కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు బిసి మహాసభ డిమాండ్
మన తెలంగాణ / హైదరాబాద్ : బిసిల ప్రధాన డిమాండ్లను వెంటనే పరిష్కరించాలని బిసి మహాసభ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు డిమాండ్ చేసింది. జాతీయ బిసి సంక్షేమ సంఘం ఆదివారం హైదరాబాద్‌లోని మున్నూరు కాపు సంఘం సమావేశ మందిరంలో బిసిల మహాసభ నిర్వహించింది. ఆర్. కృష్ణయ్య నేతృత్వంలో జరిగిన ఈ మహాసభలో 63 బిసి కుల సంఘాలు, 36 బిసి అసోసియేషన్స్, 28 బిసి ఉద్యోగ సంఘాల నాయకులు, వివిధ యూనివర్సిటీల విద్యార్థి జెఎసిల ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మహాసభ బిసిల డిమాండ్లపై చర్చించి వాటిని పరిష్కరించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్లాకు డిమాండ్ చేస్తూ పలు తీర్మానాలు ఆమోదించింది.
ప్రధాన రాజకీయ పార్టీలు బిసి డిమాండ్లను తమ ఎన్నికల మెనిఫెస్టోల్లో పెట్టాలని డిమాండ్ చేసింది. ఈ సందర్భంగా ఆర్. కృష్ణయ్య మాట్లాడుతూ అన్ని రాజకీయ పార్టీలు అసెంబ్లి ఎన్నికలలో 50 శాతం టికెట్లు బిసిలకివ్వాలని, పార్లమెంటులో బిసి బిల్లు పెట్టి చట్ట సభలలో బిసి లకు 50 శాతం రిజవేషన్లు కల్పించాలని, కేంద్ర ప్రభుత్వo త్వరలో చేపట్టబోయే జనాభా గణనలో బిసి కుల గణన చేపట్టాలని డిమాండ్ చేశారు. పంచాయతీరాజ్ సంస్థలో బిసి రిజర్వేషన్లను 34 శాతం నుండి 52 శాతానికి పెంచాలని, బిసి ఉద్యోగులకు ప్రమోషన్లలో రిజర్వేషన్లు కల్పించాలని, కేంద్రంలో బిసి లకు ప్రత్యేక మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయాలని కోరారు. బిసి ల అభివృద్ధికి విద్యాభివృద్ధికి ప్రత్యేక పథకాలను రూపొందించాలని. ప్రత్యకంగా కేంద్ర స్థాయిలో స్కాలర్ షిప్ లు, ఫీజు రియింబర్స్ మెంట్, ఉపాధి రంగంలో శిక్షణ కార్యక్రమాలు ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వానికి డిమాండ్ చేశారు.
ఎస్‌సి, ఎస్‌టి, అట్రాసిటీ యాక్ట్ మాదిరిగా బిసి లకు సామాజిక రక్షణ, భద్రత కల్పించడానికి బిసి యాక్టు తేవాలని, బిసి ల విద్యా, ఉద్యోగ రిజర్వేషన్ల పై ఉన్న క్రీమీ లేయర్ ను తోలగించాలని, రాష్ట్రంలో – కేంద్రంలో విద్యా, ఉద్యోగ రిజర్వేషన్లను బిసి ల జనాభా ప్రకారం 27 శాతం నుండి 56 శాతానికి పెంచాలని ఆయన ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ప్రపంచీకరణ, సరళీకృత ఆర్ధిక విధానాల నేపథ్యంలో ప్రైవేటు రంగంలో రిజర్వేషన్లు కల్పించాలని, సుప్రీమ్ కోర్టు, హై కోర్టు జడ్జీల నియామకాలలో రిజర్వేషన్లు అమలు చేయాలని, కేంద్ర స్థాయిలో రెండు లక్షల కోట్ల బడ్జెట్ తో బిసి సబ్ ప్లాన్ ఏర్పాటు చేయాలని, కేంద్ర ప్రభుత్వ శాఖలలో, ప్రభుత్వ రంగ సంస్థలలో ఉన్న 16 లక్షల ఉద్యోగ ఖాళీలు భర్తీ చేయాలని కేంద్రానికి డిమాండ్ చేశారు.
బిసి కార్పొరేషన్ ద్వారా పెండింగ్ దరఖాస్తులకు సబ్సిడీ రుణాలు మంజూరు చేయాలని, దరఖాస్తు చేసిన ప్రతి ఒక్కరికీ సబ్సిడీ రుణం లక్ష రూపాయలు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వానికి విజొప్తి చేశారు. ఇంజనీరింగ్, ఇంటర్, పి.జి, డిగ్రీ, ఫార్మసీ, ఎంసిఎ. ఎంబిఎ కోర్సులు చదివే బిసి విద్యార్ధుల మొత్తం ఫీజులు ప్రభుత్వమే భరించాలని, ప్రైవేటు యూనివర్సిటీ లలో రిజర్వేషన్లు అమలు చేయాలని, ప్రతి కులానికి ఒక కార్పోరేషన్ ఏర్పాటు చేయాలని, ప్రత్యేకంగా ఆత్మగౌరవ భవనాలు ఇచ్చిన 42 కులాలకు ప్రత్యేకంగా ఒక కార్పోరేషన్ ఏర్పాటు చేయాలని కోరారు. ఈ సభలో బిసి నాయకులు ఎర్ర సత్యనారాయణ, గుజ్జు కృష్ణ, తదితరులు పాల్గొన్నారు.