20 శాతం తక్కువగా ఉన్నట్లు ఇంగ్లండ్, స్కాట్లాండ్ ప్రాంతాల్లో జరిపిన విశ్లేషణను బట్టి తెలుస్తోందని కూడా ఆ నివేదిక తెలిపింది. అయితే రెండు డోసుల తర్వాత డెల్టా వేరియంట్ విషయంలో వ్యాక్సిన్ సమర్థత ఎక్కువగానే ఉన్నప్పటికీ అల్ఫా వేరియంట్‌తో పోలిస్తే కాస్త తక్కువగానే ఉన్నట్లు తేలిందని ఆ నివేదిక తెలిపింది. ఆక్స్‌ఫర్డ్‌ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్ రెండు డోసుల తర్వాత వ్యాక్సిన్ సమర్థత ఎంత మేరకు తక్కువగా ఉంటుందనే విషయంలో మాత్రం ఇంకా స్పష్టత లేదని కూడా కూడా నివేదిక తెలిపింది.
బ్రిటన్‌లో ఇప్పుడు వెలుగు చూస్తున్న కొత్త కేసుల్లో అత్యధిక భాగం డెల్టా వేరియంట్‌కు సంబంధించినవే అయినప్పటికీ అదే స్థాయిలో ఆస్పత్రుల్లో చేరికలు లేక పోవడం ఆశాజనక విషయమని పిహెచ్‌ఇ తన తాజా నివేదికలో పేర్కొంది. రాబోయే వారాల్లో కూడా డెల్టా వేరియంట్ తీరుతెన్నులను జాగ్రత్తగా గమనిస్తామని పిహెచ్‌ఇ అంటూ అయితే అత్యధిక జనాభాకు రెండు డోసుల వ్యాక్సిన్ ఇవ్వడం ద్వారా ఈ వేరియంట్ ప్రభావాన్ని తగ్గించవచ్చని అభిప్రాయపడింది. ఈ నెల 21 నాటికల్లా లాక్‌డౌన్ ఆంక్షలను పూర్తిగా ఎత్తివేయడానికి సంబంధించిన రోడ్‌మ్యాప్‌ను బ్రిటీష్ ప్రభుత్వం సోమవారం నాడు ప్రకటించాలనుకొంటున్న తరుణంలో ఈ నివేదిక వెలువడ్డం గమనార్హం.