Wednesday, December 25, 2024

దేశంలో ప్రజాస్వామ్యం ప్రమాదంలో ఉంది : చిదంబరం

- Advertisement -
- Advertisement -

మోడీ ప్రభుత్వంలో మైనార్టీలు భయంతో జీవిస్తున్నారు
ప్రజాస్వామ్యం ప్రజలకు రక్షణ కవచం లాంటిది

మనతెలంగాణ/హైదరాబాద్:  ప్రస్తుతం దేశంలో క్రైస్తవులు ఫైనాన్షియల్‌గా ఇబ్బంది పడుతున్నారని, దేశంలో ప్రజాస్వామ్యం ప్రమాదంలో ఉందని కాంగ్రెస్ కీలక నేత, మాజీ కేంద్ర మంత్రి చిదంబరం పేర్కొన్నారు. ముఖ్యంగా దేశంలో మతపరమైన స్వేచ్ఛ అణిచివేయబడిందని ఆయన గుర్తుచేశారు. మోడీ ప్రభుత్వంలో మైనార్టీలు భయంతో జీవిస్తున్నారని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రజాస్వామ్యం అనేది ప్రజలకు రక్షణ కవచం లాంటిదని, దానిని అందరూ కాపాడుకోవాలని ఆయన పిలుపునిచ్చారు.

దేశంలో 3.30 కోట్లు క్రిస్టియన్లు ఉండగా,  కేంద్ర ప్రభుత్వంలో కేవలం ఒకే ఒక్క క్రిస్టియన్ మంత్రి ఉన్నారని చిదంబరం పేర్కొన్నారు. శనివారం హైదరాబాద్‌లోని సికింద్రాబాద్‌లో జరిగిన క్రైస్తవ హక్కుల సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా చిదంబరం మాట్లాడుతూ తనకు తెలుగు రాకున్నా 10,12 ఏళ్ల క్రితం తెలంగాణ గురించి మాట్లాడుతుంటే అర్ధమయ్యేదని, సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చారని, కానీ, కాంగ్రెస్ అధికారంలోకి రాలేదని ఆయన తెలిపారు. రాష్ట్ర విభజన జరిగిన వెంటనే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ఉంటే రాష్ట్ర పరిస్థితి ఇప్పుడు వేరేగా ఉండేదన్నారు. ఎంతో అభివృద్ధి జరిగి ఉండేదని ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్ లో  సిడబ్ల్యూసి సమావేశం జరిగిందని ఇలాంటి మీటింగ్ నా జీవితంలో చూడలేదన్నారు. ఈ మీటింగ్ సమయంలో జరిగిన ర్యాలీ తనను బాగా ఆకర్శించిందన్నారు. సోనియా సభలో 45 శాతం 25 ఏళ్ల యువకులు ఉన్నారని, ఈ సభ చూశాక, తెలంగాణలో మార్పు తథ్యమని అర్ధమయ్యిందన్నారు.

మైనారిటీలకు కాంగ్రెస్ అండగా ఉంటుంది: రేవంత్‌రెడ్డి
టిపిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి మాట్లాడుతూ పేద ప్రజల సంక్షేమం కోసం ప్రభుత్వం పనిచేయాలని ఆయన సూచించారు. కానీ, ప్రభుత్వాన్ని చూసి ప్రజలు భయపడే పరిస్థితి దేశంలో దాపురించిందన్నారు. మైనారిటీలకు కాంగ్రెస్ అండగా ఉంటుందన్నారు. క్రిస్టియన్ మైనారిటీల కోసం వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తామన్నారు. వారి డిమాండ్లను అమలు చేయాలంటే కాంగ్రెస్ అధికారంలోకి రావాలని ఆయన సూచించారు. కర్ణాటకలో మైనారిటీలు కాంగ్రెస్ వైపు నిలబడ్డారని రేవంత్ పేర్కొన్నారు. అందుకే అక్కడ మైనారిటీల సంక్షేమం కోరే ప్రభుత్వం ఏర్పడిందన్నారు. తెలంగాణలోనూ మైనారిటీలు కాంగ్రెస్‌కు అండగా నిలవాలన్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News