Tuesday, December 24, 2024

ఏంది ప్రజాస్వామ్యం గిట్లైంది?

- Advertisement -
- Advertisement -

ఇప్పుడు దేశంలో ప్రజాస్వామ్యం ఎవరికీ మునిపటిలా అర్థం కావడం లేదు. కుట్రలు, కుతంత్రాలు చేసుడు తప్ప కూర్చొని మాట్లాడుకొనుట లేదు. తిట్టుకొనుడు తప్ప ప్రజల కోసం ఐక్యతగా చర్చించడం లేదు. భారత దేశంపై విదేశీయులు దండయాత్రలు చేసినారు అని చిన్నప్పుడు విన్నాము. బడిలో సాంఘిక శాస్త్రం పాఠాలలో చదువుకున్నాము. కానీ ఇప్పుడు స్వదేశీ ప్రభుత్వాలే రాష్ట్ర ప్రభుత్వాలపై దాడులు చేస్తున్నాయి. దినదిన గండంగా రాష్ట్రాల పాలన సాగుతున్నట్లుగా ఉంది. విపక్ష ప్రభుత్వాలపై దుమ్మెత్తి పోస్తున్నాయి. తమ పార్టీ ప్రభుత్వాలున్న చోట ఎన్ని తప్పులు చేసినా మిన్నకుంటున్నాయి. మనవాడు కాకపోతే మట్టిలో కలిపేయండి అనే ధోరణి పెరిగింది. ఎన్ని సాకులు చెప్పినా 75 ఏళ్ళ భారతంలో ఇప్పుడు జరుగుతున్న సంఘటనలు వాటి వెనుక ఉన్న దురుద్దేశాలను తెలుసుకోలేనంత అమాయకులు ఎవరూ లేరు. అధికారం కోసం ప్రజలను అడ్డగోలుగా విడగొడుతున్నారు. ప్రజాభిమానం పక్కన పెట్టి ప్రలోభాలకు గురిచేసి లోపాయకారి ప్రక్రియలతో ప్రభుత్వాలను పడగొట్టడం ద్వారా దేశం మొత్తాన్ని తమ ఆధీనంలోకి తెచ్చుకొనుటకు దర్యాప్తు సంస్థలను వాడుకుంటున్నట్లు ప్రజలలో చర్చ జరుగుతున్నది.

భావప్రకటన స్వేచ్ఛను హరించి మతం ఆధిక్యత గల పాలనగా ఉండాలని అంతర్గత సందేశాలను తమ పార్టీ విభాగాలతో చెప్పిస్తున్నట్లు అనుమానం కలుగక మానదు. ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా, సామాజిక మాధ్యమాలు పెరిగి కొంత మంచి చెడులు క్షణాలలో ప్రజలకు చేరుతున్నాయి. ప్రతిపక్షాలకు నిలువ నీడ లేని చోట కొన్ని పత్రికలు అయినా ప్రజల పక్షాన ఉన్నందువల్ల కొంత సమాచారం బయటికి వస్తున్నది.ఎన్ని తప్పులు చేసినా తమ పార్టీలో చేరితే అన్ని మాఫీ చేస్తాము అన్నట్లుగా పాలక ప్రభుత్వాల చేష్టలు దేశమంతా గమనిస్తున్నది. దీనికి మీడియానే సాక్ష్యంగా ఉంది. డబ్బులు ఇస్తే తప్ప ఓట్లు వేయమనే స్థితికి ప్రజలు రావడం ఆందోళన కలిగిస్తుంది. ఇది రాజకీయ పార్టీల తప్పిదమే. ఇంత పెద్ద ప్రజాస్వామ్య దేశంలో క్యాష్ లెస్ పాలిటిక్స్ జరుపుటకు అన్ని రాజకీయ పార్టీలు ఉమ్మడి నిర్ణయాలు చేయకపోవడం విచారకరం. ఎన్నికలను నిర్వహించుటకు అతిపెద్ద నెట్‌వర్క్ కలిగిన భారత ఎన్నికల సంఘానికి నగదు రహిత పాలిటిక్స్ తేవడం పెద్ద కష్టమేమీ కాదు. కావాల్సింది సంకల్పం మాత్రమే.

