Wednesday, January 22, 2025

ఉపా వేటలో ‘ప్రజాస్వామ్యం’

- Advertisement -
- Advertisement -

ఉపా, ఎన్‌ఐఎ దాడులతో ‘ప్రజాస్వామ్యం’ వేటాడబడుతున్నది. ప్రాథమిక హక్కుల అణచివేతే ఉపా చట్టం అనేది జగమెరిగిన సత్యం. దానికి తోడు తెలుగు రాష్ట్రాల్లో గ్రేహౌండ్స్ లాగా చట్టవిరుద్ధమైన సంస్థగా ఉపా కేసుల దాడులకు ఎన్‌ఐఎ సహకరిస్తున్నది. ఉపా చట్టాన్ని ప్రారంభం నుండి ప్రజా సంఘాలు, హక్కుల సంఘాలు బలంగా వ్యతిరేకిస్తున్నప్పటికీ ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదు. పట్టించుకోకపోగా, అఖిల భారత స్థాయిలో హక్కుల సంఘాలలో, ప్రజా సంఘాల్లో నాయకత్వం వహిస్తున్న వారిని అదే ఉపా నిర్బంధాలకు బలి చేస్తున్న సత్యాన్ని మనందరం చూస్తున్నాం. ఆ నిర్బంధంలో భాగంగా ఇప్పటికే ఫాదర్ స్టాన్ స్వామి, పాండు నరోటె, కంచెన్ వరవరరావులు తమ జీవించే హక్కును వ్యవస్థీకృత హత్య రూపంలో కోల్పోయారు. అయినప్పటికీ ప్రతిపక్షాల దృష్టికి పౌరహక్కుల సంఘాలు తీసుకెళ్ళినప్పటికీ స్పందించడం లేదు. ప్రధానంగా బలమైన రాజకీయ పార్లమెంటరీ పార్టీలు ప్రభుత్వంతో సమానంగా బాధ్యత పడాల్సిన ప్రతిపక్షాలు కూడా నిర్లక్ష్యం వహిస్తున్నాయి.

ఈ రాజకీయ పార్టీలన్నిటికీ ఎప్పుడో ఒకప్పుడు మేము కూడా అధికారంలోకి వస్తామని, ఇలా ప్రశ్నించే గొంతులు ఎప్పటికీ ఉండకుంటే బాగుంటుందనే ఉద్దేశంతోనే స్పందించడం లేదేమో. అంతేకాక తెలుగు రాష్ట్రాల్లోనైతే ఉపా నిర్బంధం విరసం వరవరరావు, ప్రొ. సాయిబాబాల సుదీర్ఘకాల నిర్బంధం ప్రజా సంఘాల కార్యకర్తలను ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఉపా, ఎన్‌ఐఎలు ప్రజాస్వామ్యాన్ని వేటాడుతున్నాయి. అందులో భాగమైన ప్రధానమైన నాలుగు వ్యవస్థలు కూలిపోతున్నాయి. దీనితో ప్రజల్లో ప్రజాస్వామ్యం పట్ల గౌరవం, విశ్వాసం సడలిపోతున్నది.వ్యవస్థల నిర్వీర్యం ప్రజాస్వామ్య సంక్షోభానికి అధికార, ప్రతిపక్ష పార్టీలే బాధ్యత వహించాల్సిన అవసరం ఉంది. నేడు ప్రధానంగా రాజకీయ నాయకులు అవినీతి కేసులలో కూరుకుపోయిన వారందరూ తమ నేరాన్ని సామూహికం చేసే ప్రయత్నం చేస్తున్నారు. అందులో భాగంగా కులాన్ని, వర్గాన్ని, ప్రాంతాన్ని వాడుకొని మేధావులు కూడా మాట్లాడాలని ఉచిత సలహాలను బహిరంగం చేస్తున్నారు. ప్రజాస్వామ్యంపై విశ్వాసం లేని వాళ్లే పాలకులుగా మారితే రాజ్యం పోలీస్ మయంగా మారుతుంది.

