Saturday, December 21, 2024

ప్రమాదంలో ప్రజాస్వామ్యం!

- Advertisement -
- Advertisement -

Democracy in danger!

భారత దేశ స్వాతంత్య్రం ప్రపంచ చరిత్రలోనే ఓ మహోజ్వల ఘటన. వేయి సంవత్సరాలకు పైగా విదేశీ పాలకుల పాలనాలలో మన అస్తిత్వం పోకుండా కాపాడుకో గలగడమే మన సాంస్కృతిక వైభవాన్ని వెల్లడి చేస్తుంది. సుదీర్ఘకాలం విదేశీ పాలకుల పాలనలో ఉన్న ఏ దేశం కూడా తమ సాంస్కృతిక పునాదులను, తమ భాషలను కాపాడుకోలేక పోయింది. పైగా, మనం ప్రజాస్వామ్య వ్యవస్థను ఏర్పర్చుకోవడంతో ప్రపంచంలో స్వేచ్చాయుత వాతావరణంలో ఉన్న ప్రజల సంఖ్య ఒకేసారి రెట్టింపు అయింది. భారత స్వాతంత్ర సమరం కేవలం మనకు స్వాతంత్య్రం తీసుకు వచ్చేందుకు దోహదపడటమే కాకుండా పలు ఆసియా- పసిఫిక్ దేశాలకు స్ఫూర్తి కలిగించింది. ఆ స్పూర్తితో దాదాపు అదే సమయంలో సుమారు 60 దేశాలు కూడా స్వాతంత్య్రం పొందాయి.

అయితే వాటిల్లో చాలా దేశాలలో ప్రజాస్వామ్యం నామమాత్రంగా మాత్రమే మిగిలింది. మనదేశంలో బలమైన పునాదులు ఏర్పర్చుకుంది. ఎమర్జెన్సీ వంటి విషమ పరిస్థితులను సహితం శాంతియుతంగా పరిష్కరించుకో గలిగాము. ఎటువంటి రక్తపాతం లేకుండా బలమైన ప్రభుత్వాలను సహితం ప్రజలు గద్దె దింపగలుగుతున్నారు. ఉగ్రవాదం, తీవ్రవాదం వంటి పెను సవాళ్ళను సహితం ప్రజలు ఎదుర్కొంటున్నారు.

సుమారు నాలుగు దశాబ్దాలుగా ఉగ్రవాదంతో అతలాకుతలం అవుతున్న జమ్మూ కాశ్మీర్ లో సహితం ఎప్పుడు ఎన్నికలు జరిగినా, ఎన్నికలను బహిష్కరించామని ఉగ్రవాద సంస్థలు పిలుపిస్తున్నా సాధారణ ప్రజలు ఖాతరు చేయకుండా భారీ సంఖ్యలో ఓటింగ్ లో పాల్గొనడమే మన ప్రజాస్వామ్య వ్యవస్థ పట్ల మన ప్రజలు చూపుతున్న విశ్వాసానికి తార్కాణం.
ఇప్పుడు స్వతంత్ర స్వర్ణోత్సవాలను జరుపుకొంటున్నాము. ఇప్పటి నుండి అమృతోత్సవాలకు సిద్ధం కమ్మనమని ప్రధాని నరేంద్ర మోదీ పిలుపిచ్చారు. అయితే, ఈ 75 ఏళ్ళ మన జాతి ప్రయాణం గురించి మనం ఒక సారి సింహావలోకనం చేసుకోవలసిన అవసరం ఉంది. మనం స్వాతంత్ర పోరాటం జరిపింది కేవలం పరాయి పాలకులను సాగనంపి, స్వదేశీ పాలకుల కోసమా? లేక ౠసుపరిపాలన’ కోసమా? ఈ విషయాన్నీ మన పాలకులు మర్చిపోయినట్లున్నారు.

‘స్వరాజ్యం’ కోసం మనం సాగించిన పోరాటం ‘సురాజ్య’ స్థాపన కోసమే. అందుకు చెప్పుకోదగిన ప్రయత్నాలు జరిగినా, ‘సుపరిపాలన’ దిశగా అడుగులు వేయలేక పోతున్నాము. కేవలం అధికారాన్ని కాపాడుకోవడం కోసం ప్రజాస్వామ్య వ్యవస్థలో ఏమాత్రం సహింపలేని అనేక రుగ్మతలకు గురవుతున్నాము. ప్రజాస్వామ్య విలువల పట్ల సాధారణ ప్రజలు చూపుతున్న విశ్వాసం మన నేతలలో కనిపించడం లేదు.

