Monday, December 23, 2024

మరాఠా కోటా మంటలు!

- Advertisement -
- Advertisement -

మహారాష్ట్రలో మరాఠా రిజర్వేషన్ల డిమాండ్‌పై మంటలు చెలరేగుతూనే వున్నాయి. పది రోజలు క్రితం మొదలైన ఈ ఆందోళన సద్దుమణగకపోడంతో ఛత్రపతి శంభాజీ నగర్ జిల్లా గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో అన్ని రకాల ఇంటర్‌నెట్ సౌకర్యాలను బుధవారం సాయంత్రం నుంచి బంద్ చేశారు. సకల్ మరాఠా సమాజ్‌కు చెందిన మనోజ్ జారంగే పాటిల్, ఆయన బృందం ఈ ఆందోళనలో అత్యంత చురుకుగా పాల్గొంటున్నారు. పాటిల్ చేపట్టిన ఆమరణ నిరాహార దీక్ష పదో రోజుకి చేరుకొన్నది. మరాఠ్వాడా ప్రాంతంలోని బీద్‌లో సోమవారం నాడు పలువురు ప్రజాప్రతినిధుల ఇళ్ళకు ఆందోళనకారులు నిప్పంటించారు. అక్కడి ఎన్‌సిపి కార్యాలయాన్ని తగులబెట్టారు. ఎన్‌సిపి, బిజెపి, శివసేన పార్టీలకు చెందిన ఎంఎల్‌ఎల ఇళ్ళనూ, కార్యాలయాలనూ దగ్ధం చేశారు. ఈ మూడు పార్టీలకు చెందిన స్థానిక ప్రజాప్రతినిధులు రాజీనామాలకు సిద్ధమయ్యారు. వారిలో కొందరు రాజీనామాలను సమర్పించడం కూడా జరిగింది. మహారాష్ట్ర ప్రజలు మరాఠీలుగా పరిగణన పొందుతున్నప్పటికీ వారందరూ మరాఠాలు కాదు. కుంబీ వర్గ కులస్థులను వారిని మాత్రమే మరాఠాలుగా గుర్తిస్తున్నారు.

వీరు మహారాష్ట్ర జనాభాలో 33% వరకు వుంటారు. ప్రస్తుతం వ్యవసాయం వీరి ప్రధాన వృత్తి. దేశానికి స్వాతంత్య్రం రాక ముందు నుంచి ఒబిసిలుగా గుర్తింపు పొందే అర్హత తమకు వుందని వీరు వాదిస్తున్నారు. ఆందోళన చల్లారకపోడంతో ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే అఖిల పక్ష సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఇతర వర్గాల కోటాకు నష్టం వాటిల్లకుండా మరాఠాలకు రిజర్వేషన్లు ఇచ్చి తీరాల్సిందేనని అఖిల పక్షం అభిప్రాయపడినట్టు ఆయన ప్రకటించారు. అయితే మరాఠాల కోటా డిమాండ్ నెరవేరడం సులభ సాధ్యంగా కనిపించడం లేదు. ఈ డిమాండ్ ఇప్పటిది కాదు. ఇది 1982లోనే బిగ్గరగా వినిపించింది. అన్నా సాహెబ్ పాటిల్ అనే కార్మిక నాయకుడి నాయకత్వంలో అప్పుడు ఆందోళన జరిగింది. తమ డిమాండ్‌ను అంగీకరించకపోతే ఆత్మహత్య చేసుకొంటానని బెదిరించిన పాటిల్ అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం దిగిరాకపోడంతో చివరికి అంత పనీ చేశారు. కుంబీ కుల సర్టిఫికెట్ల కోసం ఈ వర్గం యువత డిమాండ్ చేస్తున్నది. 2014లో అప్పటి ముఖ్యమంత్రి నారాయన్ రాణే నాయకత్వంలోని కమిటీ మరాఠాలకు 16%, ముస్లింలకు 5% రిజర్వేషన్లను ఆమోదించాలని సిఫారసు చేసింది.

