Wednesday, January 22, 2025

ఇవేనా మన ప్రజాస్వామ్య మూలాలు?

- Advertisement -
- Advertisement -

‘భారతీయుల డిఎన్‌ఎలోనే ప్రజాస్వామ్యం ఉంది’ అని ప్రధాని నరేంద్ర మోడీ అమెరికా అధ్యక్ష భవనం వైట్‌హౌస్ నుంచి ప్రకటించి ఏడాది కూడా కాలేదు. ‘ప్రజాస్వామ్యానికి భారత దేశం మాతృక” అని తరుచూ ఆయన అంటుంటారు. ఇందుకు భిన్నం గా భారత దేశంలో పత్రికా స్వేచ్ఛ 2015 నుంచి దిగజారుతూ వస్తోంది. గత ఏడాది పత్రికా సేచ్ఛలో భారత దేశ స్థాయి 180 దేశాల్లో 161వ స్థానానికి దిగజారిందని సర్వే గణాంకాలు చెపుతున్నాయి. రాజ్యాంగం కల్పించిన భావప్రకటనా స్వేచ్ఛను నరేంద్ర మోడీ నాయకత్వంలోని బిజెపి ప్రభుత్వం అడుగడుగునా అణచివేస్తోందనడానికి ఈ నెల 3వ తేదీ దేశ రాజధాని ఢిల్లీలోని ఆన్‌లైన్ న్యూస్ వెబ్ సైట్ ‘న్యూస్‌క్లిక్’ కార్యాలయంపైన, జర్నలిస్టులపైన ఢిల్లీ పోలీసులు చేసిన దాడి తాజా ఉదాహరణ.
సహజంగా టెర్రరిస్టు దాడులుచేసే ఢిల్లీ పోలీసుల్లోని స్పెషల్ సెల్ విభాగం వారు ‘న్యూస్‌క్లిక్’ కార్యాలయంపై మంగళవారం మధ్యాహ్నం 3 గంటల సమయంలో దాడి చేశారు. ‘న్యూస్‌క్లిక్’ తో ప్రత్యక్షంగా, పరోక్షంగా వృత్తిపరమైన సంబంధాలున్న సీనియర్ జర్నలిస్టులు, కంట్రిబ్యూటర్లు, ఆర్టిస్టులు, కాలమిస్టులు, యాంకర్లు.

కళాకారులు వంటి 46 మంది ఇళ్ళపైన కూడా దాడులు చేశారు. వీరిలో తొమ్మిది మంది మహిళలు కూడా ఉన్నారు. వీరి నుంచి ల్యాబ్ టాబ్‌లు, సెల్‌ఫోన్లు, హార్డ్ డిస్క్‌లు, ఎలక్ట్రానిక్ డివైస్‌లను స్వాధీనం చేసుకున్నారు. వీటిని స్వాధీనం చేసుకున్నప్పుడు తాము స్వాధీనం చేసుకున్న వాటి గురించి ఎలాంటి మెమో ఇవ్వలేదు. వీరందరినీ ఢిల్లీ లోధీ కాలనీలోకి తీసుకెళ్ళి పది గంటలపైగా విచారించారు. ‘న్యూస్‌క్లిక్’ వ్యవస్థాపక ఎడిటర్ ప్రబీర్ పురకస్థ్యను, హెచ్‌ఆర్ డైరెక్టర్ అమిత్ చక్రవర్తిని చట్టవ్యతిరేక చర్యల నిరోధక చట్టం ‘ఉపా’ కింద అరెస్టు చేశారు.టెర్రరిస్టులపైన పెట్టే కేసులు పెట్టి, వీరిని నిర్బంధించడం పట్ల పత్రికారంగ ప్రముఖులే కాదు, ఇతర మేధావులు కూడా ఖండిస్తున్నారు. జర్నలిస్టులు టెర్రరిస్టుల్లా కనిపిస్తున్నారా అని ప్రశ్నిస్తున్నారు.
జర్నలిస్టులను నిర్బంధించిన ఢిల్లీ పోలీసుల స్పెషల్ సెల్ వారు వేసిన ప్రశ్నలను గమనిస్తే వీరిని ఎందుకు నిర్బంధించారో స్పష్టమవుతోంది. పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా 2019 20 లో ఢిల్లీలో జరిగిన ఆందోళన సందర్భంగా, మూడు వివాదాస్పద వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా 2020 21లో జరిగిన రైతుల ఆందోళన సందర్భంగా రాసిన కథనాల గురించి ప్రశ్నించారు.జెఎన్‌యులో విద్యార్థుల ఆందోళనకు సంబంధించి,