1980 వరకు మన పొరుగున ఉన్న చైనాతో పాటు ఆగ్నేయాసి యా దేశాలు అన్ని ఆర్ధికంగా దాదాపు ఒకే స్థితిలో ఉన్నాయి. కా నీ మిగిలిన దేశాలు ఆర్ధిక సంస్కరణలు చేపట్టడం ద్వారా విశేషమైన ప్రగతి సాధించాయి. మనం అందుకు ఓ దశాబ్దకాలం ఆల స్యం చేసాము. దానితో ఆపరుగులో ఇంకా వెనుకబడి ఉన్నాము.

పైగా, ఆర్ధిక సంస్కరణల అమలు ప్రారంభించిన పివి నరసింహారావు మాటలలోనే మన సంస్కరణలు ‘మానవతా దృష్టి’ కోల్పోయాయి. ఈ సంస్కరణలను అమలు చేస్తున్న పివి నరసింహారావు, డా. మన్మోహన్ సింగ్, ప్రణబ్ ముఖేర్జీ, చిదంబరం, నరేం ద్ర మోదీ వంటి వారెవరు ఆర్ధిక సంస్కరణలు, స్వేచ్ఛాయుత సమాజం పట్ల ప్రగాఢమైన విశ్వాసం ఉన్నవారు కాదు.
కేవలం తప్పనిసరి పరిస్థితులలో ఈ విధానాలు అవలంబిస్తున్నారు. దానితో మన ఆర్ధిక ప్రగతికి ప్రధాన అడ్డంకిగా మారిన ‘ప్రభుత్వ నియంత్రణ’లు మౌలిక ఉద్దేశ్యాలను దెబ్బతీస్తున్నాయి. ప్రధాని నరేంద్ర మోదీకి మొదట్లో ఆర్ధిక సలహాదారుడిగా వ్యవహరించిన ఆర్థికవేత్త మాటలలో చెప్పాలంటే మొత్తం ఆర్ధిక వృద్ధి కేవలం ఇద్దరు వ్యక్తుల చుట్టూ కేంద్రీకృతమవుతున్నది.
మొత్తం ప్రపంచ పెట్టుబడిదారీ చరిత్రలో ఏ దేశంలో కూడా సం స్కరణల ఫలితాలు కేవలం ఇద్దరు, ముగ్గురు వ్యక్తిలకే పరిమితం కాలేదు. అందుకనే మనం సాధిస్తున్న అభివృద్ధి దేశంలో అంతరాలను మరింతగా పెంచుతున్నది. అత్యధిక ప్రజల జీవన ప్రమాణాలలో చెప్పుకోదగిన మార్పులు తీసుకు రాలేక పోతున్నది.

ఉపాధి కల్పన, పారదర్శక పక్రియ లోపిస్తున్నది. కీలక సంస్థలు స్వతంత్రంగా, స్వేచ్ఛగా పని చేయలేక పోతున్నాయి. చట్ట సభలలో విధానపర అంశాలపై లోతైన చర్చలకు అవకాశం ఉండటం లేదు. చర్చలు లేకుండా, కేవలం హడావుడిగా బిల్లులను ఆమోదింప చేసుకోవడం కోసమే చట్టసభలు సమావేశం అవుతున్నాయి.
ప్రపంచంలో ఇదో పెద్ద ఆర్ధిక వ్యవస్థగా అభివృద్ధి చెందడం మనమంతా గర్వించ వలసిన అంశమే. అయితే ప్రజల జీవన ప్రమాణాలు, స్వేచ్ఛ స్వాతంత్రాలకు సంబంధించిన అన్ని అంతర్జాతీయ సూచికలలో దారుణంగా వెనుకబడి ఉండడం ఆందోళన కలిగించే అంశం. భజన పరులను అందలం ఎక్కించడం, విధానపరమైన అంకిత భావం గలవారిని పక్కన పెట్టేయడం అన్ని స్థాయిలలో జరుగుతున్నది.

