ప్రజాస్వామ్యార్థం జాతీయ ధర్మార్పణం (నేషనల్ ఎండోమెంట్ ఫర్ డెమోక్రసీ – ఎన్.ఇ.డి.) అమెరికా ప్రభుత్వ నిధులతో ప్రైవేట్లు నడిపే సంస్థ. రాజకీయ- వ్యాపార సమూహాలు, కార్మిక సంఘాలు, స్వేచ్ఛా మార్కెట్లు వగైరా ప్రజాస్వామ్య సంస్థల ద్వారా ఇతర దేశాల్లో ప్రజాస్వామ్యాన్ని ప్రోత్సహించడానికి 1983 లో స్థాపించబడింది. ఎన్.ఇ.డి.కి అమెరికా నిధులు ఇస్తుంది. జర్నల్ ఆఫ్ డెమోక్రసి, వరల్డ్ మూవ్‌మెంట్ ఫర్ డెమోక్రసి, ఇంటర్నేషనల్ ఫోరం ఫర్ డెమోక్రసి, రీగన్- ఫాసెల్ ఫెలోషిప్ ప్రోగ్రాం, డెమోక్రసి రీసర్చ్ ఇన్‌స్టిట్యూట్స్, సెంటర్ ఫర్ ఇంటర్నేషనల్ మీడియా అసిస్టెన్స్ వంటి అమెరికా పక్షపాత సంస్థల స్థాపన, నిధులు, వసతులకు సాయపడుతుంది. ప్రపంచ వ్యాప్తంగా రాజకీయ గుంపులచే, ప్రభుత్వాలచే అమెరికా సిద్ధాంతాలు, ప్రయోజనాలను అనుసరించి పాలన, విదేశాంగ విధానం, పాలకుల మార్పులకు సాధనంగా పనిచేస్తుంది. గతంలో సిఐఎ చేసిన పనులను స్వాధీనం చేసుకుంది.
అమెరికా రహస్య సేవల సంస్థ, సిఐఎ విదేశ సమస్యలనుఅమెరికన్ పొలిటికల్ ఫౌండేషన్ పరిష్కరిస్తుంది. ఈ ఫౌండేషన్ ప్రణాళికలతో సోవియట్ బ్లాక్‌లోని అసమ్మతి సమూహాలకు మద్దతు ఇవ్వడం, సోవియట్ బ్లాక్‌ను అస్థిరపరచడం, అమెరికా నియంతృత్వ ఉద్యమాలను ప్రోత్సహించడం, అమెరికా వ్యతిరేకతను ప్రేరేపించకుండా, వామపక్ష ఉద్యమాలను ఎదుర్కొనడం, ప్రైవేట్ రంగంతో ప్రజాస్వామ్య సంస్థల మార్పును, ప్రైవేట్ భాగస్వామ్యాన్ని ప్రోత్సహించడం, విదేశాల్లో సాంస్కృతిక విలువలను, ఎన్నికలను, ప్రభావితం చేయడం, అమెరికన్ కార్పొరేట్ల మధ్య సహకారాన్ని పెంచడం ఎన్.ఇ.డి. లక్ష్యాలు. అసమ్మతివాదులు, ప్రతిపక్షాలు, సంఘాలు, నిరంకుశవాదులకు, 1980లలో ఎన్.ఇ.డి. నిధులు సమకూర్చింది. ఈ నిధుల నిష్పత్తి 1986లో 20%, 2009లో 60% పెరిగింది. నేడు 90 దేశాల్లో ఎన్.ఐ.డి. కార్యక్రమాలు అమలవుతున్నాయి. అమెరికన్ రాజకీయ శాస్త్రవేత్త సారా బుష్ అన్నారు. ఎన్.ఇ.డి. అభివృద్ధి చెందుతున్న దేశాల్లో సోషల్, డిజిటల్ మీడియాలు, పౌర పాత్రికేయతలను ప్రభావితం చేస్తుంది.
