పంజాబ్ రైతు నాయకుల డిమాండ్
డిసెంబర్ 1న సంయుక్త కిసాన్ మోర్చా సమావేశం
న్యూఢిల్లీ: పార్లమెంటులో సేద్యపు చట్టాల ఉపసంహరణ ఆందోళనకారుల విజయంగా పంజాబ్ రైతు నాయకులు అభివర్ణించారు. పంటలకు కనీస మద్దతు ధర(ఎంఎస్‌పి) గ్యారంటీ చట్టాని తేవాలని కూడా వారు డిమాండ్ చేశారు. కాగా భవిష్యత్ కార్యాచరణ ప్రణాళికను నిర్ణయించడానికి డిసెంబర్ ఒకటిన సంయుక్త కిసాన్ మోర్చా అత్యవసర సమావేశాన్ని నిర్వహించబోతున్నది. సింఘు బార్డర్ వద్ద సోమవారం పంజాబ్‌కు చెందిన 32 రైతు సంఘాలు విలేకరుల సమావేశంలో పంటలకు కనీస మద్దతు ధర గ్యారంటీ, రైతులపై పెట్టిన కేసుల ఎత్తివేత, రైతు ఆందోళన సమయంలో ప్రాణాలు కోల్పోయిన రైతుల కుటుంబాలకు నష్టపరిహారం సహా తమ ఆరు డిమాండ్లను ప్రస్తావించారు. తమ డిమాండ్లపై జవాబివ్వడానికి కేంద్రానికి మంగళవారం వరకు(నవంబర్ 30 వరకు) సమయం ఉందని కూడా వారు తెలిపారు.
పార్లమెంటు శీతాకాల సమావేశంలో సేద్యపు చట్టాల ఉపసంహరణ బిల్లును లోక్‌సభ, రాజ్యసభ రెండూ ఆమోదించాయి. మూడు సేద్యపు చట్టాలకు వ్యతిరేకంగా రైతులు ఏడాది కాలంగా ఆందోళన చేస్తున్న నేపథ్యంలో వాటిని ఉపసంహరించుకోనున్నామని ప్రధాని నరేంద్ర మోడీ నవంబర్ 19న ప్రకటించారు. “ఇది మా అందరి విజయం. రైతులపై పెట్టిన కేసులను ఎత్తివేయాలని,అలాగే పంటలకు కనీస మద్దతు ధరను గ్యారంటీ చేసేందుకు కమిటీని ఏర్పాటు చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాము” అని రైతు నాయకులు తెలిపారు. “ మా డిమాండ్లపై సమాధానం ఇవ్వడానికి కేంద్రానికి మంగళవారం వరకు సమయం ఉంది. మా భవిష్యత్ కార్యాచరణ ప్రణాళిక గురించి చర్చించేందుకు మేము బుధవారం సంయుక్త కిసాన్ మోర్చా అత్యవసర సమావేశాన్ని నిర్వహించబోతున్నాం” అని రైతు నాయకులు తెలిపారు. ఇదిలావుండగా రైతుల ఆరు డిమాండ్లపై వెంటనే చర్చలు పునరుద్ధరించాలంటూ రైతు సంఘాలకు నేతృత్వం వహిస్తున్న సంయుక్త కిసాన్ మోర్చా ప్రధాని నరేంద్ర మోడీకి లేఖ రాసింది.