Saturday, January 4, 2025

బిలియనీర్ల గుప్పెట్లో ప్రజాస్వామ్యం

- Advertisement -
- Advertisement -

అదుపులేని సంపదతో ఆధిపత్యం చెలాయిస్తున్న ప్రపంచంలో ప్రజాస్వామ్య వ్యవస్థలు కొదిమంది బిలియనీర్ల ముందు సాగిలపడటం, వారి గుప్పెట్లో ‘ఆర్ధిక నిరంకుశత్వం’ కొనసాగడం ఆందోళన కలిగిస్తున్నది. కేవలం తమ అక్రమ సంపదకు రక్షణ కవచంగా మొత్తం ప్రజాస్వామ్య వ్యవస్థను తమ గుప్పెట్లో చీకించుకుంటున్న కొద్ది మంది బిలియనీర్ల వ్యవహారశైలి నిరంకుశ వ్యవస్థల అధినేతల కన్నా ప్రమాదకరంగా మారుతున్నది. ప్రజాస్వామ్యం, సామ్రాజ్యవాదం కూడలిలో ఒక వ్యక్తి స్థిరంగా న్యాయం, సమానత్వం కోసం తన స్వరం వినిపించగలగడం ఆశ్చర్యకరమే.అమెరికా సెనేట్‌లో తన మూడవ పదవీకాలం గడుపుతూ, అమెరికన్ కాంగ్రెస్ చరిత్రలో ఎక్కువ కాలం పనిచేసిన స్వతంత్ర సెనేటర్ బెర్నీ సాండర్స్ ఆర్థిక అసమానత, రాజకీయ అవినీతికి వ్యతిరేకంగా పోరాటానికి పర్యాయపదంగా నిలుస్తున్నారు.

‘చాలా తక్కువ సంఖ్యలో ధనవంతులైన బిలియనీర్లు ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ఎక్కువ భాగాన్ని కలిగి ఉన్నారు. దానిని నియంత్రిస్తున్నారు’ అంటూ ప్రస్తుత పరిణామాలపై ఆయన ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 2020 నుంచి ప్రపంచవ్యాప్తంగా ఐదు బిలియన్ల మంది పేదలుగా మారగా, అదే సమయంలో ప్రపంచంలోని ఐదుగురు ధనవంతులైన బిలియనీర్లు తమ సంపదను రెట్టింపు చేసుకున్నారని ఆయన గుర్తుచేశారు. ఆయన ప్రకారం, ఈ బిలియనీర్లు ప్రతి గంటకు ఊహించలేని రేటుతో $14 మిలియన్ల సంపదను సేకరిస్తున్నారు. ప్రపంచంలోని అత్యంత ధనవంతుడైన ఎలోన్ మస్క్, కొన్ని నెలల్లోనే తన సంపదకు గత అమెరికా ఎన్నికల అనంతరం $120 బిలియన్లను జోడించాడు. సాండర్స్ స్పష్టమైన ఆగ్రహంతో ‘ఈ సంపద దొరికిందా?’ అని ప్రశ్నించారు. రెండవ ధనవంతుడైన జెఫ్ బెజోస్ కూడా వెనుకబడి లేడు. అదే కాలంలో అతని సంపద $67 బిలియన్లు పెరిగింది.

