Tuesday, November 5, 2024

రాష్ట్ర వరి విస్తీర్ణంతో కేంద్రానికి అజీర్ణం

- Advertisement -
- Advertisement -
Demand to buy grain in the state of Telangana
61.75లక్షల ఎకరాల్లో రాష్ట్రంలో వానాకాలం వరిసాగైందన్న వాస్తవాన్ని జీర్ణించుకోలేక కేంద్రం అవాకులు చెవాకులు, కాకి లెక్కలతో నిందారోపణలు
శాస్త్రీయంగా రూపొందే సాగు నివేదికలను తప్పు పడుతున్న కేంద్రం
రాష్ట్ర ప్రభుత్వ రైతు అనుకూల పథకాలు విధానాల వల్ల అంచనాలు మించిన సాగు విస్తీర్ణం

(లక్కా భాస్కర్ రెడ్డి )
తెలంగాణ రాష్ట్రంలోని ధాన్యాన్ని కొనుగోలు చేయాలనే డిమాండ్ తెరపైకి రాగానే వరి పంటసాగు విస్తీర్ణం కరెక్టు కాదని కేంద్రం చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం అయ్యాయి. వరి సాగు విస్తీర్ణంపై తెలంగాణ ప్రభుత్వం తప్పుడు లెక్కలు చెబుతోందని కేంద్రం భావించడం, ఆ మేరకు చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపైన వ్యవసాయశాఖాధికారులు, రైతు సంఘాల నాయకులు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. సాగు విస్తీర్ణాన్ని ఎక్కువగా చూపించాల్సిన అవసరం తెలంగాణ ప్రభుత్వానికి లేదని, వరి సాగు విస్తీర్ణాన్ని ఎక్కువగా చూపించడం వల్ల ప్రభుత్వానికి వచ్చే ప్రయోజనం కూడా ఏమీలేదని అంటున్నారు. రైతులను దొంగ లెక్కలు చెప్పినట్లుగా చిత్రీకరించే ప్రయత్నం చేయడం సబబుగా లేదని, ఇది కేంద్ర ప్రభుత్వానికి కూడా మంచికాదని, కేంద్రం హుందాతనంగా వ్యవహరించకపోతే ఎలా అని కేంద్ర సర్వీసులకు చెందిన సీనియర్ అధికారులు సైతం మండిపడుతున్నాయి. పంటల సాగు విస్తీర్ణం, పంట దిగుబడి అంచనాల్లో కేంద్రప్రభుత్వ చెస్తున్న ప్రకటనలు కాకిలెక్కలను తలపిస్తున్నాయి. వ్యవసాయ రంగంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పంటల సాగులో ఏ రోజుకు ఆరోజు వ్యవసాయ విస్తరణాధికారుల ద్వారా క్షేత్ర స్థాయి నుంచి నివేదికలు తెప్పించుకుంటూ ఒక శాస్త్రీయపద్దుతుల్లో రూపొందించిన పంటల సాగు నివేదికలను తప్పుపడుతున్న కేంద్ర ప్రభుత్వ వైఖరే అందుకు అద్దం పడుతోంది.

తెలంగాణ రాష్ట్రంలో రైతులు పండించిన వరిధాన్యం తీరా కొనుగోలు సమయం వచ్చే సరికి పంట సాగు విస్తీర్ణంలో రాష్ట్రప్రభుత్వానివి తప్పుడు లెక్కలంటూ సాకులు చెబుతున్న తీరుపట్ల తెలంగాణ రాష్ట్ర వ్యవసాయరంగం నుంచి నిరశనలు వ్యక్తమవుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాల వారీగా పంట సాగు ప్రణాళికలు, పంట రకాల సాగు విస్తీర్ణత, పంటల ఉత్పాదకత, పంట దిగుబళ్లు తదితర అంశాలను అర్ధణాంక శాఖల ద్వారా నివేదికలు తెప్పించకున్న తర్వాతే జాతీయ స్థాయిలో వ్యవసాయ ప్రణాళిలలను రూపొందించుకుంటుంది. దాన్ని బట్టే కేంద్ర ప్రభుత్వం వ్యవసాయ రంగంలో అములు చేస్తున్న పథకాలు, ఎరువులు సరఫరా ప్రణాళిక, ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి వంటి వాటికి ఎంతెంత నిధులు అవసరమో అంచానాలు వేసుకుని ఆ మేరకు వార్షిక బడ్జెట్‌ను రూపొందించుకుంటుంది. అయితే తెలంగాణ రాష్ట్రం నుంచి ధాన్యం కొనుగోలు చేయాల్సిన పరిస్థితులు వచ్చే సరికి కేంద్రం నాలిక మడతేస్తోంది.

తెలంగాణలో వర్షాకాలం సిజీన్ కింద 61.75లక్షల ఎకరాల్లో వరి సాగు కానేలేదని , వరిసాగు చేసిన రైతులు అందించిన తప్పుడు వివరాలతో ప్రభుత్వం నివేదికలు రూపొందించిందన్న తీరులో మాట్లాడుతూ ఏకంగా రైతులనే దొంగలుగా చిత్రీకరించే విధంగా ప్రకటనలు చేస్తోంది. రాష్ట్రంలో వర్షాకాలంపు సీజన్‌లో అహార పంటలు , నూనెగింజ పంటలు , పప్పుధాన్యపు పంటలు , పత్తి చెరకు తదితర వాణిజ్య పంటలు అన్ని కలిపి 1,16,63,267 ఎకరాల విస్తీర్ణంలో సాగులోకి వస్తాయని వ్యవసాయశాఖ సీజన్ ప్రారంభానికి ముందు అంచనా వేసుకొని ఆ మేరకు పంటల సాగు ప్రణాళికను సిద్దం చేసుకుంది. అయితే ఈ ఏడాది సకాలంలో వర్షాలు కురవటం, కృష్ణా, గోదావరి నదుల పరివాహకంగా ఉన్న ప్రాజెక్టులకు పుష్కలంగా నీరు చేరటం, భూగర్భ జల మట్టాలు పెరగటం ,వీటికితోడు రాష్ట్ర ప్రభుత్వం విత్తనాలు, ఎరువులు అందుబాటులో ఉంచటం, ముఖ్యమంత్రి కెసిఆర్ చేపట్టిన రైతుబంధు , రైతుబీమా తదితర వ్యవసాయ రంగ అనుకూల విధానాలు అమలుతో రాష్ట్రంలో పంటల సాగు సాధారణ అంచనాలకంటే 110.77శాతం పెరిగింది.

