Saturday, November 23, 2024

భారత్‌లో ఎమెర్జెన్సీ చీకటి రోజులు

- Advertisement -
- Advertisement -

భారత దేశ ప్రజాస్వామ్య చరిత్రలోనే జూన్ 25, 1975 చీకటి రోజుగా చిరస్థాయిగా నిలిచిపోయింది. ఇదే రోజున నాటి ప్రధాన మంత్రి ఇందిరా గాంధీ దేశంలో అంతర్గత అస్థిరత, అశాంతిని కారణంగా చూపుతూ జాతీయ అత్యవసర పరిస్థితి (Natio nal Emerg ency) ని ప్రకటించి, భారత రాజ్యాంగం దేశంలోని ప్రతి పౌరునికి కల్పించిన ప్రాథమిక హక్కులను తుంగలో తొక్కారు. ఇదే రోజున ప్రధాన మంత్రి ఆదేశాల మేరకు దేశంలోనే హేమాహేమీ నాయకులైన అటల్ బిహారీ వాజ్‌పేయి, మొరార్జీ దేశాయ్, బిజూ పట్నాయక్, చంద్ర శేఖర్ లాంటి మరెందరో ప్రముఖులతో సహా లక్ష మందికి పైగా ప్రజలను నిర్బంధించి జైళ్లలో పెట్టడమే కాక ఎన్నికలు వాయిదా వేయడం, ప్రభుత్వ వ్యతిరేక నిరసననలను ఉక్కుపాదంతో అణచివేయడం, పత్రికా స్వేచ్ఛపై ఆంక్షలు విధించడంతోపాటు కొన్ని చట్టాలను ప్రభుత్వానికి అనుకూలంగా మార్చడం జరిగింది. ఎమర్జెన్సీ ఇందిరా గాంధీకి ఒక పర్యాయపదంగా మారిపోయింది.

జూన్ 25, 1975 న విధించిన ఎమర్జెన్సీ మార్చి 21, 1977 వరకు అనగా 21 నెలల పాటు అమలులో ఉంది. నాటి రాష్ట్రపతి ఫక్రుద్దీన్ అలీ అహ్మద్ రాజ్యాంగంలోని ఆర్టికల్ 352 ప్రకారం దేశంలో అంతర్గత అశాంతిని కారణంగా ఉటంకిస్తూ అధికారికంగా దీనిని జారీ చేశారు.అత్యవసర పరిస్థితి విధింపుకి దేశంలో ప్రబలంగా నెలకొని ఉన్న అంతర్గత అస్థిరత, అశాంతి కారణంగా ఇందిరా గాంధీ పేర్కొన్నప్పటికీ, వాస్తవంగా 1971లో జరిగిన ఎన్నికల సందర్భంగా ఆమె అవకతవకలకు పాల్పడినట్లు మోపబడిన ఆరోపణలపై విచారణ జరిపిన అలహాబాద్ హైకోర్టు 1975లో ఆమెను దోషిగా నిర్ధారించి పార్లమెంటుకు అనర్హురాలుగా ప్రకటించడమే కాక తదుపరి 6 సంవత్సరాల పాటు ఎన్నుకోబడిన ఏ పదవిని నిర్వహించలేరని తీర్పునివ్వడం కారణంగానే ఆమె ఎమర్జెన్సీని ప్రకటించారన్నది అధిక సంఖ్యాకుల అభిప్రాయం. అసలు ఎమర్జెన్సీని ఎమర్జెన్సీ అని ఎందుకు పిలుస్తారు అంటే అధికారంలో ఉన్న ప్రభుత్వం కొన్ని ప్రత్యేక పరిస్థితులలో రాజ్యాంగం లో పొందుపరచబడిన అత్యవసర నిబంధనలను అమలు చేస్తుంది కాబట్టి.

