జనతా పార్టీ విచ్ఛిన్నం తర్వాత 1980 ఎన్నికల్లో జనసంఘ్ మూలాలు ఉన్న వారు భారతీయ జనతా పార్టీ (బిజెపి)గా ఏర్పడి పోటీ చేసి కేవలం రెండు ఎంపి స్థానాలకు ఆ పార్టీ పరిమితమైంది. జనసంఘం మూలాలు, ఆర్‌ఎస్‌ఎస్ అండదండలు ఉండడం వలన భారత రాజకీయాలలో 2000 నాటికి బిజెపి అధికారం చేపట్టే స్థాయికి ఎదగగలిగినప్పటికీ వారు కేవలం హిందూ మత సెంటు మెంట్ మాత్రమే వాడుకున్నారు. ఇక గుజరాత్‌లో గోద్రా అల్లర్ల నుంచి బిజెపి కొత్తశకానికి నాంది పలికింది. హిందూ మతోన్మాదం రెచ్చగొట్టడం, పరమతంపై దాడులు చేయడం, పురిగొల్పడం వరకు ఆ పార్టీ ఆలోచనలు విస్తరించాయి. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పటికీ మారిన బిజెపి పరిస్థితి పట్ల చాలా ఉదాసీనంగా వ్యవహరించారు. బిజెపి మారిన దూకుడుకు నరేంద్ర మోడీ, అమిత్ షా ల నాయకత్వంలో బిజెపి ఓ విశాల ప్రయోగశాలగా మారింది.
కాంగ్రెస్ యుపిఎ రెండు ప్రభుత్వాల కుంభకోణాలు ఎండగట్టడంలో భాగంగా అవినీతి వ్యతిరేక ఉద్యమం అన్నాహజారే నేతృత్వంలో మొదలైంది. ఈ నేపథ్యంలో అనూహ్యంగా బిజెపి రాజకీయ పట్టు నరేంద్ర మోడీ, అమిత్ షాల చేతికి చిక్కాయి. 2014 నుండి అధికారంలోకి వచ్చిన బిజెపి సరికొత్త ఆటకు తెరలేపింది. అధికారం స్థిరపరుచుకోవడం, ఉన్న అధికారంతో ప్రత్యర్థులను దెబ్బ తీయడం, పాలనలో సంఘ్‌పరివార భావశైలిని నిర్ణయాలుగా స్వీకరించడం మొదలైనప్పటికీ సుష్మా స్వరాజ్, మనోహర్ పాలేకర్, నితిన్ గడ్కరీ లాంటి మధ్యేవాద బిజెపి నేతలు కేబినెట్‌లో ఉండటం ఎన్‌డిఎ పక్షాల వలన మొదటిసారి ప్రభుత్వాన్ని చాలా బ్యాలెన్స్‌గా నడిపారు. అయితే భావజాల వ్యాప్తిలోనూ, సంఘ్‌పరివార్ ఆలోచనలను వ్యాప్తి చేయడంలో కీలక భూమికనే నిర్వర్తించారు. ఆ అయిదేళ్ళ కాలంలో జరిగిన రాజకీయ సంఘటనలన్నీ తమకు అనుకూలంగా మార్చుకోగలిగారు. ఇక 2019లో ప్రాంతీయ పార్టీల మధ్య సయోధ్య లేకపోవడం, కాంగ్రెస్ పార్టీలో నాయకత్వ ఏకీకరణ లేకపోవడం, ప్రతిపక్షాల బలహీనత మూలంగా అప్పటికే అధికారంలో ఉన్న బిజెపి తిరిగి అత్యంత మెజారిటీతో కేంద్రంలో సొంతంగా అదికారంలోకి వచ్చింది. దీనితో కేంద్రంలో మోడీ, అమిత్ షాల ఎత్తుగడలు సంఘ పరివార్ ఎజెండాను నేరుగా అమలు జరపడానికి కృషి చేశారు.