ప్రజా సంఘాలు, పౌర హక్కుల సంఘాలు ఒకప్పుడు టాడా, పోటా, బూటకపు ఎన్‌కౌంటర్‌లు లాంటి ముఠాల నిర్బంధాలను ఎదుర్కొని ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టాలనే ప్రయత్నంలో ఉన్నాయి. కానీ ప్రభుత్వాలే ప్రజలకు ప్రజాస్వామ్యం అవసరం లేదని నియంతృత్వాన్ని అమలు చేస్తూ ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నాయి. ప్రజా సంఘాలపై ఉపా నిర్బంధం ప్రజాస్వామ్యంపై నిర్బంధంగా ప్రజలందరూ భావించాల్సిన అవసరం ఉంది.
2014 ఎన్నికల్లో కేంద్రంలో బిజెపి అధికారంలోకి వచ్చిన తర్వాత సంఘ్ పరివార్ రహస్య రాజకీయ ఎజెండాని నేడు బహిరంగంగా అమలు చేస్తున్నది. విశ్వాసాలను విద్వేషాలుగా మార్చి విధ్వంసం సృష్టించే సంఘ్ పరివార్ భావజాలానికి వ్యతిరేకంగా ఎవరు మాట్లాడినా అది నేరమవుతున్నది. ఉత్తరం రాస్తే, కార్టూన్ గీస్తే, పుస్తకం పట్టుకుంటే, ఫోటో తీస్తే, ముద్దాయిని ఇంటర్వ్యూ చేస్తే, వ్యాసం రాస్తే, ఉపన్యాసం ఇస్తే, నిజాన్ని తెలుసుకునే ప్రయత్నం చేస్తే, నిజాన్ని నిర్భయంగా మాట్లాడితే, విమర్శిస్తే, ఉత్తరంలో మనకు ఇష్టమైన పదాలు వాడితే దేశద్రోహం అవుతుంది, రాజద్రోహం అవుతుంది.

మన దేశంలో అత్యంత తీవ్రమైన నేరాలు మోపబడాలంటే మారణాయుధాలు, పేలుడు పదార్థాలు, తుపాకులు అవసరం లేదు. వారు ఏ రంగంలో పని చేసినా, దేశద్రోహులుగా, తీవ్రవాదులుగా, హింసావాదులుగా చిత్రీకరిస్తున్నారు. కార్మిక రంగంలో పని చేసే నేతలైనా, హక్కుల కోసం మాట్లాడే నాయకులైనా, పీడిత ప్రజల కోసం రచనలు చేసే రచయితలైనా, నిజాన్ని నిర్భయంగా ప్రకటించే పత్రికా సంపాదకులైనా, దళిత నాయకులైనా, ప్రజా ఉద్యమాలపై జరిగే చట్ట వ్యతిరేక హింసను ప్రశ్నించేవారు ఉన్నత విద్యావంతులైనా, పర్యావరణం కోసం పాటుపడే వారైనా ఇక్కడ దేశద్రోహులుగా చిత్రీకరించబడుతున్నారు. ప్రజల జీవన పరిస్థితుల్లో మార్పు కోసం, దోపిడీ అణచివేతల రద్దు కోసం, ప్రజాస్వామిక ఆకాంక్షలు కోసం నిబద్ధతతో పని చేసే మేధావులను, ప్రజాస్వామిక వాదులను అక్రమ కేసుల్లో ఇరికించి, అత్యంత నిరంకుశమైన ఉపా చట్టం క్రింద అరెస్టు చేసి ఏళ్ల తరబడి జైళ్లలో నిర్బంధిస్తున్నారు. లేదా వారి జేబు సంస్థలైన ఇడి, సిబిఐ, ఎస్‌ఐఎ లాంటి చట్ట వ్యతిరేక, రాజ్యాంగ వ్యతిరేక సంస్థలతో దాడులు చేయించి ప్రశ్నించే గొంతును నొక్కేస్తూ ఉన్నారు.