సిక్కు తీవ్రవాదం గురించి ఏవైన సంకేతాలు పంపారా అని ప్రశ్నించారు. ప్రభుత్వానికి ఇబ్బంది కలిగించే ‘న్యూస్‌క్లిక్’ కథనాల వల్లనే ఈ దాడులకు ఒడిగట్టినట్టు స్పష్టమవుతోంది. ‘న్యూస్‌క్లిక్’ వ్యవస్థాపక ఎడిటర్ ప్రబీర్ పురకస్థ్యను, హెచ్‌ఆర్ డైరెక్టర్ అమిత్ చక్రవర్తిని అరెస్టు చేసి, వారి పైన చట్ట వ్యతిరేక చర్యలకు పాల్పడుతున్నారని ‘ఉపా’లోని 13, 16, 17, 18, 22 సెక్షన్ల కింద, మత విద్వేషాలు రెచ్చగొడుతున్నారని భారత శిక్షాస్మృతిలోని 153 ఎ, 120 బి సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. వీరిని అరెస్టు చేసినట్టు మంగళవారం చాలా పొద్దుపోయాక కానీ చెప్పలేదు. అరెస్టు చేసిన వీరికి ఎఫ్‌ఐర్ కాపీ ఇవ్వకపోవడంతో వారు కోర్టుకు వెళ్ళి ఆ కాపీ తెచ్చుకోవలసి వచ్చింది. గడిచిన ఆగస్టు ఎనిమిదవ తేదీ ‘న్యూయార్క్ టైవ్‌‌సు’లో ‘న్యూస్‌క్లిక్’కు వ్యతిరేకంగా ఒక కథనం వచ్చింది. అమెరికాకు చెందిన బిలియనీర్ నెవిల్లి రాయ్ అనే వ్యాపార దిగ్గజం నుంచి వీరికి 38 కోట్ల రూపాయలు ముట్టాయన్నది ఆ కథనం సారాంశం. చైనాకు అనుకూల ప్రచారం చేయడానికే ఈ డబ్బు ముట్టినట్టు ఆ కథనం ఆరోపణ. ‘న్యూస్‌క్లిక్’కు వ్యతిరేకంగా నమోదైన ఆర్థిక నేరానికి సంబంధించి ఎలాంటి చర్య తీసుకోరాదని ఢిల్లీ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.

ఆరోపణల్లో నిజానిజాలను తేల్చకుండా, హైకోర్టు ఆదేశాలను లెక్కచేయకుండా ప్రభుత్వం పోలీసు దాడులు చేయించింది. ఈ దాడులను సమర్థించుకోవడానికి ప్రభుత్వ అనుకూల చానెళ్ళు కొత్త ఆరోపణలతో కొన్ని కథనాలను వండి వారుస్తున్నాయి. మానవ హక్కుల కార్యకర్త గౌతవ్‌ు నవలఖ, తీస్తా సెతల్వాద్‌లకు అందచేయడానికి చైనా నుంచి నెవిల్లి రాయ్ ద్వారా పురకస్థ్య, చక్రవర్తిలకు నిధులు వచ్చాయన్న విషయం ప్రభుత్వ పరిశీలనలో ఉందని ఆ ఛానెళ్ళ కథనం. గౌతవ్‌ు నవలఖ గృహనిర్బంధంలో, తీస్తాసెతల్వాద్ బెయిల్‌పై ఉన్నారు. వీరు డబ్బు మళ్ళింపునకు పాల్పడినట్టయితే, దాని గురించి ప్రశ్నించకుండా ముస్లింలపై, దళితులపై జరిగిన దాడులకు సంబంధించిన కథనాల గురించి పోలీసులు ఎందుక ప్రశ్నించారు? దీర్ఘకాలిక రైతు ఉద్యమం గురించిన కథనాలు, పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా జరిగిన ఆందోళన గురించిన కథనాలపై, కరోనా సమయంలో రాసిన కథనాలపై ఎందుకు ప్రశ్నించారు? ‘న్యూస్‌క్లిక్’ లో వచ్చే కథనాలే ప్రభుత్వానికి మింగుడుపడలేదని స్పష్టమవుతోంది. త్వరలో అయిదు రాష్ట్రాల శాసనసభ ఎన్నికలు జరగబోతున్నాయి.