భారత రాజ్యాంగం రాష్ట్రపతికి 1) జాతీయ అత్యవసర పరిస్థితి, 2) రాష్ట్ర అత్యవసర పరిస్థితి లేదా రాష్ట్రపతి పాలన 3) ఆర్థిక అత్యవసర పరిస్థితి అనే మూడు రకాల అత్యవసర పరిస్థితులను ప్రకటించే అధికారం ఇచ్చింది. మన రాజ్యాంగంలోని అత్యవసర నిబంధనలు జర్మనీలోని వీమర్ రాజ్యాంగం స్ఫూర్తి ఆధారంగా లిఖించబడ్డాయి. అత్యవసర పరిస్థితుల విధింపు కోసం భారత రాజ్యాంగంలోని అధికరణాలు 352 నుండి 360 (పార్ట్ XVIII) వరకు విపులంగా వివరించారు రాజ్యాంగ రూపకర్తలు. ఆర్టికల్ 352 జాతీయ అత్యవసర పరిస్థితి, ఆర్టికల్ 356 -రాష్ట్ర అత్యవసర పరిస్థితి (రాష్ట్రపతి పాలన), ఆర్టికల్ 360 ఆర్థిక అత్యవసర పరిస్థితి విధించే అవకాశం కల్పించింది.దేశ వ్యాప్తంగా అస్థిరత, అంతర్గత అశాంతి ఏర్పడి దేశ భద్రత, సార్వభౌమత్వానికి ముప్పు వాటిల్లే పరిస్థితులు ఉత్పన్నమైనప్పుడు, యుద్ధవాతావరణం ఏర్పడినప్పుడు, దేశంపై బాహ్య దురాక్రమణ (రెండు దేశాలు పరస్పరం సాయుధ బలగాలతో దాడి చేస్తామని బహిరంగంగా ప్రకటిస్తే అది యుద్ధం.

కానీ ఎలాంటి బహిరంగ ప్రకటన లేకుండా ఒక దేశం మరో దేశంపై సాయుధ బలగాలతో దాడికి దిగితే అది బాహ్య దురాక్రమణ) జరిగినప్పుడు, దేశంలో సాయుధ తిరుగుబాటు (44వ చట్ట సవరణ ద్వారా అంతర్గత అశాంతి బదులుగా సాయుధ తిరుగుబాటుగా మార్చబడినది) తలెత్తినప్పుడు, రాష్ట్రపతి భారత రాజ్యాంగం ద్వారా తనకు సంక్రమించిన విశేషాధికారాలను వినియోగించుకుని 352 అధికరణం ప్రకారం జాతీయ ఎమర్జెన్సీని ప్రకటించవచ్చు. జాతీయ ఎమర్జెన్సీ అమలులో ఉన్న సమయంలో కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వాల పరిధిలోని అంశాలపై చట్టాలు రూపొందించే అదనపు అధికారాలతో పాటు పౌరుల ప్రాథమిక హక్కులను (ప్రాణ, వ్యక్తిగత స్వేచ్ఛ మినహాయించి) ఉపసంహరించే విశేషాధికారాలు సంక్రమిస్తాయి. జాతీయ ఎమర్జెన్సీ దేశవ్యాప్తంగా కానీ లేదా కేవలం ఒక ప్రాంతంలో కానీ అమలు అయ్యేలా విధించవచ్చు. ప్రధాన మంత్రి అధ్యక్షతన కేంద్ర ప్రభుత్వ మంత్రి మండలి తీసుకున్న నిర్ణయాన్ని లిఖితపూర్వకంగా రాష్ట్రపతికి సిఫారసు చేసినప్పుడు మాత్రమే జాతీయ ఎమర్జెన్సీ ప్రకటించవలసి ఉంటుంది. ఈ తీర్మానాన్ని ఆమోదించడానికి ప్రత్యేక సంఖ్యా బలం (Special Majority) తప్పనిసరి. తీర్మానం ఆమోదం పొందిన తరువాత అత్యవసర పరిస్థితి గరిష్టంగా ఆరు నెలల పాటు అమలులో ఉంటుంది.
భారత రాజ్యాంగంలోని 355వ అధికరణం ప్రకారం, ప్రతి రాష్ట్రాన్ని బాహ్య దాడుల నుండి, అంతర్గత అశాంతి నుండి రక్షించడంతో పాటు ప్రతి రాష్ట్ర ప్రభుత్వం కూడా భారత రాజ్యాంగం లోని నిబంధనలకు అనుగుణంగా పాలనను నిర్వహించేలా పర్యవేక్షించే బాధ్యత కేంద్రానిదే. కాగా ఆర్టికల్ 356 ప్రకారం, ఏదైనా రాష్టంలో అధికార ప్రభుత్వం అసమర్థ పనితీరు, నిర్హేతుకమైన నిర్ణయాల వలన తీవ్రమైన విఘాతం ఏర్పడి పరిపాలన గాడి తప్పినట్లు గవర్నర్ పంపిన నివేదికతో రాష్ట్రపతి సంతృప్తి చెందినా లేదా రాజ్యాంగంలోని నిబంధనల ప్రకారం రాష్ట్ర పరిపాలన కొనసాగించలేని అత్యవసర పరిస్థితి ఏర్పడిందని భావించినా భారత రాజ్యాంగం ద్వారా తనకు సంక్రమించిన విశేషాధికారాలను వినియోగించుకుని రాష్ట్ర అత్యవసర పరిస్థితి లేదా రాష్ట్రపతి పాలనని ప్రకటించవచ్చు. రాష్ట్రపతి పాలన అమలులో ఉన్న సమయంలో కేంద్ర, రాష్ట్రపతి ద్వారా నియమితులైన గవర్నర్ ఆ రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగాన్ని, పాలనను తమ ఆధీనంలోకి తీసుకుంటాయి.

