ముంబై: డీమ్యాట్ ఖాతాల సంఖ్య దేశంలో శరవేగంగా పెరిగిపోతోంది. మరింత మంది రిటైల్ ఇన్వెస్టర్లు స్టాక్ మార్కెట్లోకి ప్రవేశించడంతో మొత్తం డీమ్యాట్ ఖాతాల సంఖ్య 10 కోట్లను దాటింది. ఆగస్ట్ లో కొత్తగా 22 లక్షల డీమ్యాట్ ఖాతాలు తెరుచుకోవడంతో వీటి సంఖ్య 10.05 కోట్లకు చేరింది.
మన దేశంలో డీమ్యాట్ ఖాతాలు 2020 మార్చి నాటికి 4.09 కోట్లు. అదే సమయంలో కరోనా వైరస్ మహమ్మారి రాకతో స్టాక్ మార్కెట్లు భారీగా పతనం కావడం తెలిసిందే. స్టాక్స్ చౌకగా లభిస్తుండడంతో పెట్టుబడులకు ఎక్కువ మంది ఇన్వెస్టర్లు ముందుకు వచ్చారు. ఫలితంగా నాటి నుంచి డీమ్యాట్ ఖాతాలు పెరుగుతూనే ఉన్నాయి. దేశంలో డీమ్యాట్ ఖాతాలను ఆఫర్ చేసే డిపాజిటరీలు రెండే ఉన్నాయి. అవి: సెంట్రల్ డిపాజిటరీ సర్వీసెస్(ఇండియా) లిమిటెడ్(సిడిఎస్ఎల్), నేషనల్ సెక్యూరిటీస్ డిపాజిటరీ లిమిటెడ్ (ఎన్ఎస్ డిఎల్). వీటిల్లో సిడిఎస్ఎల్ 7.16 కోట్ల ఖాతాలతో అతి పెద్ద సంస్థగా ఉంది.