హైదరాబాద్: దేశానికి రెండవ రాజధానిగా తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌ను కేంద్ర ప్రభుత్వం ప్రకటించాలని మహారాష్ట్ర మాజీ గవర్నర్, బిజెపి సీనియర్ నాయకుడు సిహెచ్ విద్యాసాగర్ రావు ప్రతిపాదించారు. దీంతో హైదరాబాద్‌ను దేశానికి రండవ రాజధాని చేయాలన్న డిమాండ్ మరోసారి తెరపూకి వచ్చింది.
రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మనవడు ప్రకాష్ అంబేద్కర్ ఇటీవల చేసిన ప్రకటనను విద్యాసాగర్ రావు ప్రస్తావిస్తూ అన్ని రాజకీయ పార్టీలు ఈ విషయమై ఏకాభిప్రాయానికి రావలసిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. ఇటీవల మీడియాతో మాట్లాడిన విద్యాసాగర్ రావు ఈ ప్రదిపాదన కార్యరూపం దాలిస్తే బంగారు తెలంగాణ కల సాకారమవుతుందని అన్నారు.
దేశానికి రెండవ రాజధాని అవసరమని రాజ్యాంగంలోనే స్పష్టంగా పొందుపరిచారని ఆయన గుర్తు చేశారు. దేశానికి రెండవ రాజధానిగా హైదరాబాద్‌ను చేసే అవకాశాలు చాలా ఉన్నాయని ఆయన తెలిపారు. దేశ రాజధానికి ఉండవలసిన అన్ని అర్హతలు హైదరాబాద్‌కు ఉన్నాయని ఆయన అన్నారు.
హైదరాబాద్‌ను దేశానికి రెండవ రాజధానిగా చేయాలన్న డిమాండ్ రావడం ఇది మొదటిసారి కాదు. గతంలో పలువురు నాయకులు ఈ డిమాండ్‌ను లెవనెత్తారు. దేశానికి రెండవ రాజధానిగా హైదరాబాద్ ఏర్పడితే అనేక అవకాశాలు నగరానికి దక్కే అవకాశం ఉన్నప్పటికీ అయితే దీని పాలనాపరమైన, శాసనపరమైన విస్తృత ప్రక్రియ అవసరమవుతుంది.