మన తెలంగాణ/సిటీ బ్యూరో: హైడ్రా ఇప్పటి వరకు 262 అక్రమనిర్మాణాలను కూల్చివేసి 111.72 ఎకరాల భూమిని రక్షించినట్టు కమిషనర్ రంగనాథ్ వెల్లడించారు. గత రెండు నెలల నుంచి ఔటర్ పరిధిలోని చెరువులు, ప్రభుత్వ భూములు, పార్కులు, నాలాలు, రోడ్లపై చోటుచేసుకున్న అక్రమ నిర్మాణాలను తొలగించినట్టు బుధవారం విడుదల చేసిన ప్రకటనలో తెలిపారు. ఇందులో బడాబాబులకు చెందిన అక్రనిర్మాణాలు, పార్కుల కబ్జాలు, రోడ్ల ఆక్రమణలు ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. మొత్తం 23 ప్రాంతాల్లో కూల్చివేతలు చేపట్టగా అందులో 12 చెరువుల్లోని నిర్మాణాలను తొలగించి ఎఫ్‌టిఎల్, బఫర్ జోన్లను పరిరక్షించినట్టు కమిషనర్ తెలిపారు. 5 ప్రాంతాల్లోని పార్కులోకి చొచ్చుకొచ్చిన నిర్మాణాలను తొలగించినట్టు వివరించారు.
కూల్చివేతల్లో ప్రధానంగా జీ+5. జీ+3, జీ+2, జీ+1 ఫ్లోర్ల భవనాలు ఉన్నాయని పేర్కొన్నారు. అమీన్‌పూర్ లేక్‌లో చర్యలు తీసుకుని 51.78 ఎకరాలను, రాజేంద్రనగర్ శివరాంపల్లిలోని బూమ్‌రుఖ్ ఉద్ దౌలా చెరువులోని నిర్మాణాలను నేలమట్టం చేసి 12 ఎకరాల భూమిని స్వాధీనం చేసుకున్నామనీ, సున్నం చెరువు(మాదాపూర్)లో 10 ఎకరాలను, గండిపేట్ పరిధిలోని ఖానాపూర్‌లో 8.75 ఎకరాలను, గండిపేట్ చిల్కూర్‌లో 6. 5 ఎకరాలను, తుమ్మిడికుంటలోని ఎన్ కన్వెన్షన్‌లో నిర్మాణాలను తొలగించి 4.9 ఎకరాలను, గాజులరామారంలోని చింతల్ చెరువులో ఆక్రమణలు తొలగించి 3.5 ఎకరాల భూమిని స్వాధీనం, మల్లంపేట్ చెరువులోని నిర్మాణాలను తొలగించి 2.50 ఎకరాలను స్వాధీనం చేసుకున్నట్టు కమిషనర్ రంగనాథ్ వివరించారు.