మరో ఆరు నెలల్లో దేశ వ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికలు జరగనున్నాయి. ఈ సార్వత్రిక ఎన్నికల్లో బిజెపి సంపూర్ణ మెజారిటీతో మళ్ళీ అధికారాన్ని చేపట్టినట్టయితే అనేక కీలకమైన మార్పులు చేపట్టదలుచుకుంది. అందులో ముఖ్యంగా ఉమ్మడి పౌరస్మృతిని ప్రవేశపె ట్టడం, రాజ్యాంగంలో లౌకిక, సామ్యవాద పదాలను పూర్తిగా తొలగించడం, తద్వారా సమాజంలో ఆ భావజాలాన్ని పూర్తిగా తుడిచిపెట్టడం, అవకాశం ఏర్పడితే రాజ్యాంగాన్ని సమూలంగా మార్చేసి కొత్త రాజ్యాంగాన్ని తీసుకురావడం, వీలైతే హిందూమతాన్ని అధికార మతంగా ప్రకటించడం అతి ముఖ్యమెనవి. ఈ కీలక సమయంలో ప్రభుత్వ వ్యతిరేక కథనాలు వస్తే అవి ఎన్నికలపై తీవ్ర ప్రభావం చూపించే అవకాశం లేకపోలేదు. అందుకునే ప్రభుత్వం తొలుత పత్రికలు, న్యూస్ చానెళ్ళు, న్యూస్ వెబ్‌సైట్ల నోళ్ళు మూయించదలుచుకుంది. దేశంలో ప్రతిష్ఠాత్మకమైన ఎన్‌డిటివి అధినేత ప్రణయ్ రాయ్‌పైన దాడులు చేయించి, ఆ టివి షేర్లలో సింహ భాగం అదానీ కంపెనీలు కొనేలా చేయడం కీలక పరిణామం. అనేక పత్రికలు, ఛానెళ్ళ యజమానులపైన ఒత్తిడిలు తీసుకొచ్చి తమకు అనుకూలంగా మలుచుకుంది. ప్రముఖ న్యూస్ వెబ్‌సైట్ ‘ద వైర్’ పైన కూడా దాడులు చేయించింది. ఇప్పుడు ‘న్యూస్‌క్లిక్’పైన ఈ దాడులు చేయించింది.

బాబ్రీ మసీదు కూలగొట్టిన నేపథ్యంలో గోద్రా సంఘటన అనంతరం గుజరాత్‌లో మారణ హోమం జరిగింది. రెండు వర్గాల మధ్య జరిగిన మత ఘర్షణల్లో రెండు వేల మందికి పైగా ప్రాణాలను కోల్పోయారు. ఆధునిక భారత దేశ చరిత్రలో మాయని మచ్చగా మిగిలిపోయిన ఈ మత ఘర్షణల గురించి ప్రపంచం మొత్తానికి పత్రికలు, చానెళ్ళు, న్యూస్ వెబ్‌సైట్ల ద్వారా వెల్లడైంది.నాటి గుజరాత్ ప్రభుత్వానికే కాదు, ప్రధాని నరేంద్ర మోడీ రాజకీయ జీవితానికి కూడా మచ్చగా తయారైంది. ఆనాడు పత్రికలు, ప్రసార మాధ్యమాల నోళ్ళు నొక్కేసినట్టయితే ఈ దారుణం గురించి బయటి ప్రపంచానికి తెలిసేది కాదు. ఆ అనుభవంతోనే నరేంద్ర మోడీ ప్రధానిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి ఎక్కడ గొడవలు జరిగినా ముందు ఇంటర్‌నెట్‌ను ఆపేయడం మొదలు పెట్టారు. పత్రికలు, న్యూస్ చానెళ్ళు, న్యూస్ వెబ్‌సైట్లపైన ఆంక్షలు ప్రవేశపెట్టారు. ఢిల్లీలో అల్లర్లు జరిగినా ముందు ఇంటర్ నెట్‌ను ఆపేస్తారు. ఉత్తరప్రదేశ్‌లో అల్లర్లు జరిగినా ఇంటర్‌నెట్ ఆగిపోతుంది. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా కశ్మీర్‌లో నెలల తరబడి ఇంటర్ నెట్‌ను ఆపేశారు.భావప్రకటనా స్వేచ్ఛను అణచివేయడంలో ఏమాత్రం వెనుకాడరు.ప్రజాస్వామ్యం గురించి మన ‘విశ్వగురువు’ విశ్వవేదిక నెక్కి ఛప్పన్ ఇంచ్‌కాఛాతీ విరుచుకుని ఉపన్యాసాలిస్తారు.