2011లోఅరబ్ స్ప్రింగ్‌కు, యువత ఉద్యమానికి, బహ్రెయిన్ సెంటర్ ఫర్ హ్యూమన్ రైట్స్, యెమెన్ కార్యకర్తలకు ఎన్.ఇ.డి. శిక్షణ, ఆర్థిక సహాయం, మద్దతు అందించింది. ఈజిప్టులో 2008- 12 మధ్య అధ్యక్షులు హోస్ని ముబారక్, మహమ్మద్ మోర్సిలను, లౌకికవాద కార్యకర్త ఎస్రా అబ్దెల్ ఫతాహ్‌ను వ్యతిరేకించిన బహిష్కృత పోలీ సు అధికారి కల్నల్ ఒమర్ అఫీఫీ సోలిమాన్‌కు కూడా మద్దతు ఇచ్చింది. 2004 నుండి ఉయ్ఘర్ గ్రూపులకు, చైనీస్ అసమ్మతివాదులకు ఊతమిచ్చింది. భారీ ఆర్థిక సాయం అందించింది. 2005 -12 మధ్య చైనా ప్రభుత్వేతర సంస్థ ఫ్రీ ప్రెస్కు, 2019 లో హాంకాంగ్ పౌర సమాజ కార్యక్రమాలకు భారీగా నిధులు ఇచ్చింది. 90 దేశాల్లో ప్రైవేట్ సంస్థలకు ప్రతి ఏడాదీ నిధులను పంపిణీ చేస్తుంది. ప్రపంచ వ్యాప్తంగా మానవ హక్కులు, ప్రజాస్వామ్యం కోసం పని చేసిన వ్యక్తుల, సంస్థల సాహసోపేత సృజనాత్మక పనికి గుర్తింపుగా ఎన్.ఇ.డి. ప్రతి ఏటా డెమోక్రసి అవార్డును ఇస్తుంది. 1989 తియనాన్మెన్ స్క్వేర్ నిరసనల్లో నిర్మించబడ్డ ప్రజాస్వామ్య దేవత ఈ అవార్డు ట్రోఫీ ప్రతిరూపం. ఈ అవార్డులను అమెరికాశత్రు దేశాల్లో ప్రభుత్వ వ్యతిరేక ఉద్యమాలు నడిపిన నాయకులకు ఇచ్చారు.
ఎన్.ఇ.డి. లాభాపేక్షలేని స్వేచ్ఛా సంస్థగా ప్రచారం చేసుకుంది. ప్రపంచ వ్యవహారాల్లో సైద్ధాంతికంగా జోక్యం చేసుకుంటుంది. తన అనుబంధ సంస్థల ద్వారా అమెరికా అనుకూల అజెండాను అమలు చేస్తుంది. ఎన్.ఇ.డి. ప్రచ్ఛన్న యుద్ధ రాజకీయ మితవాద- సహాయ సంస్థ అని, లాటిన్ అమెరికాలో అమెరికా సామ్రాజ్యవాదాన్ని ఆచరిస్తోందని విమర్శలున్నాయి. సోవియట్ యూనియన్ చివరి రోజుల్లో గోర్బచెవ్‌కు మద్దతు ఇచ్చిందని, అభివృద్ధిచెందుతున్న దేశాల్లో ప్రజాస్వామ్య సంస్థల సమర్థతను పెంచే నిగూఢ లక్ష్యంతో ఏర్పడ్డ నేషనల్ డెమొక్రాటిక్ ఇన్‌స్టిట్యూట్ (ఎన్‌డిఐ)తో కలిసిందని, విభిన్న రాజకీయ సంస్కృతుల అవసరాలు, సంప్రదాయాల ప్రకారం ప్రజాస్వామ్యం అభివృద్ధి చెందుతుందని, అమెరికన్ శైలిఎన్.ఇ.డి. అవసరంలేదని గోర్బచేవ్ ప్రత్యర్థులు బహిరంగంగా ప్రకటించారు. ప్రపంచ ప్రజాస్వామ్య సంస్థలను సిఐఎ అనుబంధాలుగా అనుమానిస్తున్నారు. ఎన్.ఇ.డి. సృష్టి రహస్యం నుండి బహిరంగానికి వెళ్లే ప్రయత్నం అని పరిశోధన స్వచ్ఛంద పత్రిక ప్రోపబ్లికనాటి ముఖ్య సంపాదకుడు పాల్ స్టీగర్, ఎన్.ఇ.డి. అధ్యక్షుడు కార్ల్ గెర్ష్‌మాన్‌అంగీకరించారు.