ఏదైనా రాష్ట్ర గవర్నర్ నివేదిక ఆధారంగా కూడా రాష్ట్రపతి ఆ రాష్ట్రంలో భారత రాజ్యాంగంలోని 356 అధికరణం ప్రకారం రాష్ట్రపతి పాలన విధించవచ్చు. తొలిసారి పంజాబ్‌లో 1951 జూన్‌లో రాష్ట్రపతి పాలన విధించిన నాటి నుండి ఇప్పటి వరకు దేశంలో 115 సార్లు రాష్ట్రపతి పాలన విధించారు. 1977లో 12 రాష్ట్రాల్లో, 1971నుంచి 1990 మధ్య 63 సార్లు, 19912010 మధ్య 27 సార్లు (కేవలం 1991, 1992లో మాత్రమే 9 సార్లు), 2011 2016 మధ్య 5 సార్లు రాష్ట్రపతి పాలన విధించారు. అయితే, 1994లో ఎస్‌ఆర్ బొమ్మై కేసులో సుప్రీంకోర్టు కీలక తీర్పు తర్వాత ఆర్టికల్ 356ని విమర్శించకుండా ఉపయోగించడం చాలా వరకు తగ్గిందని చెప్పవచ్చు.భారతదేశం ఆర్థిక స్థిరత్వం, రుణ యోగ్యతలకు ముప్పు వాటిల్లినట్లు లేదా దేశంలోని ఏదైనా ప్రాంతంలో తీవ్ర ఆర్ధిక సంక్షోభం తలెత్తినట్లు నిర్ధారించే నివేదికలతో రాష్ట్రపతి సంతృప్తి చెందితే ఆర్ధిక అత్యవసర పరిస్థితిని ప్రకటించవచ్చు. కాగా రాష్ట్రపతి ఆర్ధిక అత్యవసర పరిస్థితిని ప్రకటించిన రెండు నెలల్లో పార్లమెంటు ఉభయ సభలు దానిని ఆమోదించవలసి ఉంటుంది. అయితే భారత దేశ చరిత్రలో ఇంతవరకు ఎన్నడూ ఆర్ధిక అత్యవసర పరిస్థితి విధించలేదు.
మన దేశంలో ఇప్పటి వరకు జాతీయ ఎమర్జెన్సీ (అత్యవసర పరిస్థితి) మూడు సార్లు విధించగా, రాష్ట్రపతి పాలన వివిధ రాష్ట్రాలలో పలుమార్లు విధించిన దృష్టాంతాలున్నాయి. మొట్టమొదటి జాతీయ ఎమర్జెన్సీ (అత్యవసర పరిస్థితి) 1962లో భారత్, -చైనా యుద్ధం సందర్భంగా విధించినప్పటికీ, చరిత్రలో చిరస్థాయిగా, అత్యంత భయానకమైన ఎమర్జెన్సీగా చరిత్రలో నిలిచిపోయినది 1975లో ఇందిరా గాంధీ విధించినది అని నిస్సందేహంగా పేర్కొనవచ్చు. మొదటిసారి 1962 అక్టోబర్ 26న ఇండో, చైనా యుద్ధం ప్రారంభమైనప్పుడు నాటి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ ఎమర్జెన్సీని ప్రకటించారు. కాల్పుల విరమణ తర్వాత కూడా నెహ్రూ ఎమర్జెన్సీని రద్దు చేయకపోవడంతో అది 1965లో ఇండో, పాక్ యుద్ధం జరిగే వరకు, ఆ తరువాత 1966లో తాష్కెంట్ ఒప్పందంతో శత్రుత్వం ముగిసినప్పటికీ కొనసాగి చివరకు 1968లో ఎత్తివేయబడింది. రెండవ సారి బంగ్లాదేశ్ విముక్తి కోసం యుద్ధం ప్రారంభమైన 1971 డిసెంబర్ 3న ప్రధాని ఇందిరా గాంధీ ప్రకటించిన అత్యవసర పరిస్థితి అదే సంవత్సరం డిసెంబర్ 17న శత్రుత్వాలు ముగిసినప్పటికీ రద్దు చేయబడలేదు.

