Thursday, December 26, 2024

ప్రజాస్వామ్యానికి ఇక పాతరేనా?

- Advertisement -
- Advertisement -

అమెరికా ఎన్నికలు ముగిశాయి. జనవరిలో నూతన అధ్యక్షుడిగా డోనాల్డ్ ట్రంప్ రెండవసారి అమెరికా అధ్యక్షుడుగా పదవిని చేపట్టబోతున్నారు. డోనాల్డ్ ట్రంప్ వ్యవహార శైలి మీద, ఆయన విధానాల మీద భిన్నాభిప్రాయాలున్నాయి. ఆయన రేపు అనుసరించబోయే పరిపాలన పద్ధతుల మీద అనేక భయాలున్నాయి. ముఖ్యంగా గత వందల ఏళ్ల అమెరికా ప్రజాస్వామ్య పునాదులనే ఆయన కదిలించబోతున్నట్టు సంకేతాలు అందుతున్నాయి. అవి సంకేతాలు మాత్రమే కాదు, అవి రేపు సత్యాలుగా అమలవుతాయని భావించే విశ్లేషకులు కూడా ఉన్నారు.

ప్రపంచానికి ప్రజాస్వామ్య నిర్వచనం అందించిన అబ్రహాం లింకన్ నిర్మించిన ప్రజాస్వామ్య సౌధానికి బీటలు పారడం ఖాయమని తెలుస్తున్నది. ప్రజల కోసం, ప్రజల చేత, ప్రజల యొక్క ప్రభుత్వ విధానమే ప్రజాస్వామ్యమని ప్రకటించిన అబ్రహాం లింకన్ వేసిన 180 సంవత్సరాల ప్రజాస్వామ్య బాటలు చెరిగిపోయే రోజులు దగ్గర పడుతున్నాయి. అబ్రహాం లింకన్ నుంచి మొదలుకొని ఎంతో మంది అమెరికా అధ్యక్షులు కనీసం ఉదారవాద ప్రజాస్వామ్య విధానాలను అమలు చేస్తూ వచ్చారు. ఆ మార్గాలను పూర్తిగా మూసివేసే ప్రక్రియకు డోనాల్డ్ ట్రంప్ మార్గం సుగమం చేసే పనికి పూనుకోబోతున్నారు. అయితే ఇప్పుడే కాదు గత అధ్యక్ష పదవి హయాంలో ఆయన కొన్నింటిని చవిచూపారు. ఈసారి దానికి ఒక పెద్ద ప్రణాళికను సిద్ధం చేసుకున్నారు.

డోనాల్డ్ ట్రంప్ సిద్ధం చేసిన అస్త్రం “ప్రాజెక్టు 2025. దీనిని హెరిటేజ్ ఫౌండేషన్ సంస్థ ట్రంప్ ఆదేశాల మేరకు తయారు చేసింది. ‘మాండేట్ ఫర్ లీడర్ షిప్ ది కన్సర్వేటివ్ ప్రామిస్ 2025” పేరుతో 922 పేజీల ఈ డాక్యుమెంట్ భవిష్యత్ అమెరికా రాజ్యాంగం కాబోతున్నది. డోనాల్డ్ ట్రంప్‌తో అధ్యక్ష భవనంలో పని చేసిన నిపుణుల కలయికతో ఏర్పడిన హెరిటేజ్ ఫౌండేషన్ అనే సంస్థ ఈ నివేదికను రూపొందించింది. ఇందులో ఐదు విభాగాలున్నాయి. మొదటిది వైట్‌హౌస్ యంత్రాంగం, పని విధానం, రెండవది రక్షణ వ్యవహారాలు, మూడవది సంక్షేమ రంగం, నాలుగవది ఆర్థిక రంగం, స్వతంత్ర నియంత్రణ సంస్థల నిర్మాణం. ఇవన్నీ కూడా గత విధానాల కన్న భిన్నంగానే ఉంటాయని ప్రతిపాదించారు. ప్రభుత్వం రక్షణ రంగం మీద, ఆర్థిక రంగం మీద చాలా తీవ్రమైన నిర్ణయాలు తీసుకోబోతున్నట్టు ట్రంప్ తాను ఎన్నికల ప్రచారంలో ప్రకటించారు. ఆర్థిక రంగానికి సంబంధించి ఎగుమతి, దిగుమతుల మీద కూడా భారీ మార్పులను ఆయన ప్రతిపాదించారు. వీటన్నింటితో పాటు గత వందల ఏళ్ళుగా అమలు చేస్తున్న సామాజిక, రాజకీయ విధానాలను సమూలంగా మార్చివేయాలని చూస్తున్నట్టు కనిపిస్తున్నది.