మరో ఆందోళనకర పరిణామం దారుణంగా జరుగుతున్న పన్నుల ఎగవేత. పలు నివేదికలను ఉటంకిస్తూ, కేమన్ దీవులు వంటి ఆఫ్‌షోర్ పన్ను స్వర్గధామాలలో $32 ట్రిలియన్ల వరకు ఇటువంటి సంపన్నులు నిల్వ చేశారని, ఉద్దేశపూర్వకంగా తమ న్యాయమైన పన్నుల వాటాను చెల్లించకుండా తప్పించుకుంటున్నారని ఆయన ఆరోపించారు. ‘వేరే మాటల్లో చెప్పాలంటే, ప్రభుత్వాలకు నిధులు తక్కువగా చేస్తూ, ఈ వ్యక్తులు పన్ను స్వర్గధామాలలో ట్రిలియన్ల కొద్దీ దాచిపెట్టారు’ అని సాండర్స్ స్పష్టం చేశారు. ‘మా (అమెరికా) ఇటీవలి ఎన్నికలను కొనుగోలు చేయడానికి కేవలం 150 మంది బిలియనీర్ కుటుంబాలు దాదాపు $2 బిలియన్లు ఖర్చు చేశాయి’ అని సాండర్స్ తెలిపారు. ఈ సందర్భంగా డొనాల్డ్ ట్రంప్‌కు మద్దతుగా ఎలోన్ మస్క్ $277 మిలియన్లు ఖర్చు చేసిన మొత్తాన్ని సాండర్స్ ‘పెట్టుబడి’ అని పిలిచారు.

ఇది మస్క్ తన ప్రయోజనాల కోసం చెల్లించిన మొత్తంగా అభివర్ణించారు. రక్షణ కాంట్రాక్టర్లు కూడా ఈ వ్యవస్థలో భాగస్వాములు అని సాండర్స్ ఆరోపించారు. ఎన్నికల చక్రంలో $38 మిలియన్లు ఖర్చు చేసిన ఈ కార్పొరేషన్లు ఇప్పుడు ట్రిలియన్ డాలర్ల సైనిక బడ్జెట్ నుండి ప్రయోజనం పొందేందుకు సిద్ధంగా ఉన్నాయి. సాండర్స్ ప్రకారం, ఈ బడ్జెట్ వ్యర్థాలు, మోసాలతో నిండి ఉంది. ప్రజలకు జవాబుదారీతనం కంటే కొంతమందికి లాభాలకు ప్రాధాన్యత ఇస్తుంది.‘ఇది ప్రజాస్వామ్యం కాదు అని సాండర్స్ ప్రకటించారు. ఇది ఒక వ్యక్తి, ఒక ఓటు కాదు. ఇది మనమందరం కలిసి మన భవిష్యత్తును నిర్ణయించుకోవడం కాదు. ఇది ఒక సామ్రాజ్యవాదం అని ఆయన స్పష్టం చేశారు. భారతదేశంలో సైతం పరిస్థితులు అందుకు భిన్నంగా లేవు. మన ఆర్ధిక వ్యవస్థను ప్రపంచంలో ఐదవ పెద్ద ఆర్ధిక వ్యవస్థగా అభివృద్ధి చేశామని, మరో రెండు, మూడేళ్ళలో మూడో అతిపెద్ద ఆర్ధిక వ్యవస్థ కాబోతుందని ప్రధాని నరేంద్ర మోడీ గర్వంగా చెప్పుకుంటున్నారు. అదే సమయం లో గత ఐదేళ్లుగా 80 కోట్ల మంది పేదలకు రేషన్ బియ్యం ఉచితంగా ఇస్తున్నామని, మరో నాలుగేళ్లు ఇవ్వబోతున్నామని తన ఉదారతను చాటుకుంటున్నారు. అంటే సుమారు 60% మంది ప్రజలు తిండి గింజల కోసం ప్రభుత్వ దయాదాక్షిణ్యాలపై ఆధారపడుతున్నట్లు నిస్సిగ్గుగా చెప్పుకుంటున్నారు.