మాజీ ప్రధాన ఎన్నికల కమిషనర్ టిఎన్ శేషన్ ప్రయత్నం కొంత ఫలించినా మరిన్ని అంశాలపై దృష్టి పెట్టాలి. దేశంలో ఎన్ని రాజకీయ పార్టీలైనా ఉండనివ్వండి కానీ ఉమ్మడి విషయాలపై మాత్రం దేశ స్థాయిలో ఒకే నిర్ణయం కలిగి ఉండాలి. మతం, పౌరసత్వం మొదలైన విషయాలపై ఒకే స్టాండ్ కలిగి ఉండాలి. పార్టీలతో చర్చల ద్వారా ఏకా భిప్రాయాన్ని రాబట్టాలి. ప్రజాస్వామ్యంలో ఆ మాత్రం చొరవ చేయకపోతే నియంతలకు మనకు తేడా ఉండదు. ఇక ఫిరాయింపుల తీరు చూస్తే ప్రపంచం ఛీ కొట్టే స్తాయిలో ఉన్నాయి, జుగుప్సాకరంగా ఉన్నాయి. దీనిపై దేశ స్థాయిలో నిర్ణయం జరగాలి. ఒక పార్టీ తరపున ఎన్నికైన వ్యక్తిని పదవీ కాలం చేయనివ్వాలి. ప్రలోభాలతో ఫిరాయింపులకు గురి చేయవద్దు. పార్టీల గౌరవాన్ని, అభిప్రాయాలను గౌరవించాలి. ఉప ఎన్నికల ప్రక్రియలు తీసుకురావద్దు. ప్రజాధనం వృథా చేయవద్దు. ప్రజాప్రతినిధుల కొనుగోలు వ్యవహారాలు భారత ప్రజాస్వామ్యాన్ని బలహీనపరుస్తున్నాయి.రేపటి తరానికి కొన్నైనా ఆదర్శాలు అందించాలి.
ప్రజాప్రతినిధుల స్థాయిని, గౌరవాన్ని పెంచేలా చర్యలు ఉండాలి. సభలలో పార్టీల తరపున ఒక్కరు ఉన్నా వారి స్వాభిమానం దెబ్బ తినకుండా ప్రాధాన్యత కల్పించాలి.

లాగేసుడు, కొనేసుడు చేయకూడదు. ఎన్నికల అనంతరం దామాషా ప్రకారం ప్రభుత్వంలో భాగస్వాములు కావడానికి అన్ని పార్టీలకు ఉన్న అవకాశాలను పరిశీలించాలి. ఎన్నికల వరకే రాజకీయాలు ఎన్నికల తర్వాత కలిసి పని చేయాలనే మాటలు వాస్తవ రూపం దాల్చాలి. అందరూ గొప్ప గొప్ప మాటలు చెబుతున్నారు. కానీ ఆచరణలో మాత్రం అర్థం పర్థంలేని విధానాలు అవలంబిస్తున్నారు. ఉన్నతమైన రాజకీయాలతో ప్రజలను ఆధునిక భారతం వైపు మళ్ళించాలి. ప్రస్తుతం దేశంలో రాజకీయాలు అధ్వానంగా ఉన్నాయి. ప్రజలు ఐక్యంగానే ఉన్నారు. రాజకీయాలే భరించలేని స్థాయిలో చెడిపోయాయి. పావలా లేనోడు ఫాం హౌస్ కట్టుడు, ఏకాణ లేనోడు వందల ఎకరాలు ఆక్రమించుడు చేస్తున్నారు. కోడిని తిన్నంత సులభంగా కోట్లు మింగడం, బువ్వ తిన్నంత సులభంగా భూములు గుంజుడు చేస్తున్నారు. ఇలాంటి పనులు రాజకీయ విలువలను తగ్గిస్తున్నాయి. నేటి యువతరం వీటిని ఏవగించుకుంటున్నాయి. రాజకీయ వ్యవస్థ ఇంత బరితెగించిన విధంగా ప్రవర్తిస్తే రేపటి తరం ఎలా ముందుకుపోతుంది.

ఏ ఆదర్శాలను స్వీకరిస్తుంది అనేది దేశ నాయకులు ఆలోచించాలి. అధికార, ప్రతిపక్షం అన్నీ కలిస్తేనే ప్రజాస్వామ్యం.వ్యవస్థ ఇంకా కుళ్ళిపోక ముందే జాతీయ నాయకత్వాలు గుణాత్మకమైన మార్పుల వైపు అడుగులు వేయాలి.ప్రస్తుతం దేశంలో ఏ ఒక్క రాజకీయ పార్టీ కూడా ప్రజాస్వామ్య సోయితో పని చేయడం లేదు. చెడగొట్టడానికి అన్నిటికీ భాగస్వామ్యం ఉన్నట్లే, బాగు చేయడానికి కూడా అన్నిటికీ పాత్ర ఉంటది.పోటీలు పడి విగ్రహాలు పెట్టుడు, ఎత్తు పెంచుకుండు చేస్తున్నారు. దేశంలో రెండు పూటలా తిండి లేని ప్రజలు ఎందరో ఉన్నారు. కనీస స్థాయిలో మెరుగైన వైద్యం అందని నిరుపేదలకు సౌకర్యాలు కల్పించుటకు పాలకులకు చేతులు రావడం లేదు. మంచి పొలిటిషన్ అనే ముద్ర పడాలంటే ప్రజలకు మంచి చేయాలి. స్వాతంత్య్రోద్యమ కాలపు దేశ నాయకులను అందరి వాళ్ళు అనుకోవాలి.

