రోజురోజుకు విస్తరిస్తున్న ‘డెల్టాప్లస్’ వైరస్
మహారాష్ట్రలో అత్యధికంగా 20 కేసులు
న్యూఢిల్లీ: దేశంలో కరోనా రెండో దశ ఉధృతి తగ్గుముఖం పడుతున్న వేళ ‘డెల్టాప్లస్’ వేరియంట్ చాపకింద నీరులా వ్యాప్తి చెందుతోంది. ఇప్పటివరకు ఈ కొత్త రకం వైరస్ 11 రాష్ట్రాలకు విస్తరించినట్లు జాతీయ అంటువ్యాధుల నియంత్రణ కేంద్రం( ఎన్‌సిడిసి) డైరెక్టర్ సుజిత్ కుమార్ వెల్లడించారు. ప్రపంచవ్యాప్తంగా 12 దేశాల్లో ఇది వెలుగు చూడగా.. మన దేశంలోని 18 జిల్లాల్లో ఈ రకం కేసులు ప్రస్తుతం 48 ఉన్నాయని ఐసిఎంఆర్ చీఫ్ బలరాం భార్గవ తెలిపారు. అల్ఫా వేరియంట్( బ్రిటన్ రకం)కన్నా ఈ డెల్ట్టాప్లస్ రకం ఎక్కువ బలమైందని పేర్కొన్నారు. మహారాష్ట్రలో అత్యధికంగా 20 డెల్టాప్లస్ కేసులుండగా మధ్యప్రదేశ్‌లో ఏడు, కేరళలో మూడు, పంజాబ్, గుజరాత్‌లలో రెండేసి, ఆంధ్రప్రదేశ్, ఒడిశా, రాజస్థాన్, జమ్మూ, కర్నాటకలలో ఒక్కొక్కటి చొప్పున డెల్టాప్లస్ కేసులు నమోదయినట్లు అధికారులు తెలిపారు.
దేశంలో కరోనా పరిస్థితిపై శుక్రవారం నిర్వహించిన మీడియా సమావేశంలో వీరు మాట్లాడారు. భారత్‌లో సెకండ్ వేవ్ ఇంకా సమసిపోలేదని హెచ్చరించారు. ఇంకా 75 జిల్లాల్లో 10 శాతంకన్నా ఎక్కువ వైరస్ ప్రభావం ఉండగా, 92 జిల్లాల్లో అయిదునుంచి 10 శాతం వరకు ఉన్నట్లు తెలిపారు. కొవిషీల్డ్, కొవాగ్జిన్ టీకాలు మన దేశంలోని డెల్టా వేరియంట్‌తో పాటుగా అల్ఫా, బీటా, గామా రకం వైరస్‌లపైన కూడా పని చేస్తున్నట్లు బలరాం భార్గవ చెప్పారు. దేశంలోని కొవిడ్ కేసుల్లో 90 శాతం కేసులు బి.1.617.2గా పిలవబడే డెల్టా వేరియంట్ కారణంగానే వచ్చినట్లు కేంద్రప్రభుత్వం చెబుతున్న విషయం తెలిసిందే. కాగా గర్భిణులు కూడా వ్యాక్సిన్లు వేసుకోవచ్చని భార్గవ తెలిపారు.
ఇప్పటివరకు మన దేశంలో 45 వేల వరకు శాంపిళ్లను సీక్వెన్సింగ్ చేయగా, 48 డెల్టాప్లస్ వేరింట్ కేసులు బయటపడినట్లు తెలిపారు. కాగా మధ్యప్రదేశ్‌లో ఇద్దరు డెల్టాప్లస్ లక్షణాలతో మృతి చెందగా తాజాగా మహారాష్ట్రలో కూడా ఒకరు మరణించినట్లు ఆ రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి వెల్లడించడం తెలిసిందే. కాగా మధ్యప్రదేశ్‌లో మరణించిన ఇద్దరు కూడా వ్యాక్సిన్ తీసుకోలేదని, వైరస్ సోకిన వారిలో ముగ్గ్గురు మాత్రం ఒక డోసు టీకా తీసుకున్నారని, వారంతా కూడా హోం ఐసొలేషన్‌లోనే కోలుకున్నారని అధికారులు తెలిపారు. ఇక ఎలాంటి టీకాలు తీసుకోని ఇద్దరు కూడా వైరస్‌ను జయించారని, వారిలో ఒకరు 22 ఏళ్ల మహిళ కాగా, మరొకరు రెండేళ్ల పసిసాప అని వైద్యులు చెప్పారు. మరో వైపు ‘డెల్టాప్లస్’ ఆందోళనకర రకం ( వేరియంట్ ఆఫ్ కన్సర్న్)గా పేర్కొంటున్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ మంగళవారమే వెల్లడించింది. దీనిలో సంక్రమణ పెరగడం, ఊపిరితిత్తుల కణాల్లోని గ్రాహకాలతో గట్టిగా బంధాన్ని ఏర్పర్చుకోవడం, మోనో క్లోనల్ యాంటీబాడీ చికిత్సకు పెద్దగా లొంగకపోవడం వంటి లక్షణాలున్నట్లు ఇండియన్ సార్స్‌కోవ్ 2 కన్సార్టియం ఆన్ జీనోమిక్స్ తెలిపింది.