‘న్యూస్‌క్లిక్’ సంఘటనలో పోలీసులు దాడి చేసింది సాధారణ జర్నలిస్టులపైన కాదు. వారంతా సమస్యలపట్ల ఆవేదన కలిగి, వృత్తిపట్ల నిబద్ధత కలిగి, ప్రతిష్ఠ గల జర్నలిస్టులు. వారిలో ఊర్మిలేష్ దేశ రాజధాని ఢిల్లీ నుంచి నలభై ఏళ్ళుగా పని చేసున్నారు. ప్రభుత్వ వైఫల్యాల గురించి, ముఖ్యంగా నరేంద్ర మోడీ అనుసరించే ఆధిపత్య విధానాల గురించి పదేళ్ళుగా రాస్తున్నారు. పరంజాయ్ గుహ ఠాకూర్ గత 40 ఏళ్ళుగా ప్రభుత్వంలో ఉన్న ఆశ్రిత పెట్టుబడిదారీ విధానం గురించి రాస్తున్నారు. అదానీ గ్రూపుల అవకతకల గురించి, దేశ ఆర్థిక లోతుపాతుల గురించి రాస్తున్నారు. భాషా సింగ్ కుల వ్యతిరేక ఉద్యమ కార్యకర్త మాత్రమే కాదు, మనుషుల చేత మరుగుదొడ్లు శుభ్రం చేయించే విధానానికి వ్యతిరేకంగా పోరాడే జర్నలిస్టు. సుభోద్ వర్మ టైవ్‌‌సు ఆఫ్ ఇండియా మాజీ ఎడిటర్. ‘ఉపా’ చట్టం కింద అరెస్టయిన ప్రబీర్ పురకస్థ్య పండితుడు, సైంటిస్ట్, కాలమిస్ట్, టెలివిజన్ యాంకర్.‘న్యూస్‌క్లిక్’ పైన జరిగిన దాడిని 18 మీడియా సంస్థలు ఖండించాయి. జర్నలిస్టులను టెర్రరిస్టుల కింద చిత్రించడం సబబు కాదని హితవు పలికాయి. ‘న్యూస్‌క్లిక్’ పై దాడి గురించి ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల కమిషన్ తీవ్ర విచారాన్ని వ్యక్తం చేసింది. జర్నలిస్టులను ‘ఉపా’ కింద అరెస్టు చేసి టెర్రరిస్టులుగా చిత్రించడం మంచిది కాదని హితవు పలికింది. ‘ఎమర్జెన్సీ కంటే దారుణమైన పరిస్థితులు నెలకొన్నాయి. ఎమర్జెన్సీ కొంత కాలానికే పరిమితమైంది.

నరేంద మోడీ ప్రభుత్వం గణతంత్ర స్వభావాన్ని, రాజ్యాంగాన్ని మార్చి వేస్తోంది. ప్రజల గొంతు నొక్కేస్తోంది. ‘ఉపా’ కింద కేసులు పెట్టడం గమనిస్తుంటే జర్నలిజానికి, టెర్రరిజానికి తేడా లేకుండా చేస్తోంది’ అని ప్రముఖ రచయిత్రి, బుకర్ ప్రైజ్ అవార్డు గ్రహీత అరుంధతీ రాయ్ ఆరోపించారు. ‘మోడీ లాగా ఇందిరాగాంధీలో కూడా ఆధిపత్యవాదం ఉండేది. కానీ ఆమె మతం ప్రాతిపదికగా విచక్షణ చూపలేదు. ఇలా విచక్షణ చూపేవారు గతంలో తుడిచిపెట్టుకు పోయారు’ అని ప్రముఖ చరిత్రకారుడు రాంగుహ అన్నారు. ‘చైనా నుంచి డబ్బులు తీసుకున్నట్టయితే ‘ఉపా’ కింద నేరం కాదు. ప్రధాని సహాయ నిధికి కూడా చైనా కంపెనీల నుంచి డబ్బులు అందాయి కదా!’ కదా ప్రముఖ న్యాయవాది ప్రశాంత్ భూషణ్ గుర్తు చేశారు. ‘ప్రజాస్వామ్యం సరైన మార్గంలో నడవడానికి అవసరమైన కఠిన వాస్తవాలను ప్రజలకు తెలియచేయడం, మాట్లాడడం జర్నలిస్టుల కర్తవ్యం’ అని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి డి.వై. చంద్రచూడ్ ఇటీవల గుర్తు చేసిన విషయాన్ని ఈ సందర్భంగా మనం మర్చిపోకూడదు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News