ఎవరికి వాళ్ళు కొందరిని సొంతం చేసుకుని మిగతావారు మా వాళ్లు కాదన్నట్లు ప్రవర్తించడం మంచిది కాదు. దేశ ప్రజలకు వారి పట్ల వివక్ష లేదు. కానీ నాయకులే స్వార్థంతో వ్యవహరిస్తున్నారు. సంక్షేమంపై పొదుపు, ఆర్థిక విషయాలపై అదుపు లేకుండా రాజకీయాలు చేస్తున్నారు. వంద లక్షల కోట్ల అప్పు కేంద్ర స్థాయిలో ఉంటే, కొన్ని లక్షల కోట్ల అప్పులు రాష్ట్రాలు కలిగి ఉన్నాయి అని అప్పుడప్పుడు మీడియాలో కథనాలు వస్తున్నాయి. పార్టీలు పరస్పరం నిందించుకుంటూ ఒకరిపై ఒకరు అరుస్తున్నారు. అప్పు అనేది అందమైనదేమీ కాదు. అది చూపెట్టే అభివృద్ధి కంటే పతనం అయ్యేలా చేసేదే ఎక్కువ. దీనిపై ఆధారపడితే కుటుంబాలు నాశనమైనట్లే రాష్ట్రాలు, దేశాలు కూడా అదే పరిస్థితిని ఎదుర్కొంటాయి. ప్రజలను సాదడానికే ఇవన్నీ చేస్తున్నట్లు నటిస్తున్నారు.

జీతాలకు కూడా అప్పులు చేయాల్సిన పరిస్థితి కల్పిస్తున్నారు. భూములు అమ్ముతున్నారు అంటేనే పతనం అంచుకు చేరుకున్నట్లు అనుకోవాలి. ఆదాయ వ్యయాల మాటలు గొప్పలు చెప్పడానికే సరిపోతుంది. ఇప్పటికైనా అందరూ మారాలి. రాజ్యాంగం బాగానే ఉంది. అందులో ఉన్న లోటు పాట్ల కంటే రాజకీయ నాయకులు చేస్తున్న తప్పులు ఎక్కువగా ఉన్నవి. దేశం బాగుపడుతుంది, దేశం దూసుకుపోతుంది అని ఒక వైపు గొప్పలు చెబుతున్నారు. కానీ రాజకీయాలను మాత్రం అదే తీరుగా బాగున్నాయని అనే చెప్పేసే పరిస్థితి లేకపోవడం బాధాకరం.

సరిహద్దులను సాకుగా చూపి దేశాన్ని కట్టడి చేయవచ్చు కానీ ఐక్యతగా ఉంచలేరు. ప్రజల జీవన ప్రమాణాలు పెరిగితేనే నాయకులను గౌరవిస్తారు. పగలు, పంతాలతో చేసే రాజకీయాలు అంతమైతేనే వ్యవస్థలో మంచి మార్పు కనిపిస్తుంది. దేశ జాతి పితను కూడా గౌరవించలేని స్థితికి కొన్ని పార్టీలు చేరాయి. గాడ్సే ఆదర్శం అన్నవాళ్ళను పార్టీలలో కొనసాగిస్తూ ఇతరులకు మాత్రం నీతులు చెబుతున్నారు.
లిక్కర్ స్కాం పెద్దదైనట్లు, అదానీ దోపిడీ చిన్నది అయినట్లు దేశ నాయకులు చూపెడుచున్నారు. సరైన సమాధానాలు ఇవ్వలేని పాలకుల నైజాన్ని ప్రజలు జాగ్రత్తగా గమనించాలి.

70 ఏండ్లు పాలించిన పార్టీ డ్బ్బై మంచి పనులు చేస్తే, మిగతా ముప్పై మంచి పనులు చేసే అవకాశం నేటి పాలకులకు వచ్చిందని గుర్తు పెట్టుకుంటే మంచిది. ఏ ఒక్కటి మంచి చేయలేదనే విష ప్రచారం చేస్తే అది తాత్కాలిక ఆనందాన్ని మాత్రమే ఇస్తుంది. దీర్ఘ కాలంలో చేటు చేస్తుంది. బ్యాంకుల జాతీయం, అత్యున్నత విద్యా సంస్థలు నెలకొల్పడం, ప్రభుత్వరంగ సంస్థల ఏర్పాటు, ప్రాజెక్టులు, నీటి వసతులు, ఇండ్ల నిర్మాణం, ఉపాధి హామీ పనులు మొదలైనవి గత పాలకులు దీర్ఘదృష్టితో చేసినవే. ఇప్పుడు అమ్మకంలో పెడుతూ తమ అనుయాయులకు అంటగట్టడంలో ముందున్నదెవరో ప్రజలు ఇప్పటికే తెలుసుకున్నారు. ఇప్పటి వరకు ప్రజలు సెక్యులరిజం భావజాలంతో భద్రంగా ఉన్నామని అనుకునేవారు. ఇప్పుడు అది ప్రమాదంలో పడినట్లు అనుకుంటున్నారు. కళ్ళ ముందు అనేక ఉదంతాలు కనిపించకుండాపోవు. విచ్చలవిడి స్వేచ్ఛను ఎవరూ హర్షించరు. కానీ ఉద్దేశపూర్వక దాడులను సమర్థించే మనస్తత్వం పెరిగితే అది పెను ప్రమాదాన్ని ముందుకు తెస్తది.

జోగు అంజయ్య, 8008957480

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News