అందులో భాగంగానే కేంద్ర హోం మంత్రి అమిత్ షా కనుసన్నల్లో నడిచే ‘నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (ఎన్‌ఐఎ) ద్వారా 2- అక్టోబర్ -2023న తెలుగు రాష్ట్రాలలో ‘గాంధీ జయంతి రోజు’ తెల్లవారుజామునే కుల నిర్మూలనా పోరాట సమితి, చైతన్య మహిళా సంఘం, పౌర హక్కుల సంఘం, దేశభక్త ప్రజాతంత్ర ఉద్యమం, ప్రగతిశీల కార్మిక సమాఖ్య, విప్లవ రచయితల సంఘం, మానవ హక్కుల వేదిక, ఇండియన్ అసోసియేషన్ పీపుల్స్ లాయర్స్, అమరుల బంధు మిత్రుల సంఘం, ప్రజా కళామండలి నాయకుల ఇళ్లలో సోదాలు చేసింది. ఆంధ్రప్రదేశ్‌లో 53 చోట్ల, తెలంగాణలో 9 చోట్ల మొత్తంగా 62 మందిపై దాడులు చేసింది. సత్యసాయి జిల్లా కదిరిలో ప్రగతిశీల కార్మిక సమాఖ్య నాయకుడు రామక్క గారి చంద్రను లేని తుపాకీ, 14 తూటాలు ఉన్నాయని అరెస్టు చేసింది.

కడప జిల్లా పొద్దుటూరు పట్టణంలోని చైతన్య మహిళా సంఘం పద్మ ఇంట్లో 13 లక్షల రూపాయలు, డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నామని ఎన్‌ఐఎ తెలిపింది. ఎన్‌ఐఎ దాడికి గురైన ప్రతి సంఘ సభ్యుల సెల్ ఫోన్లతో పాటు వారి కుటుంబ సభ్యుల సెల్ ఫోన్లు, ల్యాప్ టాప్లులు, ఎలక్ట్రానిక్ పరికరాలను స్వాధీనం చేసుకుంది. 2020 నవంబర్ 23న అల్లూరి సీతారామరాజు జిల్లాలోని ముంచింగిపుట్ పోలీసులు అరెస్టు చేసిన పాంగి నాగన్న విచారణలో వెల్లడించిన సమాచారం మేరకు తాజాగా ఈ సోదాలు నిర్వహించినట్లు ఎన్‌ఐఎ ప్రకటించింది.
ఒంటరిగా, ప్రజాస్వామ్యవాదిగా తన అభిప్రాయాలను వెలిబుచ్చే అవకాశాల్ని పూర్తిగా రద్దు చేస్తున్నాయి. ఉభయ తెలుగు రాష్ర్టంలోనే కాదు, మణిపూర్ రాష్ట్రానికి చెందిన ప్రొఫెసర్ సెంట్రల్ యూనివర్సిటిలో అక్కడ జరుగుతున్న మారణ హోమంపై తమ అభిప్రాయాలను వెలిబుచ్చినందుకు వారిని కూడా నేరస్థులుగా పరిగణించే హీనస్థితికి ప్రభుత్వాలు దిగజారిపోయాయి. మరి రాజకీయ పార్టీలన్నీ ప్రజాస్వామ్య ఆచరణతో తమ చిత్తశుద్ధి కలిగి ఉన్నాయంటే అది అసలే లేదు.