ఎన్‌డిఎ పక్షాలను లెక్కచేయని స్థితిలో టిడిపి, శివసేన, నితీష్ లాంటివారు ఒక దశలో దూరం అయ్యారు కూడా? ఇక్కడ బిజెపికి కలిసివచ్చిన అంశం ఏమంటే దేశంలో అధికారంలో ఉన్న ప్రాంతీయ పార్టీలు సరైన సైద్ధాంతిక భూమికి లేక పోవడం, అధికారం కోసం అర్రులు చాచడం! కొందరు లొంగిపోయి వ్యవహారం చేస్తే, మరి కొందరినైతే తన అంగ, అర్థ, రాజకీయ బలాలతో రాష్ట్ర లను వినియోగించి రాష్ట్ర ప్రభుత్వాలను కూలగొట్టింది. కొన్ని పక్షాలను నిలువునా చీల్చి తమకు అనుకూలంగా మార్చుకుంది. ఇదే సమయంలో తమకున్న అధికార బలాన్ని, రాజకీయ చతురతతో, ఎత్తుగడలతో ఐటి, సిబిఐ, ఇడి ఎన్నికల కమిషన్ లాంటి రాజ్యాంగ సంస్థలను వాడుకుందనే ఆరోపణలు సైతం బిజెపి మూటగట్టుకుంది. ఇక్కడ ఆశ్చర్యకర విషయమేమంటే! ఈ సంస్థల దాడులు, కేసులు ఉన్న అనేక మంది బిజెపి పంచన చేరి వాటి నుండి బయటపడి అధికార అందలాలు అందుకోగా, రాజీపడని మరికొందరు నేతలు దారుణమైన కేసులు, అణచివేతలతో జైలు పాలయ్యారు.
లాలూ ప్రసాద్ యాదవ్, మమత బెనర్జీ, కెసిఆర్, డికెశివకుమార్, సంజయ్ రౌత్, హేమంత్ సోరెన్ తోపాటు అవినీతి వ్యతిరేక ఉద్యమం ద్వారా ఉనికి లోనికి వచ్చిన కేజ్రీవాల్‌తో సహా అందరినీ ఆ చక్రబంధంలో ఇరికించి ఆటలాడుకున్నారు. ఇదే సమయంలో తమ సంఘభావజాలం అమలులో భాగంగా ఎన్‌ఆర్‌సి, జమ్మూ కశ్మీర్‌లో 370 ఆర్టికల్ రద్దు, మణిపూర్ ఎడతెగని మత హింస, అయోధ్యలో రామాలయ నిర్మాణంతోపాటు హిందూ భావజాలం వ్యాప్తిలో అనేక దాడులు, ఘర్షణలకు అవకాశం కల్పించారు. ఇదే సమయంలో తమ భావజాలానికి ప్రమాదకరమని భావించిన మేధావులు, రచయితలు, ప్రజాస్వామికవాదులు అనేక మందిపై దేశద్రోహం చట్టం క్రింద, భీమా కోరేగావ్ కేసు, అర్బన్ నక్సలైట్ల పేరుతో జైలుపాలు చేశారు. ఇప్పటికీ వారంతా హక్కుల నేపథ్యం, కేవలం ప్రగతిశీల భావాలు కలిగి ఉన్న నేరానికి ఏళ్ళ తరబడి విచారణ ఖైదీలుగా జైళ్ళలో మగ్గుతుండగా, స్టాన్ స్వామి, సాయిబాబా లాంటివారు అంతిమ శ్వాస విడిచారు.
ఒక రకంగా ఇటలీ, జర్మనీలో రాజకీయ పక్షాల మాదిరిగా తమ వ్యతిరేక భావజాలాన్ని గానీ, తనకు వ్యతిరేక పాలక పక్షాలను గానీ బిజెపి సహించలేకపోతుంది అనే ఆరోపణ ఉంది? ప్రజాస్వామ్య భావన పలుసందర్భాల్లో అపహాస్యం చేయబడింది? దేశంలో కీలకమైన రైతులు, కార్మికుల విషయంలో కూడా తెచ్చిన చట్టాలు తమ భావజాలానికి కనుగుణంగా ఉండడం, చివరకు రైతుల దీర్ఘకాలిక ఉద్యమానికి బిజెపి నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం తలవంచక తప్పని స్థితి వచ్చింది. ఆశ్రిత పెట్టుబడిదారి వర్గాన్ని ప్రోత్సహిస్తూ వాటి వాటాల కొనుగోలు ద్వారా మీడియా సంస్థలను నియంత్రణ చేసే స్థాయికి బిజెపి చేరుకుందనే విమర్శలు ఉన్నాయి. బిజెపి ప్రాంతీయ పార్టీలను తన రాజకీయ క్రీడలో పావులుగా చేసుకొని 2024 ఎన్నికల్లో సైతం తన పాత మిత్రులు చంద్రబాబు, నితీష్ కుమార్‌లను దగ్గర చేసుకొని స్వల్ప మెజారిటీతో అధికారం మూడవసారి చేపట్టింది. మూడుసార్లు ఢిల్లీ సిఎంగా పని చేసిన కేజ్రీవాల్‌ను తీవ్రవాదుల మద్దతుదారుగా, ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీని అర్బన్ నక్సలైట్ గా ముద్రవేయడం ప్రతిపక్షాలను సహించలేని అసహనం నుండి ఉద్భవించిన విమర్శలే!
ఎన్. తిర్మల్
94418 64514