Saturday, December 21, 2024

9 కోట్లకు డీమ్యాట్‌ అకౌంట్లు

- Advertisement -
- Advertisement -

Demat accounts

ముంబై: దేశంలో యాక్టివ్‌ డీమ్యాట్‌ ఖాతాల సంఖ్య భారీగా పెరిగింది. డిపాజిటరీల డేటా ప్రకారం గత ఆర్థిక సంవత్సరం (2021-22)లో డీమ్యాట్‌ అకౌంట్లు ఏకంగా 63 శాతం పెరిగి దాదాపు 9 కోట్లకు చేరుకున్నాయి. ఈ సంక్షోభ కాలంలో మిగతా ఆర్థిక సాధనాలతో పోలిస్తే ఈక్విటీ మార్కెట్లు ఆకర్షణీయ ప్రతిఫలాలు అందిస్తుండటం, స్మార్ట్‌ఫోన్‌ ద్వారా ట్రేడింగ్‌ పెరగడం ఇందుకు ప్రధానంగా దోహదపడింది. ఈ ఏడాది మార్చి 31 నాటికి సెంట్రల్‌ డిపాజిటరీ సర్వీసెస్‌ లిమిటెడ్‌ (సీడీఎస్ఎల్) నిర్వహణలోని యాక్టివ్‌ డీమ్యాట్‌ ఖాతాల సంఖ్య 6.3 కోట్లకు చేరుకుంది. ఆ ఖాతాల కస్టడీ ఆస్తుల (ఏయూసీ) మొత్తం విలువ 37.2 లక్షల కోట్లుగా నమోదైంది. కాగా, నేషనల్‌ సెక్యూరిటీస్‌ డిపాజిటరీ లిమిటెడ్‌ (ఎన్‌ఎస్ డిఎల్) నిర్వహణలోని యాక్టివ్‌ డీమ్యాట్‌ అకౌంట్లు 2.67 కోట్లకు పెరిగాయి. వాటిల్లోని ఏయూసీ విలువ రూ.301.87 లక్షల కోట్లుగా ఉంది. మరిన్ని వివరాలు..

2020లో కరోనా సంక్షోభం మొదలైనప్పటి నుంచి దేశంలో డీమ్యాట్‌ ఖాతాలు 2.2 రెట్లు పెరగగా.. వాటిల్లోని మొత్తం ఆస్తుల విలువ కూడా రెండు రెట్లయింది. కొత్త డీమ్యాట్‌ ఖాతాదారుల్లో అధికంగా యువతే కావడం గమనార్హం. కరోనా వ్యాప్తితో ప్రపంచవాసుల వ్యయ, పెట్టుబడి అలవాట్లలోనూ మార్పులు వచ్చాయి. దేశంలో సామాన్యులకూ స్మార్ట్‌ఫోన్లు విరివిగా అందుబాటులోకి వచ్చాయి. పైగా డేటా సేవలూ చౌకగా లభిస్తున్నాయి. దాంతో అప్‌స్టాక్స్‌, జీరోధా వంటి జీరో బ్రోకరేజీ సేవల కంపెనీల ద్వారా ఆన్‌లైన్‌లో డీమ్యాట్‌ ఖాతా తెరిచి ఈక్విటీల్లో ట్రేడింగ్‌ జరిపే ట్రెండ్‌ ఊపందుకుంది. కాగా ఈ-కేవైసీ, ఆధార్‌ ఈ-సిగ్నేచర్‌ వంటి సౌకర్యాలు ఆన్‌లైన్‌లో డీమ్యాట్‌ ఖాతా ఓపెనింగ్‌ ప్రక్రియను సులభతరం చేశాయి. ఇకపైన కూడా యాక్టివ్‌ డీమ్యాట్‌ ఖాతాలు మరింత పెరగనున్నాయని ఇండస్ట్రీ వర్గాలు భావిస్తున్నాయి.  అయితే  కొత్త ఖాతాల వృద్ధి జోరు మాత్రం గత రెండేళ్ల స్థాయిలో ఉండకపోవచ్చని వారంటున్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News