చివరగా మూడో సారి 25 జూన్ 1975న (1971 నాటి అత్యవసర పరిస్థితి) అమలులో ఉండగానే, మరోసారి ఎమర్జెన్సీని ప్రకటించారు. ఇది భారత దేశ ప్రజాస్వామ్య చరిత్రలోనే అత్యంత భయానకమైన అత్యవసర పరిస్థితి (ది డార్కెస్ట్ అవర్) గా చరిత్ర పుటల్లో నిలిచిపోయింది.లోక్ నాయక్ (ప్రజల నాయకుడు)గా అత్యంత ప్రజాదరణ పొందిన జయప్రకాష్ నారాయణ్ బీహార్‌లో 1975కి ముందు ఇందిరా గాంధీ నేతృత్వంలోని ప్రభుత్వానికి వ్యతిరేకంగా అనేక నిరసనలు నిర్వహించారు. ఆమె నేతృత్వంలో గాడి తప్పిన వ్యవస్థను సంస్కరించడానికి, బలీయంగా నాటుకుపోయిన అవినీతి, ఆశ్రిత పక్షపాతాలను పారద్రోలడానికి, ద్రవ్యోల్బణానికి వ్యతిరేకంగా ఆయన తీవ్రంగా ఉద్యమించారు. 1971 లోక్‌సభ ఎన్నికల్లో గెలవడానికి ఇందిరా గాంధీ ఎన్నికల అక్రమాలకు పాల్పడ్డారన్న ఆరోపణలతో ఏకీభవించిన అలహాబాద్ హైకోర్టు 1975లో ఇందిరా గాంధీని దోషిగా నిర్ధారించి 6 సంవత్సరాల పాటు ఎటువంటి ప్రభుత్వ కార్యాలయాన్ని నిర్వహించకుండా నిషేధించింది. తత్ఫలితంగా లోక్‌సభ ఎన్నికల్లో యుపిలోని రాయ్‌బరేలీ నియోజకవర్గం నుంచి ఆమె ఎన్నిక రద్దయింది.

ఈ నిర్ణయం తర్వాత, ఇందిరా గాంధీ సుప్రీంకోర్టును ఆశ్రయించి ప్రధాన మంత్రి పదవిలో కొనసాగడంతో జయప్రకాశ్ నారాయణ్ రామ్‌లీలా మైదాన్‌లో నిరసనలు ఉధృతం చేశారు. దీంతో ప్రధాన మంత్రి పదవిని నిలబెట్టుకోవడానికి ఇందిరా గాంధీ అత్యవసర పరిస్థితిని ప్రకటించారు. జయప్రకాష్ నారాయణ్, రాజ్ నారాయణ్, మొరార్జీ దేశాయ్, చరణ్ సింగ్, జీవత్రామ్ కృపలానీ, అటల్ బిహారీ వాజ్‌పేయి, లాల్ కృష్ణ అద్వానీ, విజయరాజే సింధియా, అరుణ్ జైట్లీ, జై కిషన్ గుప్తా సత్యేంద్ర నారాయణ్ సిన్హా, గాయత్రీ దేవి, జైపూర్‌లోని డోవజర్ రాణి, ఇతర నాయకులను ఇందిరా గాంధీ నేతృత్వంలోని ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడిన వెంటనే అరెస్టు చేశారు.1975లో జాతీయ అత్యవసర పరిస్థితి ముగిసిన తర్వాత 1977లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో ఇందిరా గాంధీ పరాజయం పొందడమే కాక భారత జాతీయ కాంగ్రెస్ చిత్తుగా ఓడిపోయి అధికారాన్ని కోల్పోయింది. కాగా జయప్రకాశ్ నారాయణ్ చొరవతో జనతా పార్టీ గా అవతరించిన భావసారూప్యత గల జనసంఘ్ లాంటి తదితర పార్టీలు మొరార్జీ దేశాయి ప్రధాన మంత్రిగా మొట్టమొదటి సారి కాంగ్రసేతర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినప్పటికీ భాగస్వామ్య పార్టీల మధ్య అనైక్యత కారణంగా 1980 పార్లమెంట్ ఎన్నికల అనంతరం కాంగ్రెస్ పార్టీ తిరిగి ప్రభుత్వం ఏర్పాటు చేయడంతో ఆమె మరోసారి తిరిగి ప్రధాన మంత్రి పదవిని చేపట్టారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News