ఈ రోజు మనం చేసే చాలా పనులు 25 ఏళ్ల క్రితం సిఐఎ రహస్యంగా చేసిందని ఎన్.ఇ.డి. అధ్యక్షుడు అన్నారు. నికరాగ్వా, చిలీలలో అమెరికా అనుకూల సమూహాలు, అమెరికా సంప్రదాయవాద సంఘాలు, రాజకీయ పార్టీలు, వ్యాపార సమూహాలు, విద్యార్థి మహిళా సంఘాలకు ఎన్.ఇ.డి. నిధులను అందించారు. అమెరికా అనుకూల వర్గాలకు నాయకత్వ శిక్షణ అమెరికా అనుకూల విద్యా సంస్థలకు, సామాజిక మాధ్యమాలకు, లక్షిత దేశాల వ్యతిరేక ప్రచారాలకు ప్రోత్సాహం, ట్రాన్స్‌నేషనల్ నెట్‌వర్క్‌ల అభివృద్ధిలో అమెరికా అనుకూల సంస్థలకు నిధులు సమకూర్చింది ఎన్.ఇ.డి. చిలీ, హైతీ, లైబీరియా, నికరాగ్వా, పనామా, ఫిలిప్పీన్స్, పోలండ్, సురినామ్‌లలో ప్రజాస్వామ్య విధాన మార్పుల్లో, కమ్యూనిస్టు, సోషలిస్టు ప్రతిపక్ష పార్టీలకు వ్యతిరేకంగా అమెరికా అనుకూల పార్టీల విజయాన్ని ప్రోత్సహించడంలో ఎన్.ఇ.డి. కీలక పాత్ర పోషించిందని రాజకీయ శాస్త్రవేత్త లిండ్సే రాశారు. 2020 థాయ్ నిరసనలలో అమెరికా సూత్రధారి.
2015లో ఉక్రెయిన్ అధ్యక్షుడు విక్టర్ యనుకోవిచ్‌ను అధికారానికి దూరం చేసిన యూరో మైడాన్ నిరసనకు ఎన్.ఇ.డి. నిధులు అందించిందని రష్యన్ ప్రభుత్వ వార్తా సంస్థ ఆర్.ఐ.ఎ. నొవోస్టి నిందించింది. రష్యన్ ప్రభుత్వం ఎన్.ఇ.డి.ని అవాంఛనీయ ప్రభుత్వేతర సంస్థగా ప్రకటించింది. 2019- 20 హాంకాంగ్ నిరసనలను రహస్యంగా ప్రేరేపించడానికి ఎన్.ఇ.డి., సిఐఎ కలిసి పని చేశాయని, హాంకాంగ్ స్వాతంత్య్రం పేరుతో వేర్పాటువాద కార్యకలాపాలను ప్రేరేపించాయని చైనా ప్రభుత్వం పేర్కొంది. హడ్సన్ ఇన్‌స్టిట్యూట్ విదేశాంగ విధాన విశ్లేషకుడు, పూర్వ రీగన్ పరిపాలనాధికారి మైఖేల్ పిల్స్‌బరి చైనీస్ ఆరోపణ పూర్తిగా అబద్ధం కాదని పేర్కొన్నారు. మే 2022లో చైనా విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖఎన్.ఇ.డి. పై ప్రచురించిన వాస్తవ పత్రంలో, లక్షిత దేశాలను అస్థిరపర్చడం, వేర్పాటువాదులకు నిధులు ఇవ్వడం, రాజ్యాధికారాల అణచివేతకు విప్లవాలను ప్రేరేపించడం, రాజకీయ జోక్యం వంటి ఆరోపణలు చేసింది.
ఇతర దేశాల రాజకీయాల్లో ఎన్.ఇ.డి. కార్యకలాపాలపై ఈజిప్ట్, ఇండియా, వెనిజులా అభ్యంతరం తెలిపాయి. అమెరికా ప్రభుత్వాలు సార్వభౌమ దేశాల రాజకీయ క్రమాన్ని అణచడానికి, వారి అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకోడానికి ఎన్.ఇ.డి.ని ఉపయోగిస్తాయి. అది అమెరికా విదేశాంగ విధాన సాధనం. లాటిన్ అమెరికాలో తిరుగుబాట్లు, ఐరోపా, ఆఫ్రికాలలో రంగు విప్లవాలుగా పిలవబడే అనేక తిరుగుబాట్లలో ఎన్.ఇ.డి. పని చేసింది. అని క్యూబా మేధావి, హవానా విశ్వవిద్యాలయం, ప్రపంచ ఆర్థిక పరిశోధన కేంద్రంలో విద్యావేత్త లూయిస్ రెనే ఫెర్నాండెజ్ అన్నారు.ప్రపంచ వ్యాప్తంగా ప్రజాస్వామ్యం, మానవ హక్కుల పరిరక్షణకు ఎన్.ఇ.డి. వేదిక అని అమెరికా అబద్ధాలు చెబుతోంది. నిజానికి ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ప్రభుత్వాలను స్వాధీనపర్చుకునేందుకు అమెరికా కార్యక్రమాల అమలుకు ఎన్.ఇ.డి. వేదిక.
సంగిరెడ్డి హనుమంత రెడ్డి- 9490204545