ఆ మేరకు మహారాష్ట్ర ప్రభుత్వం తీసుకొన్న నిర్ణయంపై బొంబాయి హైకోర్టు స్టే విధించింది. 2018లో ఆందోళన హింసాత్మక నిరసనలకు దారి తీసింది. దేవేంద్ర ఫడ్నవీస్ ముఖ్యమంత్రిగా వుండగా 2018 నవంబర్ 30న బిజెపి శివసేన ఉమ్మడి ప్రభుత్వం విద్య, ఉద్యోగాల్లో మరాఠాలకు 16% రిజర్వేషన్లు కల్పిస్తూ శాసన సభలో ఒక బిల్లును ఆమోదించింది. బొంబాయి హైకోర్టులో దీనిని సవాలు చేయగా న్యాయస్థానం ఆ రిజర్వేషన్లను ఆమోదించింది. అయితే 16% కోటాను ఉద్యోగాల్లో 13 శాతానికి, విద్యా రంగంలో 12 శాతానికి తగ్గించింది. సుప్రీంకోర్టులో అప్పీలు దాఖలు కావడంతో దీనిపై రాజ్యాంగ ధర్మాసనాన్ని నెలకొల్పారు. 2021 మేలో రాజ్యాంగ ధర్మాసనం ఈ కోటాను పూర్తిగా రద్దు చేసింది. మరాఠాలకు 1213 శాతం రిజర్వేషన్లు కల్పించడం వల్ల మహారాష్ట్రలో కోటా 6465 శాతానికి చేరుకొంటుందని 1992లో మండల్ కోటాపై ఇంద్రా సాహ్నీ కేసులో తీర్పు చెబుతూ మొత్తం రిజర్వేషన్లు 50 శాతం దాటకూడదని తీసుకొన్న నిర్ణయానికి ఇది విరుద్ధం అవుతుందని రాజ్యాంగ ధర్మాసనం స్పష్టం చేసింది.

అక్కడితో ఆగిపోయిన మరాఠాల రిజర్వేషన్ వ్యవహారాన్ని తిరిగి దారిలో పెట్టాలంటే 50% పరిమితిని సడలించవలసి వస్తుంది. ప్రధాని మోడీ ప్రభుత్వం రాజ్యాంగ సవరణ ద్వారా అమల్లోకి తెచ్చిన 10% ఆర్థిక వెనుకబాటు కోటా ప్రత్యేకించి ఏర్పాటు చేసినది కావడం వల్ల దానికి ఈ 50% పరిమితి వర్తించలేదు. తమిళనాడులో మొత్తం రిజర్వేషన్లు 69 శాతం వున్నప్పటికీ రాజ్యాంగం 9వ షెడ్యూల్లో వాటిని చేర్చడం వల్ల అవి సురక్షితంగా వున్నాయి. ఈ షెడ్యూల్లో చేర్చిన అంశాలపై న్యాయస్థానాలు సమీక్షించడానికి వీల్లేదు. 9వ షెడ్యూల్లో వుంచిన చట్టాలు ప్రాథమిక హక్కులకు, రాజ్యాంగ మౌలిక వ్యవస్థకు విరుద్ధంగా వుంటే వాటిని బయటకు లాగి న్యాయ సమీక్షకు గురి చేస్తామని ఒక దశలో సుప్రీంకోర్టు ప్రకటించినప్పటికీ అది ఇంత వరకూ జరగలేదు. మరాఠా రిజర్వేషన్ల విషయంలో మహారాష్ట్రలోని బిజెపి శివసేన (షిండే) ప్రభుత్వం చివరికి ఏమి చేయనున్నదో వేచి చూడాలి. లోక్‌సభ ఎన్నికలు చేరువ అవుతున్నందున మోడీ ప్రభుత్వం కలుగజేసుకొని ఈ కోటాపై ఒక నిర్ణయం తీసుకొనే అవకాశం లేకపోలేదు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News