నూతన ఆర్థ్దిక సంస్కరణల అనంతరం గనులు వంటి సహజ వనరులు, విమానాశ్రయాలు, ఓడరేవులు వంటి భారీ మౌలిక సదుపాయాలు అన్ని కొద్దీ మంది బిలియనీర్ల హస్తగతం అయ్యాయి. కేవలం ఐదు శాతం మంది మాత్రమే తమ సంపదను పలు రెట్లు పెంచుకోగలుగుతున్నారు. కానీ సుమారు 80% మంది ప్రజల జీవితాలు అగమ్యగోచరంగా నిలుస్తున్నాయి. స్వాతంత్య్రం వచ్చిన కొత్తలో 1950 తర్వాత సుమారు 70% మంది వరకు వ్యవసాయ, గ్రామీణ ఆర్ధిక వ్యవస్థపై ఆధారపడుతూ మన జిడిపికి 59% వరకు సమకూరుస్తూ ఉండేవారు. అయితే నేడు వారి శాతం సుమారు 60 శాతం వరకు ఉన్నప్పటికీ వారి ఆదాయం మాత్రం జిడిపిలో 16 శాతానికి మించి లేదు. ఆ 16 శాతంలో కూడా నిఖార్సయిన వ్యవసాయం నుండి అందులో సగం 8% మాత్రమే. అంటే నేడు ప్రధాని చెబుతున్న మన ఆర్థికాభివృద్ధి అంత కొద్ది మందికి మాత్రమే పరిమితమవుతున్నది. అత్యధిక శాతం ప్రజలు దారిద్య్రంలో మగ్గుతున్నారు.

దేశ రాజధాని ఢిల్లీ సరిహద్దుల్లో మూడేళ్ళుగా రైతులు తమ డిమాండ్లపై ఆక్రందనలు చేస్తుంటే కనీసం వారితో చర్చలు జరిపేందుకు కూడా మన పాలకులకు తీరిక ఉండటం లేదు. మద్దతు ధరపై స్వయంగా ప్రధాన మంత్రి పార్లమెంట్ సాక్షిగా ఇచ్చినా హామీకి విలువలేకుండా పోయింది. రైతులను తీవ్రవాదులతో పోలుస్తూ ఆర్థిక నేరస్థులకు రాజమర్యాదలు చేస్తున్నారు. ప్రభుత్వ విధానాలను ఆర్థిక నేరస్థులే నిర్ణయించే ఓ విభ్రాంతికరమైన వ్యవస్థలు నేడు ప్రపంచంలో కొనసాగుతున్నాయి. ఇటువంటి పరిస్థితులు నేడు ప్రపంచంలో ప్రజాస్వామ్య వ్యవస్థల మనుగడను సవాల్ చేస్తున్నాయి. తాజాగా అమెరికాలో జరిగిన అధ్యక్ష ఎన్నికలను చూస్తే ప్రజాస్వామ్య వ్యవస్థపై అక్కడి యువతలో విశ్వాసం సన్నగిల్లుతున్న ఆందోళనకర పరిస్థితులు వెల్లడి అవుతున్నాయి. ప్రపంచంలో ప్రజాస్వామ్య దేశాలకు అండగా నిలబడుతూ వస్తున్న అమెరికా నేడు అన్ని దేశాలలోని ‘నిషేధిత’ ఉగ్రవాద, తీవ్రవాద, వేర్పాటువాద నేతలకు స్వర్గంగా మారుతుంది.