మరి బుద్ధిజీవులు ఏమి చేయాలి, చివరికి ప్రజాస్వామిక వాదులుగా సమాజంలో జీవించలేని స్థితిని ప్రభుత్వాలే కల్పిస్తున్నాయి. బెంగళూరుకు చెందిన ప్రొ. అనంతమూర్తి గుజరాత్ మారణహోమం తర్వాత కేంద్రంలో మోడీ ప్రధాన మంత్రి అయితే దేశంలో ప్రజాస్వామ్యం అడుగంటుతున్నదని అన్నందుకు ఆయనపై అమలైన ఫాసిస్టు నిర్బంధంతో గుండెపోటుతో చనిపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. రాజకీయ పార్టీలలో ప్రజాస్వామ్య ఆచరణ లేకపోతే ప్రజల్లో కూడా ఉండొద్దనే సంకుచితమైన ఆలోచనలో రాజకీయ పార్టీలు ఉండడం మన దౌర్భాగ్యం. ఒక ప్రజాస్వామిక చర్యకు అవకాశం లేకుండా రాజకీయ పార్టీలు తమ ఆచరణలో వస్తున్న తప్పులను సరిదిద్దుకోవడమనేది అసంభవం. నేటి తప్పులను సరిదిద్దుకోలేకపోతే ఇంకా పెద్ద తప్పులను చేయాల్సిన పరిస్థితి వస్తుందనేది చరిత్ర చెబుతున్న పాఠం. 1975 ఎమర్జెన్సీ తర్వాత ప్రాథమిక హక్కులు రద్దయిన స్థితిలో పూర్తిగా జీవించే హక్కు ప్రమాదంలో పడింది.

ఆనాటి నుండి ఈనాటి వరకు ఆర్టికల్ 21 జీవించే హక్కును, ఆర్టికల్ 19 భావప్రకటన స్వేచ్ఛ హక్కును ప్రజలు ఆచరణలో పొందలేకపోతున్నారు. 1967 నుంచి దేశంలో కొనసాగుతున్న ఆయుధ రైతాంగ పోరాటాల నేపథ్యంలో జరుగుతున్న ఎన్‌కౌంటర్ హత్యాకాండ రూపం మార్చుకొని ఎవరూ ప్రభుత్వాలకు వ్యతిరేకంగా మాట్లాడినా, ఉద్యమించినా, వారిని చంపేసి ఎన్‌కౌంటర్‌గా ప్రకటించే స్థితికి ప్రభుత్వాలు చేరుకున్నాయి. ప్రభుత్వాలు ప్రజాస్వామికబద్ధంగా పాలన చేయలేకపోయినా ప్రజల సమస్యల పట్ల స్పందించకపోయినా ప్రజల పోరాట రూపాలను, ఆందోళనలను వారి పరిమితుల్లో ఉండాలని కోరుకోవడమనేది అత్యాశే అవుతుంది. సమస్య ఉన్నవాళ్ళు ఎటువంటి పోరాట రూపాలనైనా ఎన్నుకొని ఆచరించే హక్కు వారికి ఉంటుంది. అవి ప్రత్యామ్నాయ రాజకీయాలు కావచ్చు, లేదా మనం ఊహించని రాజకీయాల కార్యాచరణ కావచ్చు.

దాన్ని దృష్టిలో పెట్టుకోకుండా ప్రభుత్వాలు ప్రజా సంఘాలు ఉనికిలో ఉన్నందుకు ప్రభుత్వాల అవినీతిని, అరాచక విధానాలను ప్రశ్నిస్తున్నారనే భయంతో నిర్బంధాన్ని తీవ్రస్థాయిలో అమలు చేయడం, అది అప్రజాస్వామ్యమే అవుతుంది. ఇప్పటికైనా రాజకీయ పార్టీలు తమ కార్యాచరణను పునఃసమీక్షించుకోవాలని, ప్రజల ప్రాథమిక హక్కులను, రాజ్యాంగ విలువలను కాపాడడం ద్వారానే ప్రజాస్వామ్యాన్ని నిలబట్టగలుగుతారని, క్రూర నిర్బంధ చట్టమైన ఉపా చట్టాన్ని రద్దు చేయడం ద్వారానే ప్రాథమిక హక్కులను కాపాడడంలో మీ వంతు బాధ్యత నిర్వర్తిస్తారని ఎన్‌ఐఎ నిర్బంధ సంస్థ ఇది ప్రజాస్వామిక వ్యవస్థలో ఉండకూడదని తెలియజేస్తూ… ప్రభుత్వాలు ఉపా చట్టాన్ని, ఎన్‌ఐఎను రద్దు చేయాలని హక్కుల సంఘాలుగా ప్రభుత్వాలను డిమాండ్ చేస్తున్నాం.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News