రాష్ట్రప్రభుత్వం అంతర్జాతీయ మార్కెట్‌లో వ్యవసాయోత్పత్తులకు ఉన్న డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకొని పత్తి , కంది తదితర పంటల సాగు విస్తీర్ణతను భారీగా పెంచాలని ప్రయత్నాలు చేసింది. ప్రభుత్వం ఒకటి తలిస్తే రైతులు మరోవిధంగా ముందుకు సాగారు. అత్యధికంగా వరిసాగు పట్ల మొగ్గారు. ప్రభుత్వం వరిసాగులో 34,01,089 ఎకరాల విస్తీర్ణత మేరకు ప్రాధమిక అంచనాలతో వ్యవసాయ ప్రణాళిక రూపొందించుకోగా, రైతులు భారీగా వరిసాగుచేస్తూ పోయారు. వరినాట్ల సీజన్ ముగిసే సరికి 61,75,534 ఎకరాల్లో వరినాట్లు పడ్డాయి. గత ఏడాది వర్షాకాలంలో 51.91లక్షల ఎకరాల్లో వరిపంట సాగు చేసిన రైతులు ఈ వానాకాలంలో ఏకంగా 10 లక్షల ఎకరాల్లో అధికంగా వరిసాగు చేశారు. సీజన్ ముగిసే సరికి వ్యవసాయ శాఖ రూపొందిచిన ప్రాధమిక అంచనాలకు మించి 181.58శాతం విస్తీర్ణంలో వరిసాగు జరిగింది.

పంట అంచనాలపై కేంద్రం వద్ద శాస్త్రీయ విధానం ఏమిటి!

రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ రంగంలో పంటసాగు ప్రణాళికలపై గత రెండేళ్లుగా ఒక శాస్త్రీయ విధానం అమలు చేస్తోంది. మార్కెట్‌లో ఉన్న డిమాండ్‌కు అనుకూలంగా పంటలు వేయించి రైతులకు లాభసాటి ధరలు అభించేలా చేయలన్న లక్ష్యాల్లో భాగంగా పలు నిబంధనలతో ఈ విధానం అమల్లోకి తెచ్చింది. గ్రామాల్లో రైతు పంట సాగు చేయాలంటే నేల స్వభావం, అందుబాటులో ఉన్న నీటి వనరులు, రైతు పొలం సర్వేనంబరు, పొలం విస్తీర్ణం , ఎంచుకున్న పంట , విత్తన రకం , రైతుల ఆధార్ కార్డు తదితర వివరాలను పంట నమోదు సర్వేకు తప్పని సరి చేసింది. ఇన్నేసి విరవాలతోపాటు రైతు సెల్‌ఫోన్ నెంబర్ కూడా నమోదు చేసి రైతుల నుంచి ఇన్నేసి వివరాలను రాబట్టి ఏరోజుకు ఆరోజు పంట నమోదు సర్వేను గ్రామ, మండల , జిల్లా , రాష్ట్ర స్ధాయిలో నివేదికలు రూపొందిస్తూ వచ్చింది. ఎక్కడా పంటనమోదు వివరాల్లో పొరపాట్లు దొర్లకుండా జాగ్రత్తలు తీసుకుంటూ వస్తోంది. ఎక్కడైన ఒకటి రెండు చోట్ల పంటనమోదులో నిర్లక్షత కనబరిస్తే సంబంధిత అధికారులను సైతం సస్సెండ్ చేసిన సందర్బాలు కూడా లేకపోలేదు.

ఇన్ని రకాల జాగ్రత్తలతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏటా వర్షాకాలం ,యాసంగి సీజన్లలో పంట నమోదు నివేదకలు రూపొందిస్తోంది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పంటల సర్వే నివేదికల విధానాన్ని ఆదర్శంగా తీసుకొని పోరుగున ఉన్న ఆంధ్రప్రదేశ్‌తోపాటు పలు రా్రష్ట్రాలు అమలు చేస్తున్నాయి. తెలగాణ పంటల నమోదు విధానం పట్ల జాతీయ స్థాయిలోనూ ప్రశంసలు వస్తున్నాయి. ఈ నేపధ్యంలో కేంద్ర ప్రభుత్వం ఏకంగా వరిసాగు విస్తీర్ణంలో రాష్ట్ర ప్రభుత్వం నివేదికలను తప్పు పడుతూ, సాగు వివరాలను అందించిన రైతులను దొంగలుగా చిత్రీకరిస్తున్న కేంద్ర వైఖరి రైతుల మనోభావాలను దెబ్బతీస్తోంది. కేంద్రప్రభుత్వం జాతీయ స్థాయిలో పంటల సాగు అంచనాలు ఏ విధంగా రూపోందిస్తోందో, అందుకు ఎ రకమైన విధానం అమలు చేస్తోందో బయటపెట్టాలని ఇటు రైతులు అటు వ్యవసాయరంగం నిపుణులు డిమాండ్లు వస్తున్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News