అక్కడి విశ్వవిద్యాలయాలలో వారు బహిరంగంగా కార్యకలాపాలు జరుపుతున్నారు. పైగా హింసాయుత చర్యలకు దిగుతున్నారు. డెమొక్రాటిక్ అభ్యర్థి ఓటమికి ఇటువంటి పరిస్థితులే ప్రధాన కారణంగా విశ్లేషకులు భావిస్తున్నారు. ఒకప్పుడు ప్రజాస్వామ్య వ్యవస్థలకు గట్టి మద్దతుదారునిగా నిలబడిన అమెరికా ఇప్పుడు నిరంకుశ వ్యవస్థలను సహించ గలగడమో లేదా అవసరమైతే మద్దతు ఇచ్చేందుకు సిద్ధపడటంలో చేయగలుగుతుంది. దురదృష్టవశాత్తు బైడెన్ పరిపాలన యుద్ధనేరాలకు ఇజ్రాయెల్‌ను జవాబుదారీగా చేయడం లో విఫలం కావడంతోపాటు ఆర్థిక రంగంలో సాధించిన విజయాలను సగటు అమెరికా ఓటరుకు స్పష్టమైన ప్రయోజనాలుగా అనువదించడంలో స్పష్టమైన అసమర్థత కారణంగా డెమొక్రాట్ల పాలనపై భ్రమను మరింత తీవ్రతరం చేశాయి. ట్రంప్ స్పష్టంగా జాత్యహంకార, స్త్రీ ద్వేషపూరిత, ‘అమెరికా ఫస్ట్’ వాక్చాతుర్యంపై దృష్టి సారించారు. 2020 ఎన్నికలలో పోలింగ్ శాతం అంత ఎక్కువగా లేనప్పటికీ, 2024 పోల్స్‌లో ట్రంప్ వాషింగ్టన్ డిసితో సహా దాదాపు 50 రాష్ట్రాలలో ఉపాధ్యక్షురాలు కమలా హారిస్‌పై గణనీయమైన శాతం ఓట్లను సాధించారు. అమెరికాలో ప్రజాస్వామ్యంపై విశ్వాసం క్షీణించడం, అంతర్జాతీయ వ్యవహారాలలో ట్రంప్ నేతృత్వంలో వాషింగ్టన్ నిష్క్రమణ ప్రభావం ప్రపంచ వ్యాప్తంగా ప్రజాస్వామ్య దేశాలపై పడే అవకాశం ఉంది.

‘అమెరికాలో ప్రజాస్వామ్య సూత్రాలపై బలహీనమైన నమ్మకం ప్రపంచవ్యాప్తంగా నిరంకుశ పాలనలకు ధైర్యంగా మారుస్తుంది. ముఖ్యంగా ఆసియాలో ప్రజాస్వామ్య సంస్థల స్థిరత్వాన్ని సవాలు చేస్తోంది. ఆసియా దేశాలు అభివృద్ధి చెందుతున్న ప్రపంచ శక్తి గతిశీలత, చైనా ప్రభావం పెరుగుతుండడంతో, బలమైన అమెరికా నాయకత్వం అదృశ్యమయ్యే బలమైన సంభావ్యత ప్రజాస్వామ్య పథాలకు ప్రమాదకరమైన వాతావరణాన్ని సృష్టిస్తుంది’ అని ప్రముఖ మానవ హక్కుల, ప్రజా స్వామ్య ఉద్యమ నాయకురాలు సూ సన్ ఆందోళన వ్యక్తం చేశారు. ఈ ప్రాంతంలో రక్షణ వ్యయం తగ్గించాలనే విధానాన్ని ట్రంప్ ప్రకటించడంతో తైవాన్, దక్షిణ కొరియాలతో అమెరికా సంబంధాలు ఆందోళనకరంగా మారే అవకాశాలు ఉన్నాయి. చైనా- అమెరికాల మధ్య సమనవ్య వేదికగా ఉంటూ వస్తున్న ఆసియన్ ఇప్పుడు చైనా వైపు మొగ్గు చూపే అవకాశం ఉంది. దక్షిణాసియాలో, ప్రజాస్వామ్యం, మానవ హక్కుల పట్ల ట్రంప్ ప్రదర్శించే నిర్లక్ష్యం అఫ్ఘానిస్తాన్‌లో తాలిబన్లకు ధైర్యం ఇస్తుంది. ఇటీవల దారుణమైన పాలన మార్పును సాధించిన బంగ్లాదేశ్ వంటి దేశాలకు సవాళ్లను కలిగిస్తుంది. ఆర్థికంగా, ముఖ్యంగా పాకిస్తాన్‌లో చైనా ప్రభావాన్ని నిరోధించడంపై ట్రంప్ దృష్టి భారత దేశానికి ప్రయోజనం చేకూర్చవచ్చు.

చలసాని నరేంద్ర
9849569050

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News