మన జాతీయ పాలనా వ్యవస్థకు అవినీతి కాన్సర్ వలే పరిణమించింది. అవినీతికి మూలమైన ప్రభుత్వ విధానాలను రూపకల్పన చేస్తున్నారు. ఎంతో ప్రజాదరణ ఉన్నదని భావించే నాయకులు సహితం అటువంటి చీడపురుగుల చేతులలో కీలు బొమ్మలవలె మిగిలిపోతున్నారు. విధానాల గురించి ఏ స్థాయిలో కూడా పారదర్శకంగా చర్చలకు, సమీక్షలకు ఆస్కారం లేకపోవడమే అందుకు ప్రధాన కారణం.
ఉదాహరణకు ప్రపంచంలో మరే ప్రజాస్వామ్య దేశంలో లేనటువంటి నిరంకుశ చట్టం సాయుధదళాల ప్రత్యేక అధికారాల చట్టాన్ని సుమారు ఏడు దశాబ్దాలుగా కొన్ని సున్నిత ప్రాంతాలలో అమలు జరుపుతున్నాము. ఈ చట్టం గురించి ప్రతిపక్షాలు విమర్శనాత్మకంగా మాటాడుతూ ఉంటాయి. కానీ అధికారంలోకి వచ్చాక మద్దతు ఇస్తూ వస్తున్నారు.
కనీసం ఒక్క సారైనా ఆ చట్టం అమలు ఏ విధంగా జరుగుతుంది? ఎటువంటి ఫలితాలు వస్తున్నాయి? అని పార్లమెంట్ లో గాని మరే వేదికపై అయినా చర్చించామా? సమీక్ష చేశామా? సుప్రీంకోర్టు సూచించినా ప్రభుత్వం పట్టించుకొనే సాహసం చేయడం లేదు. అదే విధంగా అనేక చట్టాలు అమలవుతున్నాయి.

ప్రపంచంలో మరే దేశంలో లేని విధంగా 180 వరకు పలు రకాల హక్కుల కమీషన్ లు మన దేశంలో ఉన్నాయి. 9 జాతీయ మానవ హక్కుల కమీషన్ లతో పాటు రాష్ట్ర స్థాయిలలో ఉన్న వివిధ రకాల హక్కుల కమీషన్ లు, సమాచార హక్కుల కమీషన్ లు ఈ పరిధిలోకి వస్తాయి. కనీసం ఒక్క సారైనా పార్లమెంట్ గాని లేదా ఏదైనా రాష్ట్రాల శాసనసభ గాని ఈ కమీషన్ లు సమర్పించే వార్షిక నివేదికలను చర్చించాయా?
పైగా, ఉద్యోగ విరమణ చేసిన వారికి ఉపాధి కేంద్రాలుగా ఇవి మారుతూ ఉండడంతో, ఈ పదవుల కోసం ఉద్యోగాలు చేస్తున్న సమయంలో న్యాయమూర్తులు, సీనియర్ ప్రభుత్వ ఉద్యోగుల అధికార పార్టీలను ప్రసన్నం చేసుకోవడానికి తాపత్రయ పడుతున్నాము. ఇటువంటి చట్టాల మనుగడ, ఈ విధంగా కమీషన్ ల పనితీరు మన ప్రజాస్వామ్య మౌలిక విలువలకు తీవ్ర విఘాతం కలిగిస్తున్నాయి.

ఇక విధానాల రూపకల్పనలో, పరిపాలనలో కీలక పాత్ర వహించే రాజకీయ పార్టీలలో అంతర్గత ప్రజాస్వామ్యం మచ్చుకైనా కనిపించడం లేదు. అక్రమ మార్గాల ద్వారా ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికైన ప్రభుత్వాలను కూల్చివేయడం, రాజకీయ ప్రత్యర్థులను దారిలోకి తెచ్చుకోవడం కోసం కేంద్ర నిఘా ఏజెన్సీలను నిస్సిగ్గుగా ఉపయోగించుకోవడం, ప్రతి పార్టీలో కూడా ఒకరు లేదా ఇద్దరు మాత్రమే కేంద్రంగా కొనసాగుతూ ఉండడం ఆందోళన కలిగిస్తున్నది.
ప్రజాస్వామ్యం అంటే క్రమం తప్పకుండా ఎన్నికలు జరపడం మాత్రమే కాదు. అన్ని స్థాయిలలో ప్రజాస్వామ్య విలువలు వ్యక్తం కావాలి. ప్రజలే నిజమైన ప్రభువులు అంటాము. కానీ వారిని భావోద్వేగాలతో, ఉచిత పథకాలతో ఆకట్టుకోవడం ద్వారా ప్రజాస్వామ్య ప్రాతిపదికనే సమాధి చేసే ప్రయత్నాలు నేడు జరుగుతున్నాయి. అదే నేటి నిజమైన ప్రమాదంగా గుర్తించాలి.

                                                                                                     చలసాని నరేంద్ర

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News