ఏదో చెప్పబోయి మరేదో అంటున్నారు
నితీశ్ కుమార్‌పై పికె సెటైర్లు
పాట్నా: బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్, రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్‌ల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. నితీశ్ కుమార్ తనను ఇంటికి ఆహ్వానించాడని, జెడి(యు)లో చేరి పార్టీని నడిపించాలని ఆఫర్ చేశాడని ఈ నెల 5న ప్రశాంత్ కిశోర్ ఆరోపించారు. ఇదే వీరిద్దరి మధ్య వివాదానికి కారణమైంది. ప్రశాంత్ కిశోర్ చేసేవి నిరాధారమైన ఆరోపణలని నితీశ్ కుమార్ కొట్టిపారేశారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ పికెను తాను పార్ట్టీలోకి ఆహ్వానించడం శుద్ధ అబద్ధమన్నారు. కొన్నేండ్ల క్రితం జెడి(యు)ను కాంగ్రెస్‌లో విలీనం చేయాలని ప్రశాంత్ కిశోర్ తనకు సలహా చ్చాడని నితీశ్ ఆరోపించారు. ప్రస్తుతం ఆయన బిజెపి అజెండా ప్రకారం పని చేస్తున్నారని కూడా విమర్శించారు. దీనిపై ప్రశాంత్ కిశోర్ కౌంటర్ ఇచ్చారు. నితీశ్ కుమార్ చెప్పినవన్నీ అబద్ధాలేనని అన్నారు. తాను జెడి(యు)ను కాంగ్రెస్‌లో విలీనం చేయమన్నానని చెప్తూనే బిజెపి అజెండా ప్రకారం పని చేస్తున్నానని చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. మొదటిది నిజమైతే రెండోది తప్పు, రెండోది నిజమైతే మొదటిది తప్పు అవుతుందని వ్యాఖ్యానించారు. వయసు ప్రభావంతో నితీశ్‌కు మతి తప్పిందని ఎద్దేవా చేశారు. ఏదో మాట్లాడబోయి ఇంకేదో మాట్లాడతున్నారని సెటైర్లు వేశారు. ఆయన ఇప్పుడు భ్రమలో ఉన్నారని, ఎవరినీ నమ్మే స్థితిలో లేరన్నారు. రాజకీయంగా ఏకాకి అయ్యాననే బాధతో ఏదిపడితే అది మాట్లాడుతున్నారని విమర్శించారు.