ఐసిఎంఆర్ అధ్యయనం వెల్లడి
న్యూఢిల్లీ: వ్యాక్సిన్ చేయించుకున్నా కొందరు కరోనా బారిన పడడానికి డెల్టా రకం వైరసే కారణమని భారత వైద్య పరిశోధన మండలి (ఐసిఎంఆర్) అధ్యయనం వెల్లడించింది. అయితే ఈ బాధితుల్లో 9.8 శాతం మంది మాత్రమే ఆస్పత్రిలో చేరాల్సి వచ్చిందని, 0.4 శాతం కేసుల్లోనే మరణం సంభవించిందని వెల్లడైంది. దీన్ని బట్టి ఆస్పత్రుల్లో చేరాల్సిన అవసరాన్ని, మరణాలను టీకాలు తప్పిస్తున్నాయని స్పష్టం చేసింది. టీకా డ్రైవ్‌ను మరింత విస్తరింప చేస్తే కొవిడ్ తీవ్ర ప్రభావాన్ని తగ్గించుకోడానికి వీలవుతుందని పేర్కొంది. వాక్సిన్ తరువాత ఇన్‌ఫెక్షన్లపై దేశ వ్యాప్తంగా విస్తృత స్థాయిలో నిర్వహించిన మొదటి అధ్యయనం ఇదే.
ఈ అధ్యయనంలో టీకాలు పొందినప్పటికీ కొవిడ్ పాజిటివ్‌గా తేలిన 677 మందికి చెందిన స్వాబ్ నమూనాలను 17 రాష్ట్రాల నుంచి సేకరించి విశ్లేషించారు. మొత్తం 677 మందిలో 86.09 శాతం మంది డెల్టా వేరియంట్ బారిన పడ్డారు. ఈ రకం వైరస్ మార్చిజూన్ నెలల్లో సామాజిక వ్యాప్తి స్థాయిలో సంక్రమించింది. అల్ఫా, కస్పా వేరియంట్లు ఆ తరువాతి స్థానంలో ఉన్నాయి. 67 మందికి (9.8శాతం) ఆస్పత్రిలో చేరాల్సిన పరిస్థితి ఎదురైంది. ముగ్గురు (9.4 శాతం ) చనిపోయారు. 677 మందిలో 85 మందికి మొదటి డోసు తీసుకున్నాక , 592 మందికి రెండు డోసులు తీసుకున్నాక కొవిడ్ వచ్చింది. ఈ కేసుల్లో 71 శాతం మందిలో కొవిడ్ లక్షణాలు కనిపించగా, 29 శాతం మందిలో ఎలాంటి లక్షణాలు లేవు
పోలీస్ సిబ్బందికి రెండు డోసులతో రక్షణ
కొవిడ్ ముప్పు ఎక్కువగా పొంచి ఉండే పోలీస్ సిబ్బందికి టీకాలు ఇవ్వడం వల్ల సత్ఫలితాలు వచ్చాయని ఐసిఎంఆర్ మరో అధ్యయనం వెల్లడించింది. డెల్టా వేరియంట్‌తో తలెత్తిన రెండో ఉధృతిలో 95 మరణాలను తగ్గించడానికి ఇది వీలు కల్పించిందని వెల్లడైంది. తమిళనాడులో 1,17,524 మంది పోలీస్ సిబ్బందిపై ఈ అద్యయనం నిర్వహించారు. వీరిలో 17,059 మంది టీకా పొందలేదు. 32,792 మంది ఒక డోసు, 67,673 మంది రెండు డోసులు పొందారు. టీకా పొందిన వారిలో కొవిడ్‌తో చనిపోయిన వారు 20 మంది ఉన్నారు. మొదటి డోసు పొందాక ప్రాణాలు కోల్పోయిన వారు ఏడుగురు, రెండో డోసు పొందాక చనిపోయిన వారు నలుగురు ఉన్నారు.
టీకా సమర్థతను పరిశీలించగా మొదటి డోసు పొందిన వారిలో 82 శాతం, రెండో డోసు పొందిన వారిలో 95 శాతం సమర్ధత కనిపించింది. టీకా పొందని వారిలో కొవిడ్ మరణాలు ప్రతి వెయ్యి మందిలో 1.17 గా ఉండగా, పాక్షికంగా టీకా పొందిన వారిలో అది 0.21 గా ఉంది. పూర్తి స్థాయిలో టీకా పొందిన వారిలో అది 0.06గా ఉంది. దీన్ని బట్టి మన టీకాలు సురక్షితమని, తీవ్ర ఇన్‌ఫెక్షన్‌ను నివారించడంలో సమర్థత నిరూపిస్తోందని నీతి ఆయోగ్ సభ్యుడు వి. కె పాల్ తెలిపారు. ఈ అధ్యయనంలో డెల్టా ఉపరకాలైన ఏవై 1, ఏవై 3 లను గుర్తించారు. ఈ రకం వైరస్‌ల స్పైక్ ప్రొటీన్‌లో కే 417 ఎఎన్, ఈ 484, ఎల్ 452 ఆర్, ఈ 484 క్యూ అనే ఉత్పరివర్తనలను గుర్తించారు. ప్రస్తుత టీకాల వల్ల తలెత్తిన మానవ రోగ నిరోధక స్పందన నుంచి వైరస్ తప్పించుకోడానికి ఇవి సాయపడవచ్చని , దాని ద్వారా ఈ రకాల సంక్రమణం వేగంగా ఉండవచ్చని పేర్కొన్నారు.