Sunday, December 22, 2024

ఉత్తర్వులు ధిక్కరిస్తే కూల్చేసిన కట్టడాల పునరుద్ధరణకు ఆదేశిస్తాం

- Advertisement -
- Advertisement -

గుజరాత్ ప్రభుత్వానికి సుప్రీం హెచ్చరిక

న్యూఢిల్లీ: ఆస్తుల కూల్చివేతపై తాము ఇదివరకు ఇచ్చిన ఉత్తర్వుల ధిక్కరణకు గుజరాత్ ప్రభుత్వ అధికారులు పాల్పడిన పక్షంలో కూల్చివేసిన ఆస్తులను పునరుద్ధరించాలని వారిని ఆదేశిస్తామని సుప్రీంకోర్టు శుక్రవారం తెలిపింది. తమ అనుమతి లేకుండా దేశవ్యాప్తంగా నేరారోపణలు ఎదుర్కొంటున్న నిందితులతోసహా ఎవరి ఆస్తులను కూల్చివేయకూడదని ఆదేశిస్తూ సెప్టెంబర్ 17న సుప్రీంకోర్టు ఉత్తర్వులు జారీచేసింది. అయితే ఈ ఉత్తర్వులను ఉల్లంఘించిన గుజరాత్ ప్రభుత్వంపై కోర్టు ధిక్కరణ చర్యలు చేపట్టాలని కోరుతూ దాఖలైన పిటిషన్లపై జస్టిస్ బిఆర్ గవాయ్, జస్టిస్ కెవి విశ్వనాథన్‌తో కూడిన ధర్మాసనం శుక్రవారం విచారణ జరిపింది.

సుప్రీంకోర్టు ఉత్తర్వులు జారీ చేసినప్పటికీ గుజరాత్ ప్రభుత్వ అధికారులు తమ ఆస్తులను కూల్చివేశారని సుమ్మస్త్ పట్నీ ముస్లిం జమాత్ తరఫున సీనియర్ న్యాయవాది సంజయ్ హెగ్డే ధర్మాసనం దృష్టికి తీసుకువచ్చారు. అయితే ఈ కట్టడాలు సముద్ర తీరానికి చేరువలో ఉన్నాయని, సోమనాథ్ ఆలయానికి 340 మీటర్ల దూరంలో ఇవి ఉన్నాయని గుజరాత్ ప్రభుత్వం తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా కోర్టుకు తెలిపారు. న్యాయస్థానం ఇచ్చిన ఆదేశాల పరిధిలోనే ఈ కట్టడం ఉందని యన చెప్పారు. సుప్రీంకోర్టు గత నెల ఇచ్చిన తన ఉత్తర్వులో రోడ్డు, వీధి, ఫుట్‌పాత్ వంటి ప్రభుత్వ స్థలంతోపాటు రైల్వేలైను, నదులు లేక చెరువులు, ఇతర నీటి వనరులకు అడ్డంకిగా ఉన్న ఏ కట్టడమైనా కూల్చివేత నుంచి మినహాయింపు లేదని స్పష్టం చేసింది.

కాగా..శుక్రవారం విచారణ సందర్భంగా న్యాయమూర్తులు గుజరాత్ ప్రభుత్వ అధికారులకు హెచ్చరిక జారీచేశారు. తమ ఉత్తర్వును ఉల్లంఘించి కోర్టు ధిక్కరణకు పాల్పడినట్లు తేలిన పక్షంలో వారిని జైలుకు పంపించడంతోపాటు కూల్చివేసిన కట్టడాలను మళ్లీ పునరుద్ధరించాలని ఆదేశిస్తామని న్యాయస్థానం హెచ్చరించింది. పిటిషన్‌పై ప్రతివాదులకు ఎటువంటి నోటీసు ఇవ్వని ధర్మాసనం తన జవాబును దాఖలు చేయవలసిందిగా తుషార్ మెహతాను ఆదేశిస్తూ కేసు తదుపరి విచారణను అక్టోబర్ 16వ తేదీకి వాయిదా వేసింది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News