ప్రపంచంలోనే ఎన్నో సంక్షేమ కార్యక్రమాలకు, మైనారిటీల అభ్యున్నతికి అమలు జరుగుతున్న జాతి వివక్షకు విరుగుడుగా భావిస్తున్న ‘ఆఫర్ మేటివ్ ఆక్షన్’ అంటే జాతి వివక్షకు గురవుతున్న వర్గాలకు చేయూత నిచ్చే కార్యక్రమానికి తిలోదకాలు ఇవ్వబోతున్నట్టు ఈ నివేదిక స్పష్టం చేస్తున్నది. దీనికి తోడు శ్వేత జాతీయుల కోసం ఒక విధానాన్ని రూపొందించబోతున్నట్టు కూడా ఎన్నికల ప్రచారంలో ట్రంప్ అనుయాయులు ప్రకటించారు. ఇప్పటి వరకు నల్ల జాతీయులు వివక్షకు గురైనప్పుడు ప్రభుత్వం రక్షణగా ఉండేది. కాని శ్వేత జాతీయుల రక్షణకే చట్టం అంటే పీడన చేస్తున్న వాళ్లకు, వివక్షను అమలు చేస్తున్న వాళ్ల మీద ఇంకా ఎటువంటి నియంత్రణ ఉండదు. మన దేశంలో ఆధిపత్య కులాలకు రిజర్వేషన్లు అమలు చేసిన పద్ధతిలోనే ఈ విధానం ఉంది.

అంతేకాకుండా విద్యాలయాల్లో, ఉద్యోగాల్లో ఇప్పటి వరకు ఉన్న వెసులుబాటు భవిష్యత్‌లో ఉండదు. ట్రంప్ గత ప్రభుత్వంలోనే ఇవి మొదలయ్యాయి అంతేకాకుండా, నల్లజాతీయులకు ఒబామా ప్రభుత్వం అమలు చేసిన ఆరోగ్య సౌకర్యాలు ప్రత్యేకించి ఆరోగ్య బీమా పథకాన్ని ట్రంప్ ప్రభుత్వం సడలించింది. దానితో కరోనా సమయంలో కాని, తర్వాత కాని తెల్ల జాతీయుల కన్న నల్ల జాతీయులే ఎక్కువగా మరణించినట్టు లెక్కలు చెబుతున్నాయి. బైడెన్ ప్రభుత్వం దానిని పునరుద్ధరించింది. మళ్లీ ట్రంప్ దానిని తిరగదోడాలని భావిస్తున్నారు. అంతేకాకుండా, మరెన్నో సంక్షేమ కార్యక్రమాల్లో కూడా మార్పులు చేయనున్నట్టు తెలుస్తున్నది. పేద పిల్లల చదువు, పౌష్టికాహారం కోసం పది లక్షల మందికి అమలు చేస్తున్న ‘హెడ్ స్టార్ట్’ అనే పథకం సంపూర్ణంగా నిలిపివేయనున్నారు.

దానితో పేద పిల్లల చదువు ఇంకెంత మాత్రం కొనసాగడం కష్టం. అదే విధంగా మహిళల హక్కుల మీద ప్రత్యేకించి పిల్లలను కనడంలో ఇప్పటి వరకు ఉన్న స్వేచ్ఛ భవిష్యత్‌లో ఉండబోదని ఈ నివేదిక సారాంశం. ముఖ్యంగా అబార్షన్ హక్కులను ఆపివేస్తున్నట్టు కూడా నివేదిక స్పష్టం చేసింది. నిజానికి ఇటువంటి హక్కు కోసం అమెరికా మహిళలు, ప్రపంచ వ్యాప్తంగా ఉన్న మహిళలు ఎన్నో ఉద్యమాలు చేశారు. ఇటీవల ఇంద్ర ధనుస్సు ఉద్యమంగా పేరొందిన ఎల్‌జిబిటి హక్కుల రక్షణ ఇక హుష్‌కాకి. ఇప్పటి వరకు ఎల్‌జిబిటి సమూహాలు అనుభవిస్తున్న హక్కులు రద్దు చేయబోతున్నారు.
వీటన్నింటితో పాటు నల్ల జాతీయులు ఇతర మతాలకు ఉండే ప్రత్యేక రక్షణలు కూడా పునః పరిశీలన చేయబోతున్నారు. ముఖ్యంగా ఇస్లాం దేశాల నుంచి వచ్చే వారికి ఇచ్చే అనుమతులపైన ఆంక్షలు తేబోతున్నారు. గతంలో ట్రంప్ ప్రభుత్వం ముస్లింలు అత్యధికంగా ఉన్న అరబ్ దేశాల వారికి వీసాలు ఆపివేసిన విషయం తెలిసిందే. అదే విధంగా నల్ల జాతీయుల మీద పోలీసుల, శ్వేత జాతీయుల దాడులు జరుగుతూనే ఉంటాయి. వాటి నివారణకు ప్రత్యేకమైన చర్యలు ఉండబోవనేది తెలుస్తున్నది.

ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి. అసలు ప్రాజెక్టు 2025 ఎందుకు రూపొందించారు అనేవి సమాధానం చెప్పుకోవాల్సిన ప్రశ్నలు. అమెరికా జనాభాలో 2020 లెక్కల ప్రకారం 57.8 శాతం, మెక్సికో అండ్ హిస్పానిస్‌లు 18.7 శాతం, నల్ల జాతీయులు 12.1 శాతం, ఆసియా 5.9 శాతం, ఇతరులు 2.8 శాతం. అసలు అమెరికా జాతులు 0.7 శాతం. శ్వేత జాతీయులలో ఇటీవల ఉద్యోగ భద్రత, వ్యాపార వృద్ధి సమస్యలు పెరిగిపోయాయి. తమ ఉద్యోగాలను ఇతర జాతీయులు తన్నుకుపోతున్నారన్న అభద్రత పెరిగిపోయింది.

అదే సమయంలో ఉదారవాద విధానాల వల్ల అమెరికా ఆర్థిక రంగంలో ఇతరుల ప్రమేయం పెరిగిపోతున్నది. అదే సమయంలో ఇస్లాం తీవ్రవాదం సమస్య క్రిస్టియన్స్‌ను భయపెడుతున్నది. ఇజ్రాయెల్, పాలస్తీనా యుద్ధం కూడా అమెరికా శ్వేత జాతీయులను కలవరపరుస్తున్నది. దీనిని ఒక సాకుగా తీసుకుని అమెరికా శ్వేత జాతీ పెట్టుబడిదారి వర్గాలు మత విద్వేషాన్ని, జాతి వైరాన్ని క్రిస్టియన్ మత వ్యతిరేకమైన మహిళల, ఎల్‌జిబిటి హక్కుల విధానాలను తమ అస్త్రాలుగా వాడుకుంటున్నాయి. అందుకే రాజకీయ నేపథ్యం ఉన్న నాయకుల స్థానంలో స్వయంగా పెట్టుబడిదారుడైన ట్రంప్ రాజకీయ నాయకుని అవతార మెత్తారు. అమెరికా అమెరికన్లదే అంటూ నినాదాన్ని అందిపుచ్చుకున్నారు.

ఇక్కడ డోనాల్డ్ ట్రంప్ గురించి కూడా రెండు మాటలు చెప్పుకోవాలి. సామాజిక మార్పు అంటే ప్రగతిశీలం కావచ్చు, ప్రగతి నిరోధం కావచ్చు. ఏదైనా విధానాలు, సిద్ధాంతాలతో పాలు వ్యక్తులు కూడా ప్రధానమే. అందుకే ఇప్పుడు రాబోతున్న మార్పులో ట్రంప్ పాత్ర కూడా కీలకమైనదే. ట్రంప్ జర్మనీ నేపథ్యం కలిగిన కుటుంబం. గత ఎన్నికల్లో నాజీల గుర్తుగా ఉన్న ‘స్వస్తిక్’ను గోడల మీద ఎక్కించి జర్మనీ జాతి ప్రపంచాన్ని ఏలగలదని ప్రకటించారు. అమెరికాలోని శ్వేత జాతీయులలో జర్మనీ నేపథ్యం కలిగిన వాళ్లదే మెజారిటీ. గత ప్రభుత్వంలో జర్మనీ నేపథ్యం కలిగిన కుటుంబాల నుంచి వచ్చిన వాళ్లే కీలక భూమిక పోషించారు. మన దేశంలో జరుగుతున్న మార్పులకు, అమెరికాలో జరగబోతున్న మార్పులకు ఒకే రకమైన గమనం కనపడుతున్నది. మతం, జాతి, మెజారిటీ బలం, పెట్టుబడిదారుల ప్రోద్బలం ఇవి రెండు దేశాలకు సామ్యాలుగా కనిపిస్తున్నాయి. నిజానికి మన దేశ విధానాలే ట్రంప్‌ను, అతని అనుయాయులకు మార్గ దర్శకాలుగా ఉన్నాయేమో అన్న సందేహం కలుగక మానదు.

అణగారిన వర్గాల పట్ల, ప్రజాస్వామ్య హక్కుల పట్ల, మహిళల పట్ల, ఇతర వివక్షలకు గురవుతున్న వర్గాల పట్ల రెండు దేశాల ప్రభుత్వాలు ఒకే ధోరణిలో ఉన్నాయి. ఉదార స్వభావంలో ఉన్న కనీస ప్రజాస్వామ్య విలువలకు కూడా ఇక్కడ, అక్కడ ఎటువంటి ప్రాధాన్యత ఉండటం లేదు. మతం, పెట్టుబడి, జాత్యహంకారం కలగలిస్తే అమానుషమే ఆధిపత్యంలోకి వచ్చే అధికారాన్ని చెలాయిస్తుందనడానికి ఎన్నో ఉదాహరణలున్నాయి. ప్రపంచానికే ఒక వెలుగును అందించిన అబ్రహాం లింకన్ పార్టీ, ఆయన అధ్యక్షుడుగా చేసిన దేశం ప్రపంచాన్ని మధ్య యుగాల చీకట్లోకి తోసివేస్తుందనే సత్యాన్ని తలచుకుంటే భవిష్యత్ అగమ్యగోచరంగా ఉండబోతుంది.

దర్పణం

మల్లేపల్లి లక